వచ్చే ఏడాది సంక్రాంతి వార్ ఇప్పుడు టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తెలుగు నిర్మాతలదే తప్పు అంటూ ఓవైపు తమిళ దర్శకులు, నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఇప్పడు ఏకంగా తెలుగు అగ్ర నిర్మాత అశ్వనీదత్ కూడా తెలుగు నిర్మాతల ఆలోచనే తప్పు అని అంటున్నారు. సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో నిర్మాతల మండలి వెలువరించిన ఓ ప్రకటన విషయంలో అశ్వనీదత్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మన నిర్మాతల ఆలోచన రెండు పరిశ్రమల మధ్య అనుబంధాల్ని దెబ్బతినేలా చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సంక్రాంతి – 2023 సీజన్‌కి తెలుగు నుండి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. తమిళనాట నుండి ‘వరిసు’ (తెలుగులో ‘వారసుడు’) వస్తోంది. అయితే సంక్రాంతికి విడుదలయ్యే అనువాద చిత్రాలకి థియేటర్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వకూడదని తెలుగు సినిమా నిర్మాతల మండలి కొన్ని రోజుల క్రితం ఓ ప్రకటన ఇచ్చింది.
అయితే ఇప్పుడు ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని సి.అశ్వనీదత్ కోరారు. ఇలాంటి ప్రకటనలు పరిశ్రమని తప్పుదోవ పట్టించేలా ఉంటాయని అభిప్రాయపడ్డారాయన. పొరుగు పరిశ్రమలతో ఉన్న అనుబంధాల్ని, మన మార్కెట్ దెబ్బతినేలా.. ఆ ప్రకటన ఉందని అశ్వనీదత్ అన్నారు. ఆయన ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడాయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మన సినిమాలకు డబ్బింగ్, ఓటీటీ మార్కెట్ బాగానే ఉంది. ఈ సమయంలో రెండు భాషల పరిశ్రమల మధ్య సమస్యను సృష్టించేలా నిర్మాతలు మాట్లాడటం సరికాదు అని అశ్వనీదత్ అన్నారు.
అనువాద చిత్రాకు ప్రాధాన్యం ఇవ్వకూడదని ఎలా చెబుతారు? అంటూ ఆయన ప్రశ్నించారు. తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యమే అంటూ ఘాటుగా స్పందించారాయన. ఒక తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడితో తమిళ సినిమా చేశారు. ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేసుకుంటే తప్పేముంది? అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఒకే నిర్మాణ సంస్థ ఏక కాలంలో రెండు సినిమాలు చేసి, ఆ రెండింటినీ సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అనడం ఎంత వరకు కరెక్ట్ అని అశ్వనీదత్ ప్రశ్నించారు. మరి దీనిపై నిర్మాతలమండలి ఏమంటుందో చూడాలి.