“కేరాఫ్ కంచరపాలెం” సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం “అర్ధ శతాబ్ధం”. రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యేందుకు ప్రయత్నించి.. పరిస్థితులు సహకరించక ఆహా యాప్ లో విడుదలైంది. టీజర్ & పోస్టర్స్ తో విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ట్రైలర్ తో అలరించలేకపోయింది. మరి సినిమాగా ఎలా ఉంది అనేది చూద్దాం..!!
కథ: స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు అయినా ఇంకా కులం పేరుతో కొట్టుకు సచ్చే, చంపే ఓ గ్రామం. ఆ గ్రామంలో యువకుడు కృష్ణ (కార్తీక్ రత్నం), అదే ఊరికి మినీ పెద్ద లాంటి రామన్న (సాయికుమార్) కూతురు పుష్ప (కృష్ణ ప్రియ)ను స్కూలు వయసు నుంచి ప్రేమిస్తాడు. ఇక సంపాదన కోసం దుబాయ్ వెళ్ళాలి అనుకునే తరుణం దగ్గరపడుతుండడంతో.. ఒక పువ్వు ఇచ్చి పుష్పకు తన ప్రేమ గురించి చెప్పాలి అనుకుంటాడు కృష్ణ. ఆ పువ్వు విషయంలో తనకు తెలియకుండానే ఓ మినీ మారణహోమాన్ని సృష్టిస్తాడు. ఈ కుల మారణ హోమాన్ని ఆపడానికి ఎస్.ఐ.రంజిత్ ఏం చేశాడు? చివరికి ఏం జరిగింది? అనేది “అర్ధ శతాబ్ధం” కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడు కార్తీక్ రత్నం తన పాత్రకు న్యాయం చేశాడు. కృష్ణ పాత్రలో అమాయక ప్రేమికుడిగా, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన యువకుడిగా మంచి ఎమోషన్స్ పలికించాడు. కృష్ణ ప్రియా లుక్స్ పరంగా పర్వాలేదు కానీ.. నటిగా పాత్రకు తగ్గ హావభావాలు పండించలేకపోయింది. చాలా ముఖ్యమైన సన్నివేశాల్లో బ్లాంక్ ఫేస్ పెట్టడం అనేది సినిమాకి మైనస్.
సాయికుమార్, దయానంద్, రాజా రవీంద్ర, పవిత్ర లోకేష్, రామరాజు, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ ఆర్టిస్టులు చక్కని నటన కనబరిచినప్పటికీ.. వారి పాత్రలు సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడంతో.. అంతమంది ప్రతిభ బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇక నవీన్ చంద్ర క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నుంచి ఎండింగ్ వరకూ.. ఇలాంటి ఎయిమ్ లెస్ క్యారెక్టర్ ను నవీన్ ఎలా అంగీకరించాడు? అనే ఆలోచన తప్ప మరొకటి రాదు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు రవీంద్ర పుల్లే మంచి క్యాస్టింగ్, కోర్ పాయింట్ తీసుకున్నాడు. అయితే.. కథను నడిపించిన విధానం, కాన్ఫ్లిక్ట్ పాయింట్ & నటీనటుల క్యారెక్టర్స్ రాసుకున్న విధానం మాత్రం హాస్యాస్పదం. కులం గురించి కొట్లాటలు ఇప్పటికీ చాలా చూశాం, కానీ “అర్ధ శతాబ్ధం”లో గొడవలు, కొట్లాటలు, చంపుకోవడాలు మాత్రం చాలా సిల్లీగా ఉంటాయి. కుల హత్యలు అనేది చాలా సీరియస్ ఇష్యూ.. ఇదే పాయింట్ మీద హిందీలో వచ్చిన “ఆర్టికల్ 15” ఎంత అద్భుతంగా ఉంటుందో.. “అర్ధ శతాబ్ధం” అంత కంపరంగా ఉంటుంది. అసలు దర్శకుడు ఏం చెప్పాలి అనుకున్నాడు అనే విషయం చివరికి ఫ్రేమ్ కి వచ్చేసరికి సగటు ప్రేక్షకుడికి అర్ధం కాదు. తరాలు మారినా, యుగాలు మారినా మనిషిలో కులం అనే పిచ్చి ఎంత చొచ్చుకుపోయిందో, కుల పిచ్చి లేదు అంటూ పైకి బీరాలు పోయే పెద్దల మనసుల్లో కులం అనేది ఎంతగా పాటుకుపోయి ఉందో చూపించాలనుకున్నాడు. ఆలోచన బాగుంది, కానీ ఆచరణలో ప్రయత్న లోపం కనిపిస్తుంది. మరీ ఇంత సిల్లీగా తీయాలా? అనిపిస్తుంది.
నవ్ఫాల్ రాజా అసి సంగీతం ఒక్కటే సినిమా మొత్తానికి ప్లస్ పాయింట్. సదరు పాటల్ని సరిగా చిత్రించలేకపోయినప్పటికీ.. వినడానికి మాత్రం బాగున్నాయి. అలాగే.. అశ్కేర్ -వెంకట్ శాకమూరి-వేణు త్రయం సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు. జె.ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కఠినంగా ఉండాల్సింది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ గురించి పెద్దగా మాట్లాడుకునే అవకాశం సదరు డిపార్ట్ మెంట్స్ ఇవ్వలేదు.
విశ్లేషణ: “అర్ధ శతాబ్ధం” అనే ఫస్ట్ లుక్ పోస్టర్ & టీజర్ రిలీజ్ చేసినప్పుడు.. దేవకట్ట “ప్రస్థానం, ఆటోనగర్ సూర్య” స్థాయి ఇంటెన్సిటీ కనిపించింది. ట్రైలర్ తో అంచనాలు ముందే తగ్గించేశాడు దర్శకుడు. ఇక సినిమా చూస్తున్నప్పుడు ఇంత ఇమ్మెచ్యూర్డ్ గా ఎలా తీశాడు? అనే సందేహం తోపాటు అనే ఆలోచనతోపాటు.. అద్భుతమైన టైటిల్, మంచి నటులను వేస్ట్ చేశాడనే బాధ కూడా కలుగుతుంది. సినిమాకి ఇంటెన్సిటీ, మ్యూజిక్, మూల కథతోపాటు కథనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం యువ దర్శకులు తెలుసుకోలేనంతకాలం “అర్ధ శతాబ్ధం” లాంటి అద్భుతమైన టైటిల్స్ వేస్ట్ అవుతూనే ఉంటాయి.
రేటింగ్: 1/5