అర్జున్ రెడ్డి

  • August 25, 2017 / 03:12 AM IST

ఈ మధ్యకాలంలో సినిమా మీద కనీస స్థాయి అవగాహన లేని వ్యక్తి కూడా ఆత్రంగా ఎదురుచూసేలా చేసిన ఏకైక చిత్రం “అర్జున్ రెడ్డి”. ఇదేం సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అంతకంటే కాదు.. ఒక ప్రేమకథ. అలాంటి ఓ సాధారణ ప్రేమకథకు అద్భుతమైన ఎమోషన్ ను యాడ్ చేసి సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన చిత్రమిది. విజయ్ దేవరకొండ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం టీజర్-ట్రైలర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కి టాలీవుడ్ టాప్ హీరోస్ సైతం షాక్ అయ్యారు. విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్స్ షోస్ అన్నీ ఏరియాల్లో ప్లాన్ చేయడంతో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి ఆ స్థాయి హైప్ ని క్రియేట్ చేసిన “అర్జున్ రెడ్డి” ఆ అంచనాలను అందుకోగలిగాడా? లేదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ : ఇది నవతరం దేవదాసు కథ. కాకపోతే అప్పటి దేవదాసు ఓ కుక్కను పక్కనెట్టుకొని ఆ కాలంలో అందుబాటులో ఉన్న మద్యపానానికి మాత్రమే బానిసైతే.. ఈతరం దేవదాసు తనకు ప్రెజంట్ జనరేషన్ లో అందుబాటులో ఉన్న డ్రగ్స్ కు బానిసవుతాడు. లీటర్ల కొద్దీ మందు తాగుతాడు, తనలోని బాధని మర్చిపోవడం కోసం పరాయి ఆడదాన్ని నిస్సందేహంగా, నిర్లజ్జగా నిలబెట్టి మరీ తన ఆత్రాన్ని చల్లార్చుకోవాలనుకొంటాడు. అది కుదరకపోతే.. ప్యాంట్లో ఐస్ క్యూబ్స్ పెట్టుకొని కోరికలను కంట్రోల్ చేసుకొంటాడు. వాడో కోపిష్టి, నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడతాడు, ఆవేశంలో చెయ్యి చేసుకొంటాడు. అయినాసరే.. తన బాధ్యతను ఎప్పుడు మరువడు. ఒక సర్జన్ గా తన వృత్తిని నిబద్ధతతో నిర్వర్తిస్తుంటాడు. సగటు విఫల ప్రేమికుడిలా తనను వదిలేసిన అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడడు. పైపెచ్చు.. లవ్ ఫెయిల్యూర్ కారణంగా తాను పడుతున్న బాధను ఆడవారి నెలసరి సమస్య (పీరియాడ్స్)తో పోల్చుకుంటాడు. తాను ప్రేమించిన పడతికి వేరే పెళ్లై, ఆమె గర్భం దాల్చినా ఆమెను తన ప్రేయసిగా అభిమానిస్తాడే కానీ.. అనుమానించడు. తనను వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే ప్రశ్నను సైతం లేవనెత్తడు. కేవలం ఆమెను తనదాన్ని చేసుకోవాలనుకొంటాడు.. చేసుకొంటాడు. ప్రేమని గెలుస్తాడు, ప్రేయసిని గెలుచుకుంటాడు, కుటుంబాన్ని కలుపుకొంటాడు. వాడే “అర్జున్ రెడ్డి”. ఇది వాడి కథ.

