ARM Review in Telugu: ఎ ఆర్ ఎమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • టోవినో థామస్ (Hero)
  • కృతి శెట్టి (Heroine)
  • రోహిణి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి, బాసిల్ జోసెఫ్ తదితరులు.. (Cast)
  • జితిన్ లాల్ (Director)
  • లిస్టిన్ స్టీఫెన్ - జకారియా థామస్ (Producer)
  • దిబు నినా థామస్ (Music)
  • జోమోన్ టి.జాన్ (Cinematography)
  • Release Date : సెప్టెంబర్ 12, 2024

తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే పరిచయమవుతున్న మలయాళ హీరో “టోవినో థామస్”. నటించడం మొదలుపెట్టిన అతితక్కువ కాలంలో 50 సినిమాలు పూర్తి చేసుకొని ఒక రికార్డ్ క్రియేట్ చేసిన టొవినో నటించిన “మిన్నల్ మురళి, 2018, తల్లుమల్లా” వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. ఆ సినిమాలకు వచ్చిన స్పందన ఇచ్చిన నమ్మకంతో తన తాజా చిత్రం “అజంతే రాండం మోషణం” అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో “ఎ ఆర్ ఎమ్”గా అనువదించి అన్నీ ప్రాంతీయ భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియన్ సినిమా రేంజ్ లో రిలీజ్ చేసారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసిన ఈ సినిమా మన ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

ARM Review

కథ: కేరళలోని చియోతి అనే గ్రామ చరిత్రలో కుంజికేలు (1వ టోవినో థామస్)కి విశేషమైన చరిత్ర ఉండగా.. మనియన్ (2వ టొవినో థామస్) దొంగగా మారి ఆ చరిత్రను కాలరాస్తాడు. మనియన్ చేసిన పాపం అతడి మనవడు అజయన్ (3వ టొవినో థామస్)కు చుట్టుకుని.. నిజాయితీగా బ్రతుకుదాం అనుకున్నప్పటికీ.. అతడ్ని ఊరి జనం ఒక దొంగలాగానే చూస్తుంటారు. ఈ క్రమంలో చియోతి గ్రామంలోని అత్యంత పవిత్రమైన శ్రీబూది దీపం యొక్క దొంగతనం అజయన్ మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది.

అసలు అజయన్ ను ఆ దొంగతనంలో ఇరికించింది ఎవరు? అజయన్ ఆ దొంగతనం నుండి ఎలా బయటపడ్డాడు? అజయన్ తాత మనియన్ ఆ దీపాన్ని ఎందుకు దొంగిలించాడు? వంటి ఆసక్తికర అంశాలకు చిత్ర రూపమే “ఎ ఆర్ ఎమ్” చిత్రం.

నటీనటుల పనితీరు: మూడు విభిన్నమైన షేడ్స్ లో టోవినో థామస్ అత్యుత్తమ స్థాయి నట ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మనియన్ పాత్రలో టోవినో నటన ప్రశంసనీయం. ముఖ్యంగా కళరి విద్య నేర్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం ఫైట్ సీన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అజయన్ పాత్రలో అమాయకంగా ఉంటూనే శౌర్యాన్ని ప్రదర్శించే యువకుడి పాత్రలోనూ ఆకట్టుకున్నాడు.

కృతి శెట్టి రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోయింది. కేరళ అమ్మాయిగా ఆమె లుక్ కూడా బాగుంది. ఈ సినిమాతో ఆమెకు మలయాళంలోనూ మంచి ఆఫర్లు రావడం మొదలవుతుంది. అమ్మ పాత్రలో రోహిణి మరోసారి జీవించేశారు. చిన్న పాత్రలే అయినప్పటికీ ఐశ్వర్య రాజేష్ & సురభి లక్ష్మి తమ స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించారు. బాసిల్ జోసఫ్ కాస్త నవ్వించడానికి ప్రయత్నించాడు కానీ పెద్దగా వర్కవుటవ్వలేదు. మిగతా మలయాళీ ఆర్టిస్టులందరూ పాత్రలకు సెట్ అయ్యారు.

