అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!

“బాహుబలి” అనంతరం రాణా సైన్ చేయడమే కాక షూటింగ్ మొదలుపెట్టిన సినిమా “అరణ్య”. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం పలు కారణాల వల్ల మూడేళ్ళ పాటు షూటింగ్ జరుపుకోవడమే కాక కరోనా-లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు నేడు (మార్చి 26) విడుదలైంది. ఎక్కువ ఏనుగులతో షూటింగ్ చేయడానికి ఇండియాలో సరైన పర్మిషన్స్ & ఏనుగులు లేకపోవడంతో చిత్రబృందం థాయ్ ల్యాండ్, శ్రీలంక వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేయడం విశేషం. దాదాపుగా 800 రోజులపాటు అందరూ ఎంతో శ్రమించి తెరకెక్కింకిన ఈ చిత్రం రిజల్ట్ వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్నిచ్చిందో లేదో చూద్దాం..!!

కథ: అరణ్య (రాణా దగ్గుబాటి) విశాఖపట్నం దగ్గరలోని రిజర్వ్ ఫారెస్ట్ లో ఏనుగుల బాగోగులు చూసుకుంటూ ప్రకృతితో కలిసి సంతోషకరమైన జీవితం గడుపుతూ ఉంటాడు. ఆ అడివి మొత్తం తన తాతముత్తాతల ఆస్తి అయినప్పటికీ.. ఏనుగులు ఆనందంగా ఉండడం మరియు చెట్లు ఉంటేనే మనం ఉంటాం అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆ అడవిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అరణ్య ఒక్కడే అడవిలో దాదాపుగా లక్ష మొక్కలు నాటి నాటి ప్రెసిడెంట్ ఏ.పి.జె.అబ్ధుల్ కలాం నుంచి ప్రెసిడెంట్ మెడల్ కూడా అందుకుంటాడు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అరణ్య తన ఆస్తి మరియు ప్రకృతి ఒడి అయిన అడివిని అటవీ శాఖా మంత్రి కనకమేడల రాజా గోపాలం (అనంత్ మహదేవన్) నుంచి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అడవిని నాశనం చేసి 500 ఎకరాల్లో అద్భుతమైన టౌన్ షిప్ కట్టాలని మినిస్టర్, అలా కడితే ఏనుగులు నీటి కోసం ఇబ్బందిపడాల్సి వస్తుంది అని అరణ్య తలపడతారు. అయితే.. రాజకీయ బలం ముందు మనిషి బలం నిలవదు.

అడవిని, ఏనుగులను కాపాడుకోవడం కోసం అరణ్య ఏం చేశాడు? అందుకోసం ఏం కోల్పోయాడు? చివరికి ఎలా గెలిచాడు? అనేది “అరణ్య” కథాంశం.

నటీనటుల పనితీరు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ అన్నట్లు నటుడిగా రాణా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అడవి మనిషిగా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. ఏనుగులతో, చెట్లతో రాణా మాట్లాడే సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. రాణా నిజంగానే వాటితో మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. అయితే.. కంటిన్యూటీ చాలా చోట్ల మిస్ అయ్యింది. ఎక్కువరోజులు షూటింగ్ చేయడం వల్ల అలా జరిగి ఉండొచ్చు. అది పెద్ద మైనస్ కాకపోయినా సినిమాను బాగా పరికించి చూసేవాళ్ళకు, లీనమయ్యేవాళ్ళకు తెలిసిపోతుంది.

విష్ణు విశాల్ మావటివాడిగా, ప్రేమికుడిగా అలరించడానికి ప్రయత్నించాడు. విష్ణు విశాల్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు దాదాపు 20 నిమిషాల దాకా కేటాయించి సెకండాఫ్ లో అసలు క్యారెక్టర్ ను మొత్తానికి ఎందుకు ఎడిట్ చేశాడు అనేది అర్ధం కాని విషయం. అందువల్ల అర్ధాంతరంగా ముగిసిన విష్ణు విశాల్ పాత్ర కథకు, కథనానికి పెద్దగా సహాయపడలేకపోయింది.

