కన్నడ చిత్రసీమలో టాప్ హీరోస్ కమ్ రైటర్స్ లో ఒకడైన రక్షిత్ శెట్టి నటించి, రచించిన తాజా చిత్రం “అతడే శ్రీమన్నారాయణ”. గతవారం కన్నడలో విడుదలై విశేషమైన రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఇవాళ తెలుగులో విడుదలైంది. మరి ఈ యాక్షన్ థ్రిల్లింగ్ డ్రామాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో చూద్దాం..!!
కథ: అమరావతికి చెందిన ఆధీరులు అనే దొంగల జాతి పెద్ద రామరాజు.. తన తదనంతరం వారసుడు ఎవరు అనేది ప్రకటించకుండానే చనిపోతాడు. దాంతో అతడి వారసులు పెత్తనం మరియు ఒక నిధి కోసం కొట్టుకు చస్తుంటారు. ఈ గొడవలోకి తనకు తెలియకుండానే ఎంటర్ అవుతాడు పోలీస్ ఇన్స్పెకర్ శ్రీమన్నారాయణ (రక్షిత్ శెట్టి).
అసలు నిధి ఎవరిది? అది ఎక్కడ ఉంది? చివరికి ఎవరికి దొరికింది? అనేది “అతడే శ్రీమన్నారాయణ” కథాంశం.
నటీనటుల పనితీరు: ఒక సినిమాలో అందరు నటీనటులు పర్ఫెక్ట్ గా క్యారెక్టర్స్ కి సరిపోవడమే కాక.. పాత్రలకి ప్రాణం పోసిన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఆ లిస్ట్ లో ఇప్పుడు “అతడే శ్రీమన్నారాయణ” చిత్రాన్ని కూడా చేర్చవచ్చు. హీరోహీరోయిన్లు మాత్రమే కాదు.. విలన్లు, సహాయ పాత్రధారులు ఇలా అందరూ అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నారు. రక్షిత్ శెట్టి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. శాన్వి గ్లామర్ ను కాక నటనను ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ఇది.
సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా ది బెస్ట్ సినిమా “అతడే శ్రీమన్నారాయణ”. ప్రతి సన్నివేశంలో డీటెయిలింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ అద్భుతం అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో ఆర్ట్ వర్క్ ఆశ్చర్యపరుస్తుంది. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఈస్థాయి అవుట్ పుట్ ను ఇవ్వడం అనేది అభినందనీయం. దర్శకుడు సచిన్ రవి & రచయిత రక్షిత్ శెట్టిలను ఈ విషయంలో మెచ్చుకోవాలి. అలాగే.. ఈ ఇద్దరు రన్ టైమ్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం మాత్రం బాధాకరం. ఒక సినిమా ప్రేక్షకుడు ఎంత సేపు చూడగలడు అనే విషయంలో ప్రతి ఫిలిమ్ మేకర్ కి ఒక క్లారిటీ ఉండాలి. అయితే.. రచయితే దర్శకుడు లేదా కథానాయకుడు అవ్వడం వలన రాసుకున్న కథపై ప్రేమ ఎక్కువై.. కథనాన్ని పెంచుకుంటూ వెళ్లిపోతుంటారు.
“అతడే శ్రీమన్నారాయణ” విషయంలో రచయిత-కథానాయకుడు రక్షిత్ శెట్టి చేసిన తప్పు కూడా ఇదే. తాను రాసుకున్న కథ, పాత్రలు ప్రేక్షకులకు మరీ ఎక్కువగా అర్ధమవ్వాలని తాపత్రయపడ్డాడు. కథలో మిళితమై ఉన్న చాలా అంశాలతో ప్రేక్షకుల మెదడుకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో హాలీవుడ్ సినిమాలు మరియు.. సినిమా మీద విపరీతమైన ప్రేమ-అభిమానం ఉన్నవాళ్ళు తప్ప సరదాగా సినిమాను చూసేవాళ్ళు నెగ్గడం కష్టం. దాంతో.. సాధారణ ప్రేక్షకులకు సినిమా బోర్ కొడుతుంది. సన్నివేశాల్లో లాజిక్ ఉన్నా.. సాగతీత కారణంగా ఆ సన్నివేశాలు మ్యాజిక్ చేయలేవు.
విశ్లేషణ: రొటీన్ సినిమాలంటే బోర్ కొట్టిన ప్రేక్షకులు ఒకసారి తప్పకుండా చూడాల్సిన సినిమా “అతడే శ్రీమన్నారాయణ”. కానీ.. సాగదీసిన కథనం.. కథనంలో ఇమడని పాటలు చిత్రానికి మైనస్ లు. ఆ రెంటినీ భరించగలిగితే “అతడే శ్రీమన్నారాయణ” తప్పకుండా ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించడం ఖాయం.
రేటింగ్: 2.5/5