హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం “బట్టల రామస్వామి బయోపిక్కు”. సంగీత దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం జీ5 యాప్ లో ఇవాళ విడుదలైంది. విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా సంగతేంటో చూద్దాం..!!
కథ: తండ్రి చేసిన అప్పులు తీర్చి, సొంతంగా బట్టల షాపు పెట్టుకొని, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా, ఏక పత్నీవ్రతునిగా బ్రతికేద్దామని కలలు కంటుంటాడు రామస్వామి (అల్తాఫ్ హాస్సన్). ప్రేమించిన పూస (శాంతి రావు)ను పెద్దలను ఎదిరించి మరీ పెళ్లాడి, బండి మీద చీరలు అమ్ముకుంటూ సంతోషంగా గడిపేస్తుంటాడు. అయితే.. సాఫీగా సాగుతున్న రామస్వామి జీవితంలోకి రెండో భార్యగా వస్తుంది పూస చెల్లెలు (లావణ్య రెడ్డి), ఆ తర్వాత అనుకోని విధంగా మూడో భార్యగా ఇంట్లోకి వస్తుంది తొర్ర (సాత్విక జై). ఈ ముగ్గురు పెళ్ళాలతో వ్యక్తిగతంగా, శారీరికంగా రామస్వామి పడ్డ ఇబ్బందులు ఏమిటి అనేది జీ5 యాప్ లో చూసి నవ్వుకోవాల్సిందే.
నటీనటుల పనితీరు: టైటిల్ పాత్రధారి అల్తాఫ్ హాస్సన్ క్యారెక్టర్ కి ప్రాణం పోయడమే కాక సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. ఒక సాధారణ వ్యక్తిగా అతడి నటన, హావభావాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఒక హీరోకి ఉండాల్సిన లక్షణాలేవీ లేకపోవడమే అల్తాఫ్ కు ఉన్న ప్లస్ పాయింట్. అందువల్ల ఒక నటుడిలా కాక వ్యక్తిగా కనిపిస్తాడు. క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ లేకపోవడం వలన అతడి పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేకపోయినప్పటికీ.. సన్నివేశాలకి మాత్రం బాగా కనెక్ట్ అవుతారు.
ముగ్గురు అమ్మాయిలూ చక్కగా నటించినప్పటికీ.. శాంతి రావు మాత్రం అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఆమె హావభావాలు, స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. అలాగే లావణ్య రెడ్డి, సాత్విక జై కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా శాంతిరావు-సాత్విక జై గొడవపడి, తిట్టుకొని, కొట్టుకొనే సన్నివేశాలు అలరిస్తాయి. భద్రం, ధనరాజ్ ల పాత్రలు మంచి హాస్యాన్ని పంచాయి.
సాంకేతికవర్గం పనితీరు: డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణ్ రాసుకున్న కథ సాధారణమైనది, తెరకెక్కించిన విధానం కూడా సాధారణమైనదే. అయితే.. సన్నివేశాలను డిజైన్ చేసుకొన్న తీరు, సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. నిజానికి.. ఈ కథలో బోలెడన్ని రోమాంటిక్ సీన్స్ & అడల్ట్ సీన్స్ కి భారీ స్థాయిలో స్కోప్ ఉంది. అయితే రామ్ నారాయణ్ వల్గారిటీకి తావు లేకుండా సినిమాను తెరకెక్కించాడు. అక్కడే సగం విజయం సాధించాడు. క్లైమాక్స్ & క్యారెక్టర్స్ విషయంలో ఇంకాస్త క్లారిటీ మైంటైన్ చేసి ఉంటే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకొనేవాడు. రామ్ నారాయణ్ అందించిన బాణీలు, నేపధ్య సంగీతం కూడా కొత్తగా ఉన్నాయి.
సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది కానీ, ఒక రూరల్ డ్రామా ప్రెజంటేషన్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తిస్థాయిలో తీసుకోలేదు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండొచ్చు. అన్నిటికీ మించి ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో తప్పులు ఎక్కువగా దొర్లాయి. ఆ విషయాల్లోనూ చక్కని జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా ఇంకాస్త ఎక్క్వమందికి నచ్చేది.
విశ్లేషణ: టైటిల్, కాన్సెప్ట్ ప్రధాన ఆకర్షణలుగా తెరకెక్కిన “బట్టల రామస్వామి బయోపిక్కు” చిత్రం మీద ఎలాంటి అంచనాలు ఉండవు కాబట్టి, హ్యాపీగా జీ5 యాప్ లో ఒకసారి చూసేయొచ్చు. వల్గారిటీ లేని రూరల్ కామెడీ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే.. ల్యాగ్ ను కాస్త భరించాలి అంతే.
రేటింగ్: 2/5