తన కెరీర్ లో ఎక్కువగా రీమేక్స్ తోనే నెట్టుకొచ్చిన హీరో టైగర్ ష్రాఫ్. అతడు తాజాగా హిందీలో చేసిన మరో రీమేక్ చిత్రం “బాఘీ 4”. తమిళంలో 2013లో విడుదలైన “ఐంతు ఐంతు ఐంతు” అనే చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ కానీ ప్రోమోస్ కానీ పెద్దగా ఆసక్తి రేకెత్తించలేకపోయాయి. కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలయ్యింది. మరి ఈ ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: ఓ యాక్సిడెంట్ వల్ల కోమాలోకి వెళ్లి బయటికి వచ్చిన రోనీ (టైగర్ ష్రాఫ్) అలీషా అని కలవరిస్తూ ఉంటాడు. అసలు అలీషా అనే అమ్మాయి ఎవరూ లేరని, రోనీ ఊహించుకుంటున్నాడని, తనకి డెల్యుషనల్ ఇష్యూస్ ఉన్నాయని చుట్టూ ఉన్నవాళ్లందరూ ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పడంతో దాదాపుగా నమ్మేస్తాడు రోనీ.
కట్ చేస్తే.. అలీషాకి చెందిన ఒక పెయింటింగ్ దొరుకుతుంది రోనీకి. దాంతో అసలు సమస్యలు మొదలవుతాయి.
అసలు రోనీకి ఇన్నాళ్లపాటు అలీషా లేదు అని నమ్మించడానికి చుట్టూ ఉన్నవాళ్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అలీషా ఏమైంది? దీన్నంతటినీ నడిపిస్తుంది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానం “బాఘీ 4” చిత్రం.
నటీనటుల పనితీరు: ప్రతి సినిమాకి బాడీ పెంచుతున్నాడు కానీ.. నటుడిగా మాత్రం ఇంప్రూవ్ అవ్వడం లేదు టైగర్. ఒక్కోసారి అతడు పలికిస్తున్నది కోపమో, బాధో అర్థం కాక తికమకపడుతుంటారు ప్రేక్షకులు. అయితే.. టైగర్ మార్క్ యాక్షన్ సీన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు.
హర్నాజ్ కౌర్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో చక్కగా నటించింది. ఆమె పాత్రలో వేరియేషన్స్ & గ్లామర్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి.
మరి పాత్రలో పంజాబీ భామ సోనమ్ బజ్వా పర్వాలేదనిపించుకుంది.
సంజయ్ దత్ ఈ తరహా పాత్రలు ఇప్పటికే చాలా పోషించాడు. ఈ సినిమాలో ఇంకాస్త యంగ్ గా కనిపించాడు. క్లైమాక్స్ లో వచ్చే టైగర్ వర్సెస్ సంజయ్ దత్ యాక్షన్ సీక్వెన్స్ మాస్ జనాలకి నచ్చుతుంది.
శ్రేయాస్ తల్పాడే, ఉపేంద్ర, సౌరభ్ సచ్ దేవా తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సంచిత్ – అంకిత్ నేపథ్య సంగీతం బాగుంది. యాక్షన్ సీన్స్ & ఎమోషనల్ సీన్స్ కి ఇచ్చిన ఎలివేషన్ బాగా వర్కవుట్ అయ్యింది.
యాక్షన్ కొరియోగ్రఫీ మరీ వైల్డ్ గా ఉంది. కొరియన్ సినిమాల తరహాలో రక్తం ఏరులై పారింది. సిల్లీ & ఇల్లాజీకల్ గా ఫైట్స్ ఉన్నప్పటికీ.. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను నచ్చే అవకాశాలు ఉన్నాయి.
సినిమాటోగ్రఫీ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, డి.ఐ వంటి టెక్నికాలిటీస్ అన్నీ పీక్ లెవల్లో ఉన్నాయి. నిర్మాత ఎక్కడా రాజీపడలేదు అని మాత్రం అర్థమైంది.
కన్నడ దర్శకుడు హర్ష హిందీ డెబ్యూగా తమిళ సినిమాని రీమేక్ చేయడం విశేషం. 12 ఏళ్ల క్రితం సినిమాని కమర్షియల్ గా కొన్ని మార్పులు చేశాడు తప్పితే పెద్దగా అప్గ్రేడ్ చేయలేదు. దాంతో ఆసక్తికరంగా మొదలైన కథ, ఇంటర్వెల్ కి బోర్ కొట్టేస్తుంది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ తప్ప సినిమా మొత్తానికి ఎగ్జైట్ చేసే అంశం ఒక్కటి కూడా లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే.. హర్ష మార్క్ రక్తసిక్తమైన యాక్షన్ సీన్స్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవనే చెప్పాలి.
విశ్లేషణ: కథలో మిళితమైన హింస లేదా కథనాన్ని ఎలివేట్ చేసే హింస సినిమాల్లో ఉండడం అనేది సర్వసాధారణం. అయితే.. సినిమాతో ఏమాత్రం సంబంధం లేకుండా ట్యాంకర్ల రక్తం పారడం, వందల మంది జనాలు గొడ్డలి గాట్లతో అచేతనంగా నటిస్తూ పడి ఉండడం అనేది సినిమాని ఎలివేట్ చేయదు అని మేకర్స్ 2025లో కూడా గ్రహించకపోవడం బాధాకరం. ఎంత మంచి ప్రొడక్షన్ డిజైన్ ఉన్నా, ఎన్ని భారీ యాక్షన్ సీన్స్ ఉన్నా.. వాటిని వినియోగించుకోలేని కథనం లేనప్పుడు అన్నీ వృథా. “బాఘీ 4” విషయంలో జరిగింది అదే. భారీ క్యాస్టింగ్, బీభత్సమైన బడ్జెట్ వంటివి ఉన్నప్పటికీ.. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే లోపించడంతో, చిత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఫోకస్ పాయింట్: మితిమీరిన మతిలేని హింస!
రేటింగ్: 1.5/5