“జబర్దస్త్” బ్యాచ్ ధనరాజ్, శకలక శంకర్ వంటి నటులందరూ కలిసి నటించిన చిత్రం “బంతిపూల జానకి”. “ధనలక్ష్మి తలుపు తడితే” అనంతరం కమెడియన్ ధనరాజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో దీక్షాపంత్ కథానాయికగా నటించగా.. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వం వహించారు. కామెడీ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!!
కథ:
జానకి (దీక్షాపంత్)కి నేషనల్ అవార్డ్ వచ్చిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపే నెపంతో ఆమె ఇంటికి వచ్చి.. ఆమెను లోబరుచుకోవాలనుకొంటారు. కానీ.. అనుకోని రీతిలో ఒక్కొక్కరిగా మరణిస్తుంటారు. తన ఫ్రెండ్ కమ్ మేనేజర్ శ్యామ్ (ధనరాజ్)తో కలిసి అలా చనిపోయినవారి శవాలను దాచేస్తుంది జానకి.అసలు జానకి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఎలా మరణించారు? వారి మరణాలు జానకి-శ్యామ్ ల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులేమిటి? అనేది కథాంశం.
నటీనటుల పనితీరు:
“బంతిపూల జానకి”గా టైటిల్ రోల్ పోషించిన దీక్షాపంత్ ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ సహనాన్ని పూర్తి స్థాయిలో పరీక్షిస్తాయి. అయితే.. అందాల ప్రదర్శనలో మాత్రం ఎటువంటి మొహమాటం చూపకపోవడంతో.. మాస్ ఆడియన్స్ మాత్రం ఆమె పాత్రను ఎంజాయ్ చేస్తారు.
నటుడిగా ధనరాజ్ ఈ చిత్రంలో ఒకింత ఆశ్చర్యపరిచాడనే చెప్పాలి. రెగ్యులర్ కామెడీతో కాకుండా చాలా సెటిల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నాడు.
అన్నదానం అనే దొంగపాత్రలో శకలక శంకర్ కథలో కీలకమైన మలుపు తీసుకురావడంతోపాటు.. తనదైన శైలిలో నవ్వించాడు.
చమ్మక్ చంద్ర, అదుర్స్ రఘు, రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్ లు తమ తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించుకొన్నారు.
సాంకేతికవర్గం పనితీరు:
భోలే సంగీతం మాస్ ఆడియన్స్ కు మాత్రమే అన్నట్లుగా ఉంది. ధనరాజ్ పాడిన పాట వినసోంపుగా లేకపోవడంతోపాటు.. సదరు పాటను సినిమా ప్రారంభంలో పెట్టడంతో అప్పుడే థియేటర్ లో సెటిల్ అవుతున్న ఆడియన్స్ మైండ్ పై ప్రభావం చూపుతుంది.జి.ఎల్.బాబు కెమెరా పనితనం బాగుంది. నైట్ ఎఫెక్ట్ లైటింగ్ చక్కగా సెట్ చేసుకొన్నాడు. అందువల్ల సినిమా మొత్తం నైట్ ఎఫెక్ట్ లోనే జరుగుతుందన్న ఫీల్ ప్రేక్షకుడికి కలిగిస్తూనే.. ఎక్కడా చీకటి లేకుండా బాగా కవర్ చేశాడు. శేఖర్ విఖ్యాత్ సమకూర్చిన సంభాషణాలు సోసోగా ఉన్నాయి. ఇక కథలోని మెయిన్ థ్రెడ్ ను కొరియన్ సినిమా “హ్యాపీ కిల్లింగ్” నుంచి స్పూర్తి పోందడం గమనార్హం.
నెల్లుట్ల ప్రవీణ్ చందర్ సమకూర్చిన స్క్రీన్ ప్లే బోరింగ్ గా ఉన్నప్పటికీ.. సీన్ టు సీన్ కనెక్టివిటీ మాత్రం ఆకట్టుకోగలిగింది. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా అలరించగలిగాడు. అయితే.. ఉన్న కామెడియన్స్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా వారి క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడానికే ఎక్కువ సమయం కేటాయించడం మాత్రం ప్రేక్షకుడ్ని కాస్త అసహనానికి గురి చేస్తుంది. ముఖ్యంగా.. సినిమా రన్ టైమే 89 నిమిషాలు అనగా గంటా ముప్పై తొమ్మిది నిమిషాలు కాగా.. అంత అతి తక్కువ సమయంలోనూ ల్యాగ్ ఉండడం మాత్రం జీర్ణించుకోలేడు.
విశ్లేషణ:
రజనీకాంత్ సినిమాకి రజనీని చూడడానికే వస్తారు. అలాగే.. పది మంది కామెడియన్లు నటించిన సినిమా అనగానే కడుపుబ్బ కాకపోయినా ఓ మోస్తరుగా నవ్వుకోవచ్చు అనే భావనతోనే థియేటర్ కి వస్తారు ప్రేక్షకులు. అయితే.. వారిని “కొత్తగా అలరిద్దాం” అనే ఆలోచనతో వింత ప్రయోగాలు చేసి థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడ్ని ఇబ్బందిపెడితే మాత్రం సినిమాను సర్దేసుకోవాల్సిందే. “బంతిపూల జానకి” అనే టైటిల్ మరియు పోస్టర్ లో నిండిపోయిన కామెడియన్లను చూసి థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడ్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. సో, తెగ నవ్వేసుకొందాం అని మైండ్ లో ఫిక్స్ అవ్వకుండా.. ఓ గంటన్నర సరదాగా టైమ్ పాస్ చేయడానికి మాత్రమే థియేటర్ కి వెళ్ళే ప్రేక్షకుడ్ని ఓ మోస్తరుగా అలరించే చిత్రం “బంతిపూల జానకి”.
రేటింగ్: 2/5