నటీనటుల పనితీరు : రెగ్యులర్ సినిమాల్లో నటీనటుల గురించి చెప్పినట్లుగా ఫలానా సన్నివేశంలో హీరో బాగా చేశాడు, ఆ సీన్ లో హీరోయిన్ బాగుంది. విలన్ బాగా నటించాడు లాంటి రొటీన్ రైటింగ్ ఫార్మాట్ “అర్జున్ రెడ్డి” సినిమాలోని నటీనటుల గురించి చెప్పడానికి వాడనవసరం లేదు. దర్శకుడు ఒక సన్నివేశాన్ని పేపర్ మీద రాసుకొని ఎలా అయితే తెర మీద చూడాలనుకొన్నాడో.. విజయ్ దేవరకొండ అలానే ప్రెజంట్ చేశాడు. సినిమా చూస్తున్నంతసేపూ అతని పేరు “విజయ్ దేవరకొండ” అని కానీ.. అతను ఇంతకుముందు “పెళ్ళిచూపులు” అనే సినిమాలో నటించాడు అనే విషయం కానీ అస్సలు మైండ్ లోకి రాదు. “ఆర్రే మామా అర్జున్ రెడ్డి గాడ్ని చూడు.. ఇరగ్గొడుతున్నాడు, అర్జున్ గాడు ఇప్పుడు సీరియస్ అయితాడు చూడ్రా, ఏమన్నా ఫీల్ అవుతున్నాడారా” అంటూ సగటు ప్రేక్షకుడు అక్కడ అర్జున్ రెడ్డిని మాత్రమే చూస్తుంటారు. ఒక నటుడిగా విజయ్ దేవరకొండ సాధించిన సంచలన విజయమిది. హీరో పేరును కాక పాత్ర పేరు ప్రేక్షకుల మెదళ్ళలో రిజిష్టర్ అయ్యిందంటే మామూలు విషయం కాదు. అబ్బాయి ముద్దు పెట్టగానే ముడుచుకుపోయే హీరోయిన్స్ ను సిల్వర్ స్క్రీన్ మీద చూసి చూసి.. నిజంగా ముద్దు పెట్టుకొంటే అమ్మాయిలు ఇలానే ఫీల్ అవుతారేమో అని దాదాపు 70 శాతానికి పైగా ప్రేక్షకలోకమంతా (అందులో నేను ఒకడ్ని) స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది. అయితే.. ముద్దులో కామాన్ని కాక మాధుర్యాన్ని ప్రేక్షకుడు తొలిసారి అనుభూతి చెందగలిగాడంటే కారణం మాత్రం హీరోయిన్ షాలిని హావభావాలే. సినిమా మొత్తంలో మహా అయితే ఒక మూడు పేజీలు డైలాగులు కూడా లేని షాలిని తన కళ్ళతో పలికించిన భావాలు రాయాలంటే ఒక టెన్త్ క్లాస్ “ఆల్ ఇన్ వన్” (నాకు తెలిసి అదే చాలా లావైన పుస్తకం) సైజ్ వైట్ నోట్ బుక్ కావాలి.

“సైన్మా” షార్ట్ ఫిలిమ్ ఫేమ్ రాహుల్ రామకృష్ణ నవ్విస్తాడు అది కూడా మామూలుగా కాదు కడుపుబ్బ నవ్విస్తాడు. కరీంనగర్ కుర్రాడిగా తెలంగాణ యాసలో రాహుల్ చేప్పే డైలాగ్స్ కి కనెక్ట్ అవ్వలేదు, నవ్వలేదు అని ఎవరైనా అంటే వాడు సినిమాలో పడుకొని అయినా ఉండాలి లేదంటే సినిమా చూడ్డం మానేసి సెల్ ఫోన్ లో ఫేస్ బుక్-ట్విట్టర్ చెక్ చేసుకుంటూ అయినా ఉండాలి. అంతకుమించి మనోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఫ్యూచర్ లో “ఒన్ ఆఫ్ ది ప్రామిసింగ్ ఆర్టిస్ట్” అవుతాడని మాత్రం చెప్పగలం. వీళ్ళు మాత్రమే కాదు సినిమాలో నటించిన-కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ పాత్రలో జీవించేశారు. కానీ.. వాళ్లందరి గురించి చెప్పుకుంటూ పోతే ఈ రివ్యూ రాసే నాకంటే చదివే మీరు ఎక్కువ ఇబ్బందిపడతారు.

