మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో రూపుదిద్దుకున్న “అరవింద సమేత వీర రాఘవ” మూవీ ఈనెల 11 న రిలీజ్ అయి కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీ తొలి వీకెండ్ లోనే 111 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. దసరా సెలవులు కావడంతో వీక్ డేస్ లోను భారీ కలక్షన్స్ సాధిస్తోంది. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి 151 కోట్ల మార్కును అధిగమించింది. ఈ కలక్షన్స్ తో చిత్ర బృందం ఆనందంలో ఉంటే.. విమర్శలు తలనొప్పిగా మారాయి. కొన్ని రోజుల క్రితం రాయలసీమ యువత ఈ సినిమాలో తమ ప్రాంతాన్ని, తమ ప్రాంత ప్రజలను కించపరిచేలా చూపించారని..
అందుకే ప్రదర్శన నిలిపివేయాలని కోరారు. ఆ సమస్య సద్దుమనగానే ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఈ చిత్రంపై విరుచుకుపడ్డారు. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందించే ఈ సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలను అవమానించేలా సినిమా ఉందని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. మరి ఇతని విమర్శలను చిత్రబృందం ఎలా తిప్పికొడుతుందో చూడాలి.