టాలీవుడ్ సీనియర్ నటి హేమ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 76 ఏళ్ళు అని తెలుస్తుంది.తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని వారి స్వగ్రామంలో సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే సోమవారం రాత్రి ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో హఠాన్మరణం చెందారు.
తల్లి మరణ వార్త తెలియగానే హేమ హుటాహుటిన రాజోలుకు బయల్దేరారు. తల్లి పార్థివదేహాన్ని చూసి హేమ గుండెలవిసేలా రోదించారు. “నిన్న ఉదయమే నాతో ఎంతో ఆరోగ్యంగా మాట్లాడింది. ఇంతలోనే ఇలా జరిగిపోతుందని కలలో కూడా ఊహించలేదు” అంటూ ఆమె కన్నీరుమున్నీరవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
ఇటీవల రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో తన పేరు రావడం, అరెస్ట్ కావడం తన తల్లిని మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని హేమ గతంలోనే ఆవేదన వ్యక్తం చేశారు. ఆ షాక్ వల్లే ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని, ఇప్పుడు అదే ఆమె మరణానికి కారణమైందని ఆమె భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు హేమకు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.