సాంకేతికవర్గం పనితీరు : అసలే విజయ్ దేవరకొండ తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో వెండితెరపై ఓ మాయా ప్రపంచాన్ని సృష్టించి అందులో ప్రేక్షకుడ్ని లీనం చేసేశాడనుకొంటే.. ఆ ప్రపంచంలోని ప్రతి ఎమోషన్ ను తన మ్యూజిక్ తో ప్రేక్షకుడికి మరింత దగ్గర చేయడమే కాక ఆ మాయా ప్రపంచంలో తనని తాను మైమరచిపోయేలా చేశాడు సంగీత దర్శకుడు రాధన్. సౌండ్ మిక్సింగ్ విషయంలో అతడు తీసుకొన్న జాగ్రత్తలకి మెచ్చుకోకుండా ఉండలేం. ముఖ్యంగా సింక్ సౌండ్ తో షూట్ చేయడం ప్రేక్షకుడిపై మరింత ఇంపాక్ట్ చూపుతుంది. రాజు తోట సినిమాటోగ్రఫీ వర్క్ గురించి ఏం చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే. రెగ్యులర్ టింట్ కలరింగ్ తో ఎలాంటి టిపికల్ కెమెరా యాంగిల్స్ ట్రై చేయకుండా 3 గంటలపాటు ప్రేక్షకుడ్ని కుర్చీలో నుండి కదలనివ్వలేదంటే.. అది దర్శకుడి గొప్పదనం మాత్రమే కాదు. కెమెరామెన్ పనితనం కూడా.

ఇక ఈ చిత్ర సృష్టికర్త సందీప్ రెడ్డి వంగా గురించి చెప్పుకోవాలి..
హిందీలో “తమాషా” చూసినప్పుడు మన తెలుగులో ఎందుకు “ఇంతియాజ్ అలీ” లాంటి దర్శకుడు లేడు?, “దేవ్ డి, కాయ్ పోచే” లాంటి సినిమాలు చూసినప్పుడు మన తెలుగు భాషలో ఇలాంటి రియలిస్టిక్ సినిమాలు ఎందుకు రావు, మన దర్శకులు ఈ తరహా సినిమాలు తీయడానికి ఎందుకు ప్రయత్నించరు? అంటూ ఎవర్ని అడగాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తాను మదనపడే తెలుగు సినిమా అభిమానికి దొరికిన బలమైన సమాధానం “సందీప్ రెడ్డి వంగా”. ఒక కథా రచయితగా అతడిపై మణిరత్నం, ఇంతియాజ్ అలీ వంటి దర్శకుల ప్రభావం ఉన్నా.. దర్శకుడిగా మాత్రం తనదైన చెరగని సంతకాన్ని తెలుగు సినిమా చరిత్ర పుస్తకంలో సువర్ణాక్షరాలతో స్వయంగా లిఖించుకున్నాడు.

విశ్లేషణ : “అర్జున్ రెడ్డి” సినిమాలో చాలా చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అయితే.. సినిమాలోని ఎమోషన్ ను సరిగ్గా అర్ధం చేసుకొంటే ఆ మైనస్ లు కూడా ప్లస్ పాయింట్స్ లాగే కనిపిస్తాయి. “లెంగ్త్ ఎక్కువయ్యింది” అని సెకండాఫ్ లో గట్టిగా అనిపించినా.. ఆ మాత్రం ఎమోషన్ ను ఎలివేట్ చేయాలంటే ఈమాత్రం లెంగ్త్ అవసరమేలే అనిపించకమానదు. అయితే.. తెలుగు సినిమా అభిమానికి మాత్రం ఒక్క విషయం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి.. తెలుగులో ఈ తరహా బోల్డ్ కంటెంట్ (బోల్డ్ అంటే ముద్దు సీన్లు, బెడ్ రూమ్ సీన్స్ మాత్రమే కాదు) తో ఇదివరకూ కూడా సినిమాలోచ్చాయి. వాటిలో ముఖ్యంగా పేర్కొనదగినది “ప్రస్థానం”. ఆ సినిమా రిలీజ్ అయ్యాక తెలుగులో ఇక నుండి ఇలాంటి మంచి సినిమాలోస్తాయని చాలామంది ఆశించారు. ఏమయ్యింది..?? ఆ తరువాతి వారం నుండే రొట్ట సినిమాలు క్యూ కట్టాయి. సో, ఇప్పుడూ అదే విధంగా “అర్జున్ రెడ్డి”తో మన తెలుగు సినిమా మారిపోతుందని అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి. పవర్ లో ఉన్న పొలిటీషియన్ తన ఉనికిని తెలియజెప్పడానికి అప్పుడప్పుడూ జారీ చేసే నోటిఫికేషన్ల వలె.. “అర్జున్ రెడ్డి” లాంటి సినిమాలు కూడా అప్పుడప్పుడే వస్తుంటాయి.

రేటింగ్ : 3/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus