ప్రతి ఒక్కరూ అలా అంటుంటే.. ఇబ్బందిగా ఉంటుంది! : అర్జున్

నటుడిగా 150 సినిమాలు దర్శకుడి, నిర్మాతగా పదికి పైగా చిత్రాలు, లెక్కకుమిక్కిలి అవార్డులు, 37 ఏళ్ల సుధీర్గమైన సినిమా కెరీర్, అన్నిటికీ మించి పుట్టిన దేశమంటే బాధ్యత. అందుకే అర్జున్ అంటే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి ప్రత్యేకమైన అభిమానం. అందుకే క్రేజ్ తో సంబంధం లేకుండా అర్జున్ సినిమాలంటే ప్రజలు ఎదురుచూస్తుంటారు. పాజిటివ్-నెగిటివ్ క్యారెక్టర్స్ అనే బేధం లేకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ నటుడిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న యాక్షన్ కింగ్ అర్జున్ మొదటిసారిగా విలన్ గా నటించిన తాజా చిత్రం “లై”. నితిన్-మేఘ ఆకాష్ జంటగా నటించిన “లై” గత శుక్రవారం విడుదలై మంచి టాక్ తో విజయంవైపుగా ముందుకు సాగుతుంది. అలాగే.. రేపు (ఆగస్ట్ 15) అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకొని అర్జున్ మీడియాతో ముచ్చటించారు.

అలాంటి ప్రయోగాలకు ఇదే కరెక్ట్ ఏజ్..
సినిమాల్లో నా కెరీర్ ప్రారంభమై ఇప్పటికీ 37 ఏళ్లవుతోంది. 150 సినిమాల్లో నటించాను, కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాను, ఇంకొన్ని సినిమాలు నిర్మించాను కూడా. అయితే.. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో ఎంతటి వైవిధ్యం ఉన్నా.. ప్రెజంట్ జనరేషన్ కి తగ్గట్లు మనం మారక తప్పదు. అందుకే నెగిటివ్-పాజిటివ్ అన్న తేడా లేకుండా పాత్రల్లో కొత్తదనం కనిపిస్తే చాలనుకొని చేస్తున్నాను. అయినా ఒక నటుడిగా నేను ప్రయోగాలు చేయడానికి కూడా ఇదే పర్ఫెక్ట్ ఏజ్.

నితిన్ అంటే అందుకే ఇష్టం..
నితిన్ తో కలిసి ఇదివరకే “శ్రీ ఆంజనేయం” సినిమా చేశాను. అప్పటికి నితిన్ చిన్నవాడే అయినా అప్పట్నుంచే విపరీతంగా కష్టించే స్వభావం కలవాడు. ప్రతి సన్నివేశం కోసం తెగ కష్టపడేవాడు. మళ్ళీ ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత నితిన్ తో కలిసి నటించడం, అది కూడా నెగిటివ్ రోల్ కావడం నటుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చింది.

అనునిత్యం భయపడుతూనే ఉంటాను..
అందరిలాగా సెటిల్ అయిపోయామ్ కదా అని “లేచామా.. కాఫీ తాగామా.. కాసేపు కూర్చున్నామా.. మళ్ళీ పడుకున్నామా” అనే లైఫ్ స్టైల్ నాకు నచ్చదు. నన్ను “యాక్షన్ కింగ్” అని అంటుంటారు. అందుకు తగ్గట్లు నేను ఫిట్ గా ఉంటాను, రోజు జిమ్ చేయకపోతే నాకు మనసు ఆగదు, నా స్టార్ డమ్ ను కాపాడుకోవడం నా బాధ్యత.

వాళ్లలా అంటుంటే.. బాగా ఇబ్బందిపడతా
ఈమధ్య నాతో కలిసి వర్క్ చేసేవాళ్ళంతా “సార్ చిన్నప్పట్నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాం” అని చెబుతుంటే గర్వపడాలో లేక కోప్పడాలో అర్ధం కాదు. ఇక నిన్న జరిగిన “లై సక్సెస్ మీట్”లో యూనిట్ మొత్తం “చిన్నప్పట్నుంచి మీ సినిమాలు చూసేవాళ్లం” అంటుంటే ఇబ్బందిగా అనిపించింది. కానీ.. అది కూడా ఒకరకైనా ప్రశంసే.

అక్కడ హీరోగా.. ఇక్కడ విలన్ గా..
ఇటీవలే తమిళంలో “నినుబన్” అనే సినిమాతో సూపర్ హిట్ సాధించా, అలాగే ఇప్పుడు తెలుగులో “లై” సినిమాలో విలన్ గా హిట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా తెలుగు-తమిళంలో ఒకేసారి విభిన్న పాత్రలతో హిట్స్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే.. ఏ విజయం ఎక్కువగా సంతృప్తినిచ్చింది అంటే రెండూ అనే చెప్తాను. ఎందుకంటే హీరోగా, విలన్ గా అనేకంటే ఒక నటుడిగా నేను విజయాన్ని సాధించినట్లు భావిస్తాను.

పొలిటీషియన్ కి ఉండాల్సిన కనీస లక్షణాలు నాకు లేవు..
నేను రాజకీయ నేపధ్యంలో ఎక్కువ సినిమాలు చేసి ఉండడం వల్ల నేను కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతానని అందరూ అనుకొంటున్నారు. కానీ నాకు కనీసం ఆ ఆలోచన కూడా లేదు. అసలు పాలిటిక్స్ లో రాణించడానికి కావాల్సిన కనీస లక్షణాలు నాకు లేవు. పొలిటీషియన్ బ్యాడ్ అయినా గుడ్ అయినా మంచి నాలెడ్జ్ ఉండాలి, సో పొరపాటున కూడా పాలిటిక్స్ లోకి రావాలన్న ఆలోచన లేదు.

ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి నేనే నమ్మకపోతే ఎలా..
ఇన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను నా కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఎందుకు భయపడాలి. సినిమా అనే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ మంచి-చెడు అనేది ఉంటుంది. అందుకే నా కూతుర్ని స్వయంగా నేనే హీరోయిన్ గా పెట్టి ఒక అందమైన ప్రేమకథను డైరెక్ట్ చేస్తున్నాను. షూటింగ్ చివరి దశకు చేరుకొంది. త్వరలోనే సినిమా డీటెయిల్స్ ఎనౌన్స్ చేస్తాను.

అల్లు అర్జున్ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్..
“లై”లో నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ పోషించిన తర్వాత వరుసబెట్టి చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “నా పేరు సూర్య”లో చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాను. త్వరలో షూటింగ్ లో పాల్గొననున్నాను. ఇది కాకుండా నా దర్శకత్వంలో మరో సినిమాకు ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయ్.

Dheeraj Babu


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus