ధనుష్-అక్షయ్ కుమార్-సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అత్రంగి రే”. ఒక టిపికల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు. విడుదలైన ట్రైలర్ మరియు పాటలు సినిమాపై విశేషమైన అంచనాలు క్రియేట్ చేశాయి. థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ.. పరిస్థితులు సహకరించకపోవడంతో హాట్ స్టార్ లో నేడు విడుదల చేశారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందో చూద్దాం..!!
కథ: డిల్లీలో ఎంబీబీయస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ విషు (ధనుష్). ఒక కాలేజ్ ట్రిప్ లో భాగంగా బీహార్ వెళ్లినప్పుడు అక్కడ అతనికి బలవంతంగా రింకు (సారా అలీఖాన్)తో పెళ్లి చేసేస్తారు. ఆ కారణంగా తను ప్రేమించిన మందాకిని (డింపుల్ హయాతి)తో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది.
కట్ చేస్తే.. తాను బలవంతపు పెళ్లి చేసుకున్న రింకు కూడా సజ్జద్ (అక్షయ్ కుమార్) అనే మెజీషియన్ ను ప్రేమిస్తుంటుంది. అటు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి క్యాన్సిల్ అయ్యి.. పెళ్లి చేసుకున్న అమ్మాయి తనను పట్టించుకోక మనోవేదనకు గురవుతుంటాడు.
అయితే.. రింకు – సజ్జద్ ల ప్రేమలో ఊహించని ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏమిటా ట్విస్ట్? విషు-రింకు-సజ్జద్ ల ప్రేమకథ చివరికి ఏ తీరానికి చేరుకుంది అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: ధనుష్, అక్షయ్ కుమార్ కంటే ముందు సారా అలీఖాన్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. చాలా కాంప్లెక్స్ రోల్ ను సింపుల్ గా ప్లే చేసింది. సారా ఇంత మంచి నటి అని అందరికీ అర్ధమయ్యేలా చేసే పాత్ర ఇది. క్లైమాక్స్ లో ఆమెతోపాటు ప్రతి ప్రేక్షకుడి కంట కన్నీరు పెట్టడం ఖాయం. ధనుష్ ఎంత గొప్ప నటుడు అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోనూ తన నట ప్రావీణ్యంతో విషు పాత్రలో జీవించేశాడు.
మనసులో ఇంత ప్రేమ దాచుకోవచ్చా అని ఆశ్చర్యపోయేలా నటించాడు. ఇక అందరికంటే సీనియర్ నటుడైన అక్షయ్ కుమార్ ది నిజానికి ప్రత్యేక పాత్ర లాంటిది. చిన్న ట్విస్ట్ ఉండే క్యారెక్టర్ లో అదరగొట్టాడు. ఈ చిత్రానికి ఆయన పాత్ర వ్యవహారశైలి చాలా కీలకం. ఈ ముగ్గురి తర్వాత అలరించిన నటుడు ఆశిష్ వర్మ.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ సినిమాలన్నీ ఒక డిఫరెంట్ ఎమోషన్ తో నడుస్తుంటాయి. ఆయన మునుపటి చిత్రం “జీరో” ఒక్కటే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది కానీ.. మిగిలిన సినిమాలన్నీ ప్రేక్షకుల్ని విశేషమైన రీతిలో ఆకట్టుకున్నాయనే చెప్పాలి. “అత్రంగీ రే”తో మళ్ళీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేశాడు ఆనంద్. ఈ చిత్రాన్ని ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రొజెక్ట్ & ప్రమోట్ చేసి సగం విజయం సాధించిన ఆనంద్.. ఆ ట్విస్ట్ ను డీల్ చేసిన విధానంతో పూర్తి విజయం సాధించాడు. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ ను మౌల్డ్ చేసిన విధానం ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ను ఇవ్వడమే కాక.. అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసింది.
ఇక ఆడపిల్ల మనసుని చదవడంలో పీ.హెచ్.డి చేశాడు ఆనంద్ ఎల్.రాయ్. ఓ ఒంటరి ఆడపిల్ల, తన మనసులో బాధను పోగొట్టుకోవడానికి ఓ ఊహను, తాను మాత్రమే నమ్మే నిజంగా ఎలా మలచుకొంది అనే అంశాన్ని చాలా హృద్యంగా తెరకెక్కించాడు ఆనంద్. ఈ తరహా కాన్సెప్ట్ కొత్త కాదు.. కానీ ఆ కాన్సెప్ట్ ను డీల్ విధానం కొత్త. ఆ కొత్తదనమే దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ను మిగతా దర్శకుల నుంచి వేరు చేయడమే కాక.. ప్రత్యేకంగా నిలబెడతాయి. అన్నిటికీ మించి సినిమాకి పని చేసిన ముఖ్యమైన క్రూ మెంబర్స్ అందరి పేర్లు ఎండ్ క్రెడిట్స్ లో “ఏ ఫిలిం బై” అని వేసి విజయానికి మించిన గౌరవాన్ని అందుకున్నాడు ఆనంద్.
ఆనంద్ తర్వాత సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఏ.ఆర్.రెహమాన్. తన పాటలతో, నేపధ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోసాడు. రచయిత హిమాన్శు శర్మ కథ-కథనాన్ని సమకూర్చిన విధానాన్ని కూడా ప్రశంసించి తీరాలి. ఇలాంటి కథ ఒకటి రాయాలన్న ఆలోచన కంటే.. ఆ ఆలోచనను ఆచరణ రూపంలోకి తెచ్చిన విధానం అద్భుతం.
విశ్లేషణ: ఒక మంచి సినిమా చూశామనే భావన చాలా అరుదుగా కలుగుతుంటుంది. అలాంటి ఓ భావన కలిగించే చిత్రమే “అత్రంగీ రే”. సారా అలీఖాన్, ధనుష్, అక్షయ్ కుమార్ ల అద్భుతమైన నటన కోసం, ఆనంద్ ఎల్.రాయ్ డీల్ చేసిన విధానం, రెహమాన్ సంగీతం.. ఇలా అన్నీ అద్భుతంగా సెట్ అయిన చిత్రమిది. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ అద్భుత చిత్ర రాజాన్ని తప్పకుండా చూడండి.
రేటింగ్: 3.5/5