కొన్ని ట్రైలర్లు భలే ఆసక్తికరంగా ఉంటాయి. ఇదేదో భలే ఉంది, చూడాలి అనే ఆలోచనను రేకెత్తిస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి “అరి”. సాయికుమార్, అనసూయ, శుభలేఖ సుధాకర్ వంటి ఆర్టిస్టులు నటించడం అనేది ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. సినిమాగా ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!
కథ: ఇంటర్వెల్లో బ్లాక్ దగ్గర ఒక స్టేట్మెంట్ వస్తుంది. “కథను ప్రత్యేకించి రాసుకోను.. నేను చెప్పాలనుకున్న విషయాన్ని కథగా చెబుతాను” అని. అందువల్ల ఈ సినిమాలో ఇదీ కథ అని చెప్పడానికి ఏమీ ఉండదు.
కొందరు వ్యక్తులు.. వాళ్ల జీవితాల్లో సందర్భాలు, వాటిని వాళ్లు ఎలా జయించారు? ఈ క్రమంలో వాళ్లలో వచ్చిన మార్పులు ఏమిటి? అనేది “అరి” కథాంశం.
నటీనటుల పనితీరు: కథను నడిపించే వినోద్ వర్మ ఒక్కడు తప్ప అందరూ బాగా నటించారు. ఒక కథను నడిపించే కీలకపాత్రధారుడిగా ఆ బాధ్యతను అతను మోయలేకపోయాడు అనిపిస్తుంది.
మిగతా పాత్రలు పోషించిన సాయికుమార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, అనసూయ, సురభి ప్రభావతి వంటివాళ్ళు తమ సీనియారిటీతో అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమాని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న కథన గమన విధానం బాగుంది. చాలా పాత్రలు ఉండడంతో.. వాళ్ల క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ జోలికి పోకుండా, సింపుల్ గా వాళ్ళ సందర్భాలను బట్టి వాళ్ళ వ్యక్తిత్వాలను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పిన విధానం ప్రశంసనీయం. అలాగే.. ప్రతి పాత్ర రియలైజేషన్ పాయింట్ ను మరో పాత్రతో ఇంటర్ కనెక్ట్ చేసిన విధానం కూడా బాగుంది. అయితే.. సదరు పాత్రలనే ఎందుకు ఎంచుకున్నాడు? అనేదానికి లాజికల్ ఆన్సర్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. సో, జయశంకర్ దర్శకుడిగా ఆకట్టుకోగలిగాడు కానీ.. కథకుడిగా అలరించలేకపోయాడు.
అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకి ప్లస్ అవ్వలేకపోయింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ వంటివన్నీ బడ్జెట్ బట్టి ఉన్నాయి. ఇంకాస్త బెటర్ గా ఉండొచ్చు. ముఖ్యంగా AI షాట్స్ కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయి. వాటి యూసేజ్ ను కాస్త తగ్గిస్తే బాగుండేది.
విశ్లేషణ: ఒక మంచి కథను వైవిధ్యంగా చెప్పాలి అనే ఆలోచన ఎప్పుడూ మంచిదే. అయితే.. ఆ వైవిధ్యం అనేది ప్రేక్షకులు అర్థం చేసుకొని, ఆకళింపు చేసుకోనేలా ఉందా లేదా? అనేది కీలకమైన డెసిషన్. ఈ విషయంలో జయశంకర్ కాస్త తడబడ్డాడు. సినిమా చూస్తున్నప్పుడు ఇది బాగుంది కదా అని అనిపిస్తుంది. కానీ.. సదరు పేఆఫ్స్ కోసం డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ మరియు జస్టిఫికేషన్ సరిగా లేకపోవడంతో “అరి” పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది కానీ.. సినిమాగా మాత్రం మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే మంచి హిట్ గా నిలిచి ఉండేది.
ఫోకస్ పాయింట్: మంచి ఆలోచనను.. పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు!
రేటింగ్: 2.5/5