సాంకేతికవర్గం పనితీరు: జోమోన్ టి.జాన్ సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకి మంచి ఎస్సెట్ అని చెప్పాలి. మూడు విభిన్నమైన టైమ్ లైన్స్ ను ఒకే చోట చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ అవుట్ పుట్ చూసి హీరో టోవినో చెప్పినట్లుగా ఈ చిత్రం 10 కోట్ల లోపు బడ్జెట్ సినిమా అంటే నమ్మడం కాస్త కష్టమే. అంత గ్రాండ్ గా, ఎక్కడా రాజీపడకుండా తీశారు. షాట్ కంపోజిషన్స్ విషయంలో రెండు టైమ్ లైన్స్ లో ఒకే రకమైన షాట్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది.

రచయిత సుజిత్ నంబియార్ & దర్శకుడు జితిన్ లాల్ ఈ సినిమా కోసం గత 8 ఏళ్లుగా ఎందుకు వర్క్ చేస్తున్నారో కథలోని లేయర్స్ చూస్తే అర్థమవుతుంది. అయితే.. కథగా ఉన్నంత స్థాయిలో సినిమా లేదని చెప్పాలి. అందుకు కారణం ఎగ్జిక్యూషన్ విషయంలో దర్శకుడు జితిన్ లాల్ చేసిన చిన్నపాటి తప్పులు. హరీష్ ఉత్తమన్ పాత్రతో కథను మలుపు తిప్పిన విధానం బాగున్నా.. ఆ తర్వాత ఆ పాత్రను సరిగా ఎలివేట్ చేయకపోవడం వలన కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది సరిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు.

ముఖ్యంగా అజయన్ ఎందుకు దొంగతనం చేయాలి అనే విషయాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ కారణంగా సెకండాఫ్ లో ఆసక్తి కొరవడింది. అదే విధంగా ఎంతో అద్భుతంగా చూపించిన కళరి ఎపిసోడ్ కి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు, అలాగే చివర్లో దీపం దొరికే సీక్వెన్స్ ను కంగారుగా ముగించేశాడు. ఇలా దర్శకత్వం పరంగా కొన్ని తప్పులు దొర్లాయి. ఈ విషయాల్లో కేర్ తీసుకొని ఉంటే సినిమా మరో “కాంతార” అయ్యేది. అయితే.. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో మాత్రం అద్భుతమైన వర్క్ చేశారని చెప్పాలి.

విశ్లేషణ: మలయాళ చిత్రసీమ నుండి వచ్చే కొన్ని సినిమాలు భలే ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి సినిమానే ఈ “ఎ ఆర్ ఎమ్”. అక్కడక్కడా గోపీచంద్ “సాహసం” ఛాయలు కనిపిస్తాయి కానీ.. మూల కథ వేరేది కావడంతో యునీక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అయితే.. తెలుగు డబ్బింగ్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిన బృందం.. సినిమాలో కనిపించే తెలుగు టైటిల్స్ & ఫాంట్స్ విషయంలో కనీస స్థాయి జాగ్రత్త తీసుకోకపోవడం సిగ్గుచేటు.

కొన్ని చోట్ల ఫాంట్ లో ఒక అక్షరం మరో అక్షరం లోకి దూరిపోవడంతో తెలుగు పదాలు కూడా మరీ బూతుల్లా కనిపించాయి. తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయాన్ని కనీసం తదుపరి సినిమా నుంచైనా కాస్త సీరియస్ గా తీసుకొంటే బాగుంటుంది. ఇకపోతే.. “ఎ ఆర్ ఎమ్” మాత్రం కచ్చితంగా ఒకసారి థియేటర్లో చూడదగ్గ చిత్రం.

ఫోకస్ పాయింట్: అలరించిన అజయన్ గాడి దొంగతనం!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus