Bad Girl Review in Telugu: బ్యాడ్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • NA (Hero)
  • అంజలి శివరామన్ (Heroine)
  • శాంతిప్రియ, శరణ్య రవిచంద్రన్, హ్రిదు హరూన్, శశాంక్ బొమ్మిరెడ్డిపల్లి (Cast)
  • వర్ష భరత్ (Director)
  • వెట్రిమారన్ - అనురాగ్ కశ్యప్ (Producer)
  • అమిత్ త్రివేది (Music)
  • ప్రీతా జయరామన్ - జగదీష్ రవి - ప్రిన్స్ ఆండర్సన్ (Cinematography)
  • రాధా శ్రీధర్ (Editor)
  • Release Date : సెప్టెంబర్ 05, 2025
  • గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ (Banner)

తమిళంలో ఈమధ్యకాలంలో కాస్త ఎక్కువగా హల్ చల్ చేసిన చిత్రం “బ్యాడ్ గర్ల్”. టీజర్ విడుదల సమయం నుంచే నానా యాగీ మొదలైంది. బ్రాహ్మణులను కించపరుస్తున్నట్లుగా ఉందని కొందరు, యువతని తప్పుదోవ పట్టించేలా ఉందని ఇంకొందరు ఈ సినిమాపై విరుచుకుపడ్డారు. ఆఖరికి సెన్సార్ బోర్డ్ కూడా ఈ సినిమాకి చాలా కట్స్ చెప్పగా.. రివైజింగ్ కమిటీకి వెళ్లి మరీ సినిమాని విడుదల చేసారు. 112 నిమిషాల ఈ సినిమాలో నిజంగానే బ్రాహ్మణులను హర్ట్ చేసే అంశాలు ఉన్నాయా? అసలు బ్యాడ్ గర్ల్ ఎవరు? అనేది చూద్దాం..!!

Bad Girl Movie Review

కథ: యుక్త వయసుకు వచ్చిన ఓ సగటు మధ్యతరగతి అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). అందరు ఆడపిల్లల్లానే తనకూ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలని, సుఖంగా ఓ చిన్న ఇంట్లో బ్రతకాలని కలలు కంటూ ఉంటుంది.

స్కూల్ స్టేజ్ లో నలన్ (హ్రిదు హరూన్), కాలేజ్ వయసులో అర్జున్ (శశాంక్ బొమ్మిరెడ్డిపల్లి), ఉద్యోగం చేస్తూ ఆధునిక ఇండిపెండెంట్ ఉమెన్ గా బ్రతికే స్టేజ్ లో ఇర్ఫాన్ (టీజే అరుణాశలం)లతో రిలేషన్ షిప్స్ ట్రై చేసి రకరకాల కారణాల వల్ల బ్రేకప్ అవుతుంది.

ప్రతి ఇంట్లో ఉన్నట్లుగానే కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి, బాధ్యతగా భావించే తండ్రి, సొంత మనిషిలా చూసుకునే స్నేహితురాలు.

ఒకానొక స్టేజ్ లో ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ నుండి రమ్య ఎలా బయటపడింది? ఆమెను బ్యాడ్ గర్ల్ గా సమాజం ఎందుకు ముద్ర వేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాలన్నమాట.

నటీనటుల పనితీరు: అంజలి శివరామన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పొచ్చు. ఒక స్కూల్ పిల్లగా ఎంత సహజంగా ఉందో, ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గాను అంతే చక్కగా ఒదిగిపోయింది. ఇక ఒక సగటు అమ్మాయికి ఉండే భయాలు, కన్ఫ్యూజన్, కోరిక వంటి ఎమోషన్స్ ను ఆమె కళ్లతో ఎమోట్ చేసిన విధానం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.

తల్లి పాత్ర పోషించిన శాంతిప్రియ నటన ఎంత సహజంగా ఉందంటే.. ప్రతి ఒక్కరూ తమ తల్లిని ఆమెలో చూసుకుంటారు. ఒక స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నా, భర్త ప్లేట్ దగ్గరకే టిఫిన్ అందించే సగటు గృహిణిగా, తన కుమార్తెను జాగ్రత్తగా కాపాడాలనుకునే తల్లిగా ఆమె పాత్ర చాలా రియలిస్టిక్ గా ఉంది. ముఖ్యంగా.. సైక్రియార్టిస్ట్ దగ్గర కూర్చుని “నా కూతుర్ని నేను కాపాడుకోకూడదా?” అని వాపోయే సందర్భంలో ఆమె నటన, కళ్లలో పలికే అమాయకత్వం ఆ పాత్రకు నిండుతనం తీసుకొచ్చాయి.

స్నేహితురాలు సెల్వి పాత్రలో శరణ్య రవిచంద్రన్ క్యారెక్టర్ కూడా చాలా రిలేటబుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఫ్రెండ్ కచ్చితంగా ఉండి తీరాలి అనిపిస్తుంది.

ఇక అబ్బాయిలు హృదు హారూన్, టీజే, శశాంక్ లు తమ పరిమిత పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా దర్శకురాలు వర్ష భరత్ గురించి మాట్లాడుకోవాలి. ఒక అమ్మాయి మనసులోని లోతును మరో అమ్మాయి మాత్రమే స్పష్టంగా అర్థం చేసుకోగలదు అని ఊరికే అనరు అనిపించింది. ఎందుకంటే.. ఈమధ్యకాలంలో ఎంతోమంది దర్శకులు ఫీమేల్ పర్స్పెక్టివ్ ను ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించినా.. సఫలీకృతులవ్వలేకపోయారు. కానీ.. వర్ష మాత్రం అమ్మాయిల థాట్ ప్రాసెస్ మొదలుకొని వారి ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతీ విషయాన్ని చాలా సహజంగా ప్రోజెక్ట్ చేసింది.

మాములుగా అమ్మాయిల్ని హైలైట్ చేయాలంటే.. అబ్బాయిల్ని వెధవల్లా, ఇంకా చెప్పాలంటే విలన్స్ లా చూపిస్తుంటారు చాలామంది. కానీ వర్ష అలా చేయలేదు. సందర్భానుసారంగా వచ్చే ఒక్క అర్జున్ మరియు పెద్దరికం చూపించే తండ్రి పాత్ర మినహా ఎవర్నీ తప్పుగా ప్రొజెక్ట్ చేయలేదు. అన్నిటికంటే ముఖ్యంగా.. ప్రీక్లైమాక్స్ లో మెటఫారికల్ గా ఆడపిల్లను, పిల్లి పిల్లతో పోల్చి ఇచ్చే జస్టిఫికేషన్ భలే ముచ్చటగా ఉంది. ఇక సమాజం లేదా కొందరు వ్యక్తులు ఒక అమ్మాయి స్వతంత్రంగా ఉంటే.. దాన్ని తప్పుగా ఎలివేట్ చేస్తూ ఆ అమ్మాయిని “బ్యాడ్ గర్ల్”గా ఎలా ముద్ర వేస్తారు అనేది డైరెక్ట్ గా కాకుండా అంతర్లీనంగా చూపించిన విధానం దర్శకురాలిగా వర్ష సున్నితత్వానికి ప్రతీకగా నిలిచింది. ఇక బ్రాహ్మణుల కమ్యూనిటీని టార్గెట్ చేయడం గట్రా అంటారా.. అది చూసే పద్ధతిని బట్టి ఉంటుంది.

ఎందుకంటే.. పీరియన్స్ అనే టాపిక్ ను ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ట్రీట్ చేస్తారు. అయితే.. బ్రాహ్మణ కుటుంబాల్లో పద్ధతులు, ఆచారాలు ఎక్కువ కాబట్టి, దాన్ని ఇంకాస్త రియలిస్టిక్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఆమె హీరోయిన్ ను బ్రాహ్మణ యువతిగా చూపించి ఉండొచ్చు అనేది నా భావన. ఇక సెక్సువల్ ప్లెజర్ ప్రొజెక్షన్ అనేది కంప్లీట్ గా దర్శకురాలి ఛాయిస్. సో, ఓవరాల్ గా వర్ష భరత్ సగటు అమ్మాయిల దృష్టికోణాన్ని కుదిరినంత స్వచ్ఛంగా, స్పష్టంగా తెరకెక్కించింది అనే చెప్పాలి.

అమిత్ త్రివేది సంగీతం, సినిమాటోగ్రాఫర్ల పనితనం, ప్రొడక్షన్ డిజైన్ వంటివన్నీ దర్శకురాలి విజన్ ను సరిగ్గా ఎలివేట్ చేయడంలో దోహదపడ్డాయి.

విశ్లేషణ: 2019లో కన్నడలో “గంటుమోటే” అనే సినిమా విడుదలైనప్పుడు, ఆ సినిమా చూసి.. అమ్మాయి మనసును దర్శకురాలు రూప రావు భలే చూపించింది కదా అనిపించింది. ఆ సినిమా తర్వాత ఆస్థాయిలో అమ్మాయి ఆలోచన విధానాన్ని లోతుగా వ్యక్తీకరించిన చిత్రం “బ్యాడ్ గర్ల్”. ఈ సినిమాలోని సన్నివేశాలు కొందరికి నచ్చితే, ఇంకోదరికి నచ్చకపోవచ్చు.. కానీ కచ్చితంగా ఆలోచింపజేస్తుంది. ఇదేమీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ నెంబర్లు సాధించే సినిమా కాదు. కానీ.. స్టోరీ టెల్లింగ్ లో అంతర్జాతీయ స్థాయికి మన సౌత్ సినిమాని తీసుకెళ్లే చిత్రం.

ఫోకస్ పాయింట్: ఓ సగటు అమ్మాయి మీద సమాజం వేసిన ముద్ర!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus