Bedurulanka 2012 Movie Review in Telugu: బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 25, 2023 / 08:46 AM IST

Cast & Crew

  • కార్తికేయ (Hero)
  • నేహాశెట్టి (Heroine)
  • అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ రాంప్రసాద్ (Cast)
  • క్లాక్స్ (Director)
  • రవీంద్ర బెనర్జీ ముప్పానేని (Producer)
  • మణిశర్మ (Music)
  • సాయిప్రకాశ్ ఉమ్మడిసింగు - సన్నీ కూరపాటి (Cinematography)
  • Release Date : ఆగస్ట్ 25, 2023

డెబ్యూ చేసింది “ప్రేమతో మీ కార్తీక్” అనే క్లాసిక్ సినిమాతో అయినప్పటికీ.. ప్రేక్షకులకు పరిచయమైంది మాత్రం “ఆర్ ఎక్స్ 100” అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ తోనే. అలా మొదలైన కార్తికేయ కెరీర్ లో మళ్ళీ హిట్ రావడానికి చాలా సమయం పట్టింది. మధ్యలో విలన్ గా నటించిన సినిమాలు కూడా వర్కవుటవ్వలేదు. అయితే.. కార్తికేయ నటించిన తాజా చిత్రం “బెదురులంక” అనే సినిమా మాత్రం టీజర్ దశ నుంచే ఒక పాజిటివ్ వైబ్ మైంటైన్ చేస్తూ వచ్చింది. మరి కార్తికేయ ఈ “బెదురులంక”తోనైనా కమర్షియల్ హిట్ కొట్టగలిగాడా లేదా అనేది చూడాలి..!!

కథ: అది డిసెంబర్, 2012. ఇంకో రెండు వారాల్లో యుగాంతం అంటూ టీవీ చానల్స్ అన్నీ నానా హడావుడి చేస్తుండగా.. ప్రజలు భయపడుతున్న రోజులవి. ప్రజల భయానికి మూఢనమ్మకాన్ని జతకట్టించి బంగారంగా మార్చుకోవాలనుకుంటాడు భూషణం (అజయ్ ఘోష్). అందుకోసం దొంగ బాబా బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), డూప్లికేట్ ఫాదర్ డానియల్ (జబర్దస్త్ రాంప్రసాద్)లను రంగంలోకి దించి ప్రజల్ని వెర్రి గొర్రెలను చేయడం మొదలెడతాడు.

ఈ హడావుడి మొత్తానికి అడ్డంకిగా నిలుస్తాడు శివ (కార్తికేయ). ఈ మూఢనమ్మకాల్ని ఏమాత్రం ఖాతరు చేయని శివను, అతని వీక్నెస్ అయిన చిత్ర (నేహాశెట్టి) ప్రేమను అడ్డం పెట్టుకొని ఊరి నుంచి వెలివేస్తారు.

ఇంతకీ బెదురులంకలో యుగాంతం వచ్చిందా? యుగాంతం మరియు భూషణం నుంచి బెదురులంక ప్రజలు ఎలా బయటపడ్డారు? అనేది “బెదురులంక” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో హీరోహీరోయిన్లు ఉన్నప్పటికీ.. అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించింది మాత్రం అజయ్ ఘోష్. భూషణం అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. కథా గమనానికి మూలకారకుడిగా వ్యవహరించడం మాత్రమే కాక తన నటన, హావభావాలతో సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు. ఆధునిక యువకుడిగా కార్తికేయ లుక్స్ & మ్యానరిజమ్స్ తో అలరించాడు. నేహాశెట్టి సినిమాకి కావాల్సిన గ్లామర్ యాడ్ చేసింది.

బ్రహ్మంగా శ్రీకాంత్ అయ్యంగార్ హిలేరియస్ గా నవ్వించాడు. అతడి పంచ్ డైలాగులు బాగా పేలాయి. జబర్దస్త్ రాంప్రసాద్ కూడా అదే స్థాయిలో అలరించాడు.

చిన్న పాత్రే అయినా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు సత్య. అలాగే.. కసిరాజుగా రాజ్ కుమార్ కసిరెడ్డి నటన, డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా దర్శకుడు క్లాక్స్ గురించి మాట్లాడుకోవాలి. తెలుగులో ఆల్మోస్ట్ అంతరించిపోతున్న గోదావరి రీజనల్ కామెడీ అనే జోనర్ కు ఊపిరిపోసాడు. నిజానికి సినిమాలో బోలెడన్ని బూతులున్నాయి.. కానీ ఏదీ బూతులా అనిపించదు. అలాగే లెక్కకుమిక్కిలి ద్వంద్వార్ధ సంభాషణలున్నాయి. కానీ ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఈ తరహా సినిమా తీయడమే క్లాక్స్ సాధించిన మొట్టమొదటి విజయం.

అలాగే.. ఒక సింపుల్ సబ్జెక్ట్ తో, అంతర్లీనంగా చక్కని మెసేజ్ ఇస్తూ రెండున్నర గంటల సినిమాని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించడం అనేది మామూలు విషయం కాదు. ఒక దర్శకుడిగా, కథకుడిగా, రచయితగా క్లాక్స్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లే.

క్లాక్స్ తర్వాత సినిమాలో ఆశ్చర్యపరిచిన మరో టెక్నీషియన్ మణిశర్మ. ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఆయన మాట్లాడుతూ “డైరెక్టర్ కి నేను చేసిన ఫస్ట్ వెర్షన్ బ్యాగ్రౌండ్ స్కోర్ నచ్చలేదు, అందుకే మళ్ళీ మార్చాను” అని చెప్పినప్పుడు సడన్ గా ఒక రీసెంట్ ఫ్లాప్ గుర్తొచ్చింది. కానీ.. కథను ఆయన అర్ధం చేసుకొని, కథనాన్ని, సన్నివేశాన్ని, ఆ సన్నివేశంలోని సందర్భాన్ని ఎలివేట్ చేసే నేపధ్య సంగీతాన్ని అందించిన తీరు మాత్రం ప్రశంసనీయం. కొత్త తరం సంగీత దర్శకులెంతమంది వస్తున్నా.. ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ స్థాయి వారికి పోటీనిస్తుండడం గమనించాల్సిన విషయం.

ఇక సినిమాటోగ్రాఫర్స్ సాయిప్రకాష్ & సన్నీలు ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో మంచి విజయం సాధించారు. అలాగే.. సినిమా థీమ్ మొత్తం ఒక లొకేషన్ కి ఫిక్స్ చేసి.. వరల్డ్ బిల్డింగ్ అనేది ఆ ప్రాంతానికే పరిమితం చేయడం అనేది ఆర్ట్ & ప్రొడక్షన్ టీం కి చాలా హెల్ప్ అయ్యింది. అందువల్ల 2012నాటి స్థితిగతులను రీక్రియేట్ చేయడానికి ఎక్కువ కష్టపడక్కర్లేకుండా కుదిరింది.

విశ్లేషణ: ఇప్పటివరకూ నవతరం ఈవివి అంటూ చాలా మంది దర్శకులను పొగిడేశారు కానీ.. ఆయన మేకింగ్ స్టైల్ ను అర్ధం చేసుకొని, రీజనల్ కామెడీ అనే జోనర్ ను బాగా ఎక్స్ ప్లోర్ చేసిన దర్శకుడు క్లాక్స్. “బెదురులంక”లో ఆరోగ్యకరమైన హాస్యం, ప్రస్తుత తరం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ అండ్ అన్నీ వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి. కార్తికేయకు చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఒక మంచి హిట్ దొరికిందని చెప్పాలి.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus