నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారకరామారావుగా ఆయన జీవితగాధగా తెరకెక్కిన బయోపిక్ లో నటించిన చిత్రం “ఎన్టీఆర్ కథానాయకుడు”. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 9న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతోంది. బాలయ్య మాత్రమే కాకుండా బోలెడంతమంది స్టార్ హీరోహీరోయిన్లు నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెన్సార్ కార్యక్రమాలు నిన్న ముగుసి “యు” సర్టిఫికెట్ అందుకున్న విషయం తెలిసిందే. నిన్న ఈ చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు విశేషంగా ఎగ్జైట్ అయిపోయారట.
ఈ సినిమాలో బాలయ్య మొత్తం 63 డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నారు. సినిమాలో ఆయన వాచకం, ఎన్టీఆర్ గా ఆయన అభినయం అన్న ఎన్టీఆర్ ను గుర్తుకు చేస్తుందని సినిమా చూసినవాళ్ళందరూ చెబుతుండడం విశేషం. ముఖ్యంగా.. దానవీరశూర కర్ణ, అడవి రాముడు రీక్రియేటెడ్ సీన్స్ కి నందమూరి అభిమానులు మాత్రమే కాదు యావత్ తెలుగు సినిమా అభిమానులు విజిల్స్ వేయడం ఖాయమట. కాకపోతే.. యంగ్ ఎన్టీఆర్ గా బాలయ్య గెటప్ బాగోలేదని, సినిమా మొత్తానికి అదే పెద్ద మైనస్ అని చెబుతున్నారు. ఇక కీరెవాణి సంగీతం, క్రిష్ దర్శకత్వం సినిమాని ఒక క్లాసిక్ గా నిలిపాయని కూడా చెబుతున్నారు. రెండో భాగానికి ఇచ్చిన ఎలివేషన్ కూడా అదిరిపోయిందని వారు చెబుతుండడంతో “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సో, జనవరి 9 కోసం అందరూ చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు.