“దశాబ్ధాలు మారిన, శతాబ్ధాలు మారినా.. ప్రేమ మారాడు, ప్రేమికులు మాత్రమే మారుతుంటారు. చరిత్రలో రోమియో-జూలియట్, దేవదాస్-పార్వతి, సలీం-అనార్కలి, లైలా-మజ్ను ల తర్వాత ఇప్పుడు “బంగారి బాలరాజు” అంటూ భీభత్సంగా పబ్లిసిటీ చేయబడిన చిత్రం “బంగారి బాలరాజు”. ఫ్యాక్షన్ నేపధ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి పబ్లిసిటీలో ఉన్న దమ్ము సినిమాలో ఉందో లేదో చూద్దాం..!!
కథ : కర్నూలు జిల్లాలో రాజవరం అనే గ్రామంలో వయసుకొచ్చిన తమ పిల్లలను ఇంట్లోనే కాదు ఊర్లో ఉంచాలన్నా భయపడుతుంటారు ఊర్లో జనాలు. అందుకు కారణం ఊరి పెద్ద జగ్గారెడ్డి. ఊర్లో ఎవరైనా ప్రేమించినా, ఆ ప్రేమకు ఎవరైనా సహాయపడినా చంపేస్తుంటాడు. జగ్గారెడ్డి ఈ హత్యాకాండను మొదలెట్టడానికి కారణం తన కూతురు బంగారి (కరోణ్య)ను ఆ ఊర్లో టీచర్ కొడుకు బాలరాజు అలియాస్ రాజు (రాఘవ్) ప్రేమించుకోవడమే.
ఈ ప్రేమ వ్యవహారం ఎక్కడివరకూ వెళ్లింది? చివరికి ఫలించిందా లేక ఫ్యాక్షన్ దాడులకు బలైందా? అనేది “బంగారి బాలరాజు” కథాంశం.
నటీనటుల పనితీరు : సినిమా మొదలైనప్పట్నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంటుంది. ఇది బాలల చిత్రమా లేక హీరో బాలుడా అని. ఎందుకంటే.. రాఘవ్ చూడ్డానికి చైల్డ్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి తక్కువ అన్నట్లుగా కనిపిస్తుంటాడు. పైగా.. కుర్రాడికి నటనలో ఓనమాలు కూడా రావు. పాపం పక్కన ఎంతమంది ఆర్టిస్టులు బాబుని ఎంతగా కవర్ చేస్తున్నప్పటికీ.. బాబు నటవిశ్వరూపం ముందు తాళలేకపోయారు.
సినిమా మొత్తానికి కాస్త అందంగా కనిపించడమే కాక, నటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది హీరోయిన్ కరోణ్య కత్రిన్ మాత్రమే. డబ్ స్మాష్ ల పుణ్యమా అని పాపులర్ అయిన ఈ నటీమణి ఈ సినిమాలో చక్కగానే నటించింది. కానీ.. అమ్మడి నటనకు తగ్గ పాత్ర లేకపోవడంతో ఆమె కెరీర్ కు ఈ సినిమా పెద్దగా పనికిరాదు. ఇక సినిమాలో ఉన్న సీరియల్ ఆర్టిస్టుల నటన చూడ్డానికి కూడా నీరసం వచ్చేస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు : దర్శకుడు కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా కనీస స్థాయి అవగాహన కూడా లేదని సినిమా మొదలైన మొదటి పదిహేను నిమిషాల్లోనే అర్ధమవుతుంది. నటీనటుల ఎంపిక మొదలుకొని, సదరు నటీనటుల నుంచి నటన రాబట్టుకోవడం వరకూ ప్రతి విషయంలోనూ దారుణంగా ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. కొన్ని లక్షల రూపాయల డబ్బును వృధా చేయడం తప్ప దర్శకుడు ఈ సినిమాతో చేసిందేమీ లేదు.
ఇక ఈ కళాఖండానికి సంబంధించిన సంగీతం, ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. దర్శకత్వమే సినిమాకి మైనస్ అంటే.. సంగీతం, సినిమాటోగ్రఫీ అంతగంటే వీక్ గా ఉన్నాయి.
విశ్లేషణ : కనీస స్థాయి కంటెంట్ లేని ఈ సినిమా గురించి ఇంతకుమించి మాట్లాడుకోవడం కూడా వేస్టే.
రేటింగ్ : 0.5/5