తెలుగులో ఉన్న అతి తక్కువ మంది టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో ఒకడు శివ రామచంద్రవరపు. అతడు హీరోగా విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “బాలు గాని టాకీస్”. రఘు కుంచె కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం “ఆహా”లో విడుదలైంది. ప్రస్తుతం ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: ఊర్లో మొత్తం అప్పులు, అందరి చేత తిట్లు, పెళ్లికి పిల్లని ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రారు. అది బాలు (శివ రామచంద్రవరపు)గాడి పరిస్థితి. ఉన్న ఒక్క పాత థియేటర్లో బీగ్రేడ్ సినిమాలు ఆడిస్తూ టైమ్ పాస్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఆ హాల్లో పెద్ద సినిమా వేసి బాగా డబ్బు సంపాదించాలనేది బాలు గాడి ఆశయం.
ఆ ఆశయం నెరవేర్చుకోవడానికి ఒక్క రాత్రి దూరంలో ఉండగా.. టాకీసులో అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. దాంతో బాలుగాడికి కొత్త చిక్కులు వస్తాయి.
ఏమిటా సమస్య? ఆ సమస్యను బాలుగాడు ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి ఏం చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “బాలు గాని టాకీస్” కథాంశం.
నటీనటుల పనితీరు: శివ రామచంద్రవరపు మరోసారి తనదైన శైలిలో బాలు పాత్రలో జీవించేశాడు. మనిషిలో ఉండే సహజమైన కపట బుద్ధిని తన కళ్ళతోనే ప్రెజంట్ చేశాడు. శరణ్య శర్మ పల్లెపడుచుగా ఒదిగిపోయింది. తాత పాత్రలో కేతిరి సుధాకర్ రెడ్డి తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుని, కీలక పాత్ర పోషించాడు.
రఘు కుంచె పాత్రలో ఉన్న విలనిజం ఆయన కళ్ళల్లో కనిపించలేదు. మిగతా సహాయక నటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సింక్ సౌండ్ పద్ధతిని ఈ సినిమా కోసం ఫాలో అవ్వడం అనేది.. కొన్ని చోట్ల బాగున్నా, చాలా చోట్ల మాత్రం సరిగా మ్యానేజ్ చేయక చిరాకుపెడుతుంది. సినిమాటోగ్రఫీ వర్క్ & సంగీతం పర్వాలేదు అనే స్థాయిలో ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్నిటినీ తనదైన కథనంతో నెట్టుకొచ్చిన దర్శకుడు విశ్వనాథ్ ప్రతాప్ పనితనాన్ని మాత్రం మెచ్చుకోవాలి. తొలి 20 నిమిషాలు చూసి ఏదో సాధారణ సినిమాలే అనుకుంటున్న తరుణంలో.. మంచి ట్విస్ట్ తో కథను మలుపు తిప్పాడు. ట్విస్ట్ ను చివరి వరకు రివీల్ చేయకుండా జాగ్రత్తపడిన పడిన తీరు, చివర్లో ఇచ్చిన జస్టిఫికేషన్ చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమా గురించి ఏమీ తెలియకుండా చూసేవారికి ఒక మంచి అనుభూతినిస్తుంది చిత్రం. దర్శకుడిగా కొన్ని పరిమితులకు తలొగ్గాల్సి వచ్చినా.. రచయితగా తన సత్తాను మాత్రం బలంగా చాటుకున్నాడు. ముఖ్యంగా సినిమాను ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. ఒక కథను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే సత్తా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్ కి మంచి అవకాశం లభిస్తే పెద్ద డైరెక్టర్ అవ్వగలడు.
విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా చూసే సినిమాలు బోర్ కొట్టకుండా.. చివరివరకు ఎంగేజ్ చేస్తే భలే మజా ఉంటుంది. కానీ అది చాలా అరుదుగా జరిగే విషయం. “బాలు గాని టాకీస్” అటువంటి అరుదైన అనుభూతిని ఇస్తుందీ చిత్రం. శివ రామచంద్రవరపు నటన, విశ్వనాథ్ ప్రతాప్ టేకింగ్ & నేటివిటీ కోసం “ఆహా” యాప్ లో ఈ సినిమాను హ్యాపీగా చూడవచ్చు.
ఫోకస్ పాయింట్: బాలు గాని టాకీస్ లొల్లి భలేగుంది!
రేటింగ్: 2.5/5