Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ప్రవీణ్, వైవా హర్ష, షైనింగ్ ఫణి (Hero)
  • NA (Heroine)
  • గరుడ రామ్, కృష్ణభగవాన్, జయకృష్ణ, వివేక్ దండు (Cast)
  • ఎస్.జె.శివ (Director)
  • లక్ష్మయ్య ఆచారి - జనార్దన్ ఆచారి (Producer)
  • వికాస్ బడిస (Music)
  • బాల సరస్వతి (Cinematography)
  • మార్తాండ్ కె.వెంకటేష్ (Editor)
  • Release Date : ఆగస్ట్ 08, 2025
  • ఎస్.జె మూవీస్ (Banner)

కొన్ని వందల సినిమాల్లో కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకి సుపరిచితుడైన ప్రవీణ్ మొదటిసారి హీరోగా మారి నటించిన చిత్రం “బకాసుర రెస్టారెంట్”. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (ఆగస్ట్ 08) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రంతో ప్రవీణ్ హీరోగానూ నిలదొక్కుకోగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!

Bakasura Restaurant Movie Review

కథ: జీవితంలో ఏదో సాధించాలనే ఆశ ఉన్నప్పటికీ.. పరిస్థితులు సహకరించకపోవడంతో ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ, నలుగురు స్నేహితులతో కలిసి హైదరాబాద్ లో ఒక మారుమూల ఇల్లు రెంట్ కి తీసుకొని జీవితాన్ని గడిపేస్తుంటాడు పరమేశ్ (ప్రవీణ్).

ఎలాగైనా ఒక 50 లక్షలు సంపాదించి సొంతంగా రెస్టారెంట్ పెట్టడం అనేది పరమేశ్ ధ్యేయం, అందుకోసం ఏవేవో పనులు చేసి ఆఖరికి.. తాంత్రిక శక్తులను నమ్ముకుంటాడు.

పరమేశ్ & గ్యాంగ్ చేసిన తాంత్రిక పూజలు వాళ్ళకి ఎలాంటి కష్టాలను తెచ్చిపెట్టింది? రెస్టారెంట్ పెట్టాలనే వాళ్ల కల ఎలా నెరవేరింది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: ప్రవీణ్ ఆల్రెడీ నటుడిగా పలుమార్లు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలోనూ అన్నీ తానై నడిపించాలి అనే రూల్ పెట్టుకోకుండా, అందరితో కలిసి మంచి హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశాడు. ప్రవీణ్ తో కలిసి నటించిన కుర్రాళ్లందరూ మంచి నటనతో ఆకట్టుకున్నారు. కీలక పాత్రలో గరుడ రామ్, వైవా హర్షలు అలరించారు. వారి పాత్రలు సినిమాకి మంచి వెయిటేజ్ యాడ్ చేశాయి. కృష్ణ భగవాన్ పాత్ర కాస్తంత నవ్వించే ప్రయత్నం చేసి కానీ పూర్తిస్థాయిలో వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా చాలా లోటుపాట్లు ఉన్నప్పటికీ.. కామెడీ & ఎమోషన్ తో కవర్ చేశాడు దర్శకుడు శివ. తాను చెప్పాలనుకున్న పాయింట్ ను ఎలాంటి డీవియేషన్ లేకుండా చాలా సింపుల్ గా తెరకెక్కించాడు. అయితే అతనికి మంచి ప్రొడక్షన్ సపోర్ట్ లభించి ఉంటే ప్రొడక్ట్ అవుట్ పుట్ ఇంకాస్త నీట్ గా ఉండేది అనిపించింది. ముఖ్యంగా కథలో అంతర్లీనంగా శివ తత్వాన్ని బోధించిన విధానం, సెకండ్ పార్ట్ కి ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. ఒక సిరీస్ గా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లవచ్చు కానీ.. సీజీ & ఆర్ట్ వర్క్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. సెకండాఫ్ లో వచ్చే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ల కామెడీ కొంతమందికి నచ్చవచ్చు కానీ.. అదేమీ పెద్ద గొప్పగా లేదు. దాన్ని దాదాపుగా 10 నిమిషాల పాటు సాగదీయడం కూడా మైనస్ గా మారింది. ఓవరాల్ గా మొదటి సినిమా అయినప్పటికీ పర్వాలేదనిపించుకున్నాడు శివ.

సంగీతం డీసెంట్ గా ఉండగా.. కెమెరా వర్క్ కి బడ్జెట్ ఇబ్బందులు ఎదురయ్యాయని అర్థమవుతుంది. మిగతా టెక్నికాలిటీస్ గురించి పెద్దగా మాట్లాడుకునేంతలా ఏమీ లేదు.

విశ్లేషణ: ఆలోచన పరంగా బాగున్నప్పుడు దాని ఆచరణ విషయంలో చాలా జాగ్రత్తపడాలి. ఒక్కోసారి బడ్జెట్ సహకరించకపోవచ్చు కానీ.. అవన్నీ ప్రేక్షకులకు పట్టవు కదా. టికెట్ కొని థియేటర్ కి వచ్చే ఆడియన్స్ చూసేది అవుట్ పుట్ ఎలా ఉంది అనేది మాత్రమే తప్ప.. దాని వెనుక ఉన్న కష్టాన్ని, ఇబ్బందులను కాదు. కథ, క్యాస్టింగ్ డీసెంట్ గా ఉన్నప్పటికీ.. ఎగ్జిక్యూషన్ లో దొర్లిన తప్పుల కారణంగా “బకాసుర రెస్టారెంట్” పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది.

ఫోకస్ పాయింట్: ఆలోచన బాగుంది కానీ.. ఆచరణలో పట్టు లోపించింది!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus