అ!

  • February 16, 2018 / 12:16 PM IST

ఏదో సినిమాలో చెప్పినట్లు ఆకలి బాధతో ఉన్నోడు “అమ్మా” అని ఒక ఎక్స్ ప్రెషన్ లో అంటాడు, అలాగే దెబ్బ తగిలినోడు “అమ్మా” అని ఇంకో ఎక్స్ ప్రేస్షన్ లో అరుస్తాడు. అదే విధంగా ‘అ!’ సినిమా తర్వాత ప్రేక్షకులు రెండు రకాలుగా రియాక్ట్ అవుతారు. సినిమా నడుస్తున్న రెండు గంటలపాటు ఫోన్ వంక చూడకపోవడం మాత్రమే కాక వెండితెర వైపు నుంచి చూపు మరల్చకుండా ప్రతి ఫ్రేమ్ ను తర్కించి చూస్తే.. “అబ్బా ఏం తీశాడ్రా సినిమా” అని ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో థియేటర్ నుంచి బయటకి వస్తాడు. టైమ్ పాస్ కోసం సినిమాకొచ్చి, మధ్యలో ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటివి చెక్ చేసుకుంటూ, లాజిక్స్ ను పెద్దగా పట్టించుకోకపోతే మాత్రం క్లైమాక్స్ లో పేలే బాంబ్ కి “వాడబ్బా ఏం సినిమా తీశాడాడు ??” అని తిట్టుకుంటూ థియేటర్ ని వీడతారు ఇంకొందరు ప్రేక్షకులు.

సో, ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే.. “అ!” అద్భుతమైన సినిమా ఏమీ కాదు. హాలీవుడ్ తోపాటు సౌత్ ఇతర సౌత్ సినిమాలు కాస్త ఎక్కువగా చూసే మూవీ లవర్స్ కి ఎస్.జె.సూర్య “ఇసై”, క్రిస్టఫర్ నోలన్ “ఇన్సెప్షన్”, డిస్నీ సంస్థ “ఇన్సైడ్ ఔట్” వంటి చిత్రాలు గుర్తుకువస్తాయి. తెలుగు సినిమాకి వచ్చేసరికి ఖచ్చితంగా “అ!” ఒక ఎక్స్ పెరిమెంటే. కాకపోతే.. దర్శకుడు తన ఊహని ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో ఇంకాస్త నింపాదిగా, అర్ధవంతంగా వివరించి ఉంటే సినిమాని కేవలం ఒక పర్టీక్యులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే కాక అందరికీ అర్ధమయ్యేదేమో.

నిజానికి రివ్యూ ఇప్పుడే రాసేయాలని, సినిమా చూసి నాకేం అర్ధమయ్యిందో, దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో వివరించాలని ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. సినిమాలోని ఏ ఒక్క క్యారెక్టరైజేషన్ గురించి లేదా స్టోరీలోని ఏ ఒక్క కోణాన్ని వివరించినా.. ఈ సమీక్ష చదివి సినిమా చూసేవారికి మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అనేది ఉండదు కాబట్టి పూర్తి సమీక్షను శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం పోస్ట్ చేయడం జరుగుతుంది.

అయితే.. థియేటర్ కి వెళ్ళే ప్రేక్షకుడికి కనీస స్థాయి ఇన్ఫో ఇవ్వడం బాధ్యత కాబట్టి.. అసలు సినిమా ఏమిటి అనే విషయం మాత్రం చెబుతున్నాం.

“అ!” ఒక సైకలాజికల్ థ్రిల్లర్, ఒక మనిషిలో చాలా భిన్న కోణాలుంటాయి, అయితే.. సమాజానికి భయపడో లేక కుటుంబ పరిధులను దృష్టిలో ఉంచుకోనో మానుషి తనలోని భిన్న కోణాల్ని తన మెదడులోనే దాచేసుకొని పైకి మాత్రం ఒకే స్వభావంతో (మంచి లేదా చెడు) ప్రవర్తిస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ “అ!” సినిమా ద్వారా చెప్పదలుచుకున్న అంశం కూడా అదే. నాని ఈ చిత్రాన్ని సమర్పించడమే కాక సపోర్ట్ కూడా చేయడంతో కాజల్, నిత్యామీనన్, ఈషా రెబ్బ లాంటి ఆర్టిస్ట్స్ ఈ సినిమా చేయడం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం “అ!” సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్.

నిత్యామీనన్, ఈషా రెబ్బ రోల్స్ చిన్నవే అయినా.. వారి క్యారెక్టరైజేషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రియదర్శి పాత్ర హాలీవుడ్ చిత్రం “రటాటౌలి”లోని ప్రధాన పాత్రను తలపిస్తుంది. రెజీనా రోల్ చేయడానికి ధైర్యం కావాలి.. ఆమె తప్ప మరెవరూ కూడా ఆ పాత్రను అంత కాన్ఫిడెంట్ గా చేయలేకపోయేవారేమో. మురళీశర్మ రోల్ సినిమాలో చాలా కీలకం కానీ అది అర్ధమవ్వడం కాస్త కష్టం.

సో, బేసిగ్గా “అ!” అనేది ఒక ప్రయత్నం, అందరికీ అర్ధమవ్వదు. రెండోసారి చూడాలనిపించకపోయినా.. అర్ధమైన కొందరికి మాత్రం “కొత్తగా ఉంది” అనిపిస్తుంది. ఇందుమూలంగా మీకు చెప్పదలుచుకున్నదేమనగా.. డియర్ మూవీ లవర్స్ “సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనో లేక కాసేపు నవ్వుకుందామనో” అనుకుంటే మాత్రం “అ!” సినిమా చూడకండి. అలాగే హాలీవుడ్ స్థాయిలో చాలా కొత్తగా ఉంటుందనే ఎక్స్ పెక్టేషన్స్ తో కూడా సినిమా చూడబాకండి. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం మాత్రమే “అ!” సినిమా చూడండి.

అందరికీ అర్ధమయ్యే రీతిలో రివ్యూ శనివారం అప్డేట్ చేయబడును. ఈలోపు “అ!” సినిమా చూసి మీకేం అర్ధమయ్యిందో కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus