బెలూన్ సినిమా రివ్యూ & రేటింగ్!

అప్పుడెప్పుడో 2017లో మొదలై.. థియేటర్లలో రిలీజ్ అవ్వలేక ఎట్టకేలకు జూలై 10న జీ5 యాప్ లో డైరెక్ట్ ఒటీటీ రిలీజ్ కి నోచుకున్న తమిళ హారర్ చిత్రం “బెలూన్”. తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలైన ఈ హారర్ సినిమా కథ ఏమిటి? ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!

కథ: జీవ (జై) దర్శకుడు అవ్వడమే ధ్యేయంగా ప్రయత్నాలు చేస్తుంటాడు. కథ కోసం అన్వేషణలో భాగంగా తన స్నేహితుడు పాండా (యోగిబాబు)తో కలిసి అరకు వెళ్తాడు. అక్కడి ఒక ఇల్లు, దాని వెనుక ఉన్న కథను తెలుసుకొని ఆ కథతో సినిమా తీయాలి అనుకుంటాడు. అందుకోసం తన భార్య జాక్వలిన్ (అంజలి)ని కూడా అరకు తీసుకెళ్తాడు.
అక్కడికి వెళ్ళినప్పటినుంచి జీవ & టీం కు అనుకోని ఇబ్బందులు, విచిత్రమైన సమస్యలు తలెత్తుతుంటాయి. మధ్యమధ్యలో బెలూన్లు హడావుడి చేస్తుంటాయి.

అసలు జీవ & టీం ని ఇబ్బందిపెడుతున్న దెయ్యం బ్యాచ్ ఎవరు? వారి బ్యాక్ స్టోరీ ఏమిటి అనేది “బెలూన్” సినిమాను జీ5 యాప్ లో చూసి తెలుసుకోండి.

నటీనటుల పనితీరు: జై, అంజలి నటన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళు ఆ సినిమా షూటింగ్ టైంలో వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద పెట్టిన శ్రద్ధ పాత్రల మీద పెట్టలేదనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. యోగిబాబు మాత్రం నవ్వించడానికి ప్రయత్నించాడు కానీ.. మూడేళ్ళ క్రితం సినిమా కావడంతో వాళ్ళు వేసిన పంచులన్నీ కాలంలో కలిసిపోయి పెద్దగా పేలలేదు.

జనని పెద్ద పెద్ద కళ్ళతో అలరించడానికి ప్రయత్నించింది కానీ పెద్దగా ఫలితం లభించలేదు. నాగినీడు మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు.

సాంకేతికవర్గం పనితీరు: ఒక హారర్ సినిమాకి చాలా కీలకమైన కెమెరా వర్క్ ఈ సినిమాకి మైన్ మైనస్ గా నిలిచింది. ఏవో అక్కడక్కడా వచ్చే జంప్ స్కేర్ షాట్స్ తప్ప ఆడియన్స్ ను థ్రిల్ చేయగలిగే ఒక్క కెమెరా యాంగిల్ & షాట్ సినిమా మొత్తంలో లేకపోవడం గమనార్హం. యువన్ శంకర్ రాజా మెలోడీస్ బాగున్నాయి కానీ.. తెలుగు సాహిత్యం సింక్ అవ్వలేదు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ తో హారర్ ఫీల్ కలిగించలేకపోయాడు.

దర్శకుడు శినిష్ “మయూరి” తరహాలో ఇవ్వాలనుకుని రాసుకున్న క్లైమాక్స్ ట్విస్ట్ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. పైగా.. కథ ఇప్పటికీ చాలా సినిమాల్లో చూసేసింది, కథనం కూడా ఆకట్టుకొనే స్థాయిలో లేనిది కావడంతో.. ఫార్వార్డ్ చేసుకుంటూ చూసినా కూడా బోర్ కొట్టే సినిమాగా మిగిలిపోయింది “బెలూన్”.

విశ్లేషణ: ఏదో అంజలి ఉంది కాబట్టి ఒటీటీలో రిలీజ్ అయ్యింది కానీ.. లేదంటే బాక్సుల్లో లేదా హార్డ్ డిస్కుల్లో మగ్గిపోవాల్సిన చిత్రం “బెలూన్”. సొ, ఇంత చెప్పాక కూడా చూద్దాం అనుకుంటున్నారంటే సాహసం అనే చెప్పాలి.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus