దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన వెండితెర కళాఖండం బాహుబలి కంక్లూజన్ గత ఏడాది రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా కలక్షన్ల వర్షం కురిపించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 1700 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు అద్భుతంగా నటించిన ఈ సినిమా జపాన్ భాషలోనూ వందరోజులు పూర్తి చేసుకొని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా మూడు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ మూవీ చైనాలో రిలీజ్ కావడానికి సిద్ధమైంది. వచ్చేనెల 4 న చైనాలో 4000 తెరలపై రిలీజ్ కానుంది.
దీంతో సులభంగా అక్కడ 300 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన దంగల్ చైనాలో వచ్చిన కలక్షన్స్ తో 2122 కోట్లు క్రాస్ చేసి బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు బాహుబలి 2 చైనాలో భారీ కలక్షన్స్ రాబట్టి దేశంలో అత్యధిక కలక్షన్స్ రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాహుబలి బిగినింగ్ సమయంలో ప్రచారం చేయకపోవడంతో ఆ దేశంలో ఎక్కువ కలక్షన్స్ సాధించలేదు. ఆ పొరబాటు ఈసారి చేయకుండా భారీ పబ్లిసిటీ చేస్తున్నారు. మరి అక్కడి రెస్పాన్స్ కోసం బాహుబలి బృందం ఆత్రంగా ఎదురుచూస్తోంది.