నక్సలైట్ గా జోయా హుస్సేన్, బాధ్యతగల జర్నలిస్ట్ గా శ్రియ పిల్గోంకర్, కుటిల రాజకీయ నాయకుడిగా అనంత్ మహదేవన్, ఫారెస్ట్ ఆఫీసర్ గా బోస్ వెంకట్, సహాయకుడిగా రఘుబాబు ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు: క్లైమాక్స్ మినహా ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా ఆడియన్స్ ను ఒక రియలిస్టిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్రబృందం పడిన తపన, శ్రమను అభినందించాల్సిందే. నిజమైన ఏనుగులతో, రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం, మంచి లొకేషన్స్ కోసం ప్రపంచాన్ని జల్లెడపట్టడం అనేది మామూలు విషయం కాదు. అందుకు దర్శకుడు ప్రభు సోల్మన్ ను, నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ను మెచ్చుకోవాలి. ప్రభు సోల్మన్ ఒక మంచి ధ్యేయంతో సినిమాను తెరకెక్కించాడు. చాలావరకూ సినిమాలో కనిపించే అంశాలు ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఒక చోట జరుగుతున్నవే. ఆధునీకరణ, నవీకరణ పేర్లతో ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తున్నాం. ముఖ్యంగా అడవులను, చెట్లు ఏదో చెత్త అన్నట్లుగా భావిస్తూ మన భవిష్యత్ ను మనమే చేజేతులా ఏ విధంగా పాడు చేసుకుంటున్నాం అనేది కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు ప్రభు.

అయితే.. ఆలోచనతోపాటు ఆచరణ కూడా అంతే ఎఫెక్టివ్ గా, ఇంపాక్ట్ క్రియేట్ చేసేదిగా ఉండాలి. ప్రభు సోల్మన్ ఆలోచన పారదర్శకమైనదే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే.. ఆచరణలో మాత్రం చాలా తప్పులు దొర్లాయి. 162 నిమిషాల సినిమాను 124 నిమిషాలకు కట్ చేయడం వల్ల ప్రభు పడిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయింది. సో, డైరెక్టర్ విజన్ ఏమిటి అనేది ఆడియన్స్ కి క్లారిటీ లేకుండాపోయింది. ఆ 36 నిమిషాల సినిమాను ఎందుకు ఎడిట్ చేసేశారు అనేది తెలిసినా, లేక డిజిటల్ రిలీజ్ టైమ్ లో ఆ డిలీట్ చేసిన సన్నివేశాలను యాడ్ చేసినా కొంచెం క్లారిటీ రావచ్చు.

సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్ లో చిత్రబృందం పడిన కష్టం కనిపిస్తుంది. టెక్నికల్ టీం అందరూ తమ బెస్ట్ ను సినిమా కోసం ఇచ్చారు. అన్నిటికీ మించి దాదాపు 10 నిజమైన ఏనుగులతో షూటింగ్ చేయడం అనేది ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన విషయం.

విశ్లేషణ: ఏనుగులు ప్రధాన పాత్రలో సినిమాలు ఆడియన్స్ కు కొత్త కాదు, “రాజేంద్రుడు గజేంద్రుడు” టైమ్ నుంచి జనాలు ఈ తరహా సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారు. మధ్యలో ఏనుగుల సినిమాలు అంటే వాటి దంతాల కోసం హీరో-విలన్ కొట్టుకోవడమే అన్నట్లుగా అయిపోయింది. అయితే.. అరణ్య ఆ తరహా సినిమాలకు భిన్నంగా, ఒక డిఫరెంట్ యాంగిల్ లో తెరకెక్కిన సినిమా. ప్రకృతిలో జంతువులూ ఒక భాగమే, ముఖ్యంగా ఏనుగులే ఈ ప్రకృతిని వ్యాపింపజేసేవి అని చాటి చెప్పే ప్రయత్నమే “అరణ్య”. కొద్దిపాటి టెక్నికల్ & లాజికల్ మిస్ట్కేక్స్ మినహా “అరణ్య”లో మైనస్ లు పెద్దగా కనిపించవు. ఆ 36 నిమిషాలు కట్ చేయకుండా ఉండి, ఒక ప్రోపర్ ఎండింగ్ ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఆడియన్స్ మనసుల్లోకి చొచ్చుకుపోయేది. క్యారెక్టర్ డెవెలప్మంట్, ఎమోషనల్ కనెక్టివిటీ, లాజిక్స్ మిస్ అవ్వడంతో “అరణ్య” ఓ సాధారణ చిత్రంగా మిగిలిపోయింది.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఒక మంచి ధ్యేయంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. చిత్రబృందం పడిన శ్రమ కోసం, రాణా సహజమైన నటన కోసం తప్పకుండా ఒకసారి చూడాల్సిందే.

రేటింగ్: 2.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus