Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో కొన్ని పేజీలు ఇప్పటికీ నెత్తుటి మరకలతోనే కనిపిస్తాయి. అందులో బైరాన్‌పల్లి ఉదంతం ఒకటి. నిజాం రజాకార్ల అరాచకానికి సాక్ష్యంగా నిలిచిన ఈ గ్రామం ఇప్పుడు మన టాలీవుడ్ దర్శకులకు ఒక ఎమోషనల్ పాయింట్ గా మారింది. ఒకప్పుడు కమర్షియల్ కథల వైపు చూసిన నిర్మాతలు, ఇప్పుడు ఇలాంటి మరుగున పడిన చారిత్రక అంశాలను వెలికితీసే పనిలో పడ్డారు. తాజాగా అశ్విని దత్ లాంటి బడా నిర్మాత కూడా ఇదే బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

Champion

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ‘ఛాంపియన్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పైకి ఇది ఒక ఫుట్ బాల్ ప్లేయర్, ఒక థియేటర్ ఆర్టిస్ట్ మధ్య నడిచే ప్రేమకథలా కనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న అసలు సోల్ మాత్రం బైరాన్‌పల్లి ఊచకోతే అని రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. 1948 ఆగస్టు 27న జరిగిన ఆ దారుణ కాండను ఈ సినిమా కథలో ఒక భాగంగా బలంగా చూపించబోతున్నారు.

అసలు చరిత్రలోకి వెళ్తే.. భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అవుతున్న రోజులవి. నిజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్లు బైరాన్‌పల్లి గ్రామంపై విరుచుకుపడి సుమారు 200 మంది అమాయక గ్రామస్తులను పొట్టనబెట్టుకున్నారు. ఆనాటి ఆ భయానక వాతావరణం, ప్రజల తెగువ, త్యాగం ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజల గుండెల్లో మెదులుతూనే ఉంటాయి. ఆ ఎమోషన్ ను వాడుకుంటే సినిమాకు బలం చేకూరుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

అయితే ఈ ప్రయత్నం చేయడం రోషన్ ఒక్కడే కాదు. ఈ మధ్యనే వచ్చిన ‘రజాకర్’ సినిమాలో కూడా ఈ ఘటన తాలూకు తీవ్రతను, రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. అలాగే ‘బైరాన్‌పల్లి’ పేరుతోనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒక మోస్తారు ఫలితాన్ని అందుకున్నా, చరిత్రను గుర్తు చేయడంలో మాత్రం సఫలమయ్యాయి.

ఇప్పుడు అదే పాయింట్ ను తీసుకుని రోషన్ ‘ఛాంపియన్’ రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకే ఘటన చుట్టూ ఇన్ని సినిమాలు రావడం చూస్తుంటే, ఆ కథలో ఉన్న ఇంటెన్సిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక విషాదకరమైన అధ్యాయమే అయినా, వెండితెరపై ఎమోషన్ పండించడానికి దర్శకులు దీన్నే నమ్ముకుంటున్నారు. మరి వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద సంస్థ తీస్తున్న ఈ సినిమాలో ఆ చరిత్రను ఎంత నిజాయితీగా, ఎంత కొత్తగా చూపిస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags