నిర్మాతగా “కమిటీ కుర్రాళ్ళు”తో సూపర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న నిహారిక కొణిదెల తన స్వంత బ్యానర్ అయిన “పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్”లో రూపొందించిన తాజా వెబ్ సిరీస్ “బెంచ్ లైఫ్”. వైభవ్ రెడ్డి, ఆకాంక్ష, రితికా సింగ్, చరణ్ పెరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సిరీస్ కి “ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ” అనే సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న మానస శర్మ దర్శకురాలు. సాఫ్ట్వేర్ జీవితాల నేపథ్యంగా రూపొందిన ఈ సిరీస్ ప్రమోషనల్ కంటెంట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సోనీ లైవ్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ 5 ఎపిసోడ్ల షార్ట్ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!!
కథ: బాలు (వైభవ్ రెడ్డి), మీనాక్షి (రితికా సింగ్), రవి (చరణ్ పెరి) సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే.. బాలుకి ఉద్యోగం కన్నా.. ఎలాగైనా బెంచ్ లో కూర్చుని కొన్నేళ్లుగా సైలెంట్ గా ప్రేమిస్తున్న ఈషా (ఆకాంక్ష సింగ్)కు ప్రపోజ్ చేసి ఆమెను పెళ్లాడడం ఇష్టం. అలాగే.. మీనాక్షికి బెంచ్ లో ఉంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ డైరెక్టర్ అవ్వడం కోసం ప్రయత్నించడం ప్యాషన్, ఇక రవికి బెంచ్ లో ఉండి హ్యాపీగా గోవా వెళ్లాలని టార్గెట్.
ఇలా ప్రతి ఒక్కరికీ “బెంచ్” అనేది కామన్ ఎమోషన్. అసలు ఈ బెంచ్ గోల ఏమిటి? ఈ బెంచ్ లో ఉండడం కోసం ఎవరేం చేసారు? ఆ కారణంగా వాళ్ల కెరీర్లకు ఏమైనా మైనస్ అయ్యిందా? అనేది “బెంచ్ లైఫ్” సిరీస్ కథాంశం.
నటీనటుల పనితీరు: వైభవ్ రెడ్డిని చాలా రోజుల తర్వాత తెలుగులో చూడడం కాస్త ఆనందకరమైన విషయం. అతనికున్న అనుభవానికి ఈ సిరీస్ లో పోషిన బాలు అనే పాత్ర చాలా చిన్నది. చాలా ఈజ్ తో ఎక్కడా క్యారెక్టర్ లో నుంచి బయటికి రాకుండా చక్కగా పోషించాడు ఆ పాత్రను. ముఖ్యంగా.. ఉన్న రెండు ఎమోషనల్ సీన్స్ లోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. చాలా మంది రిలేట్ అయ్యే క్యారెక్టర్ ఇది. అయితే.. సరైన క్యారెక్టర్ ఆర్క్ లేక బాలు మాటలకి, బూతులకి కనెక్ట్ అవుతారు కానీ క్యారెక్టర్ కి ఎక్కువగా కనెక్ట్ అవ్వలేం.
రితికా సింగ్ పాత్ర బాగుంటుంది. ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు కూడా బాగుంది కానీ డబ్బింగ్ సెట్ అవ్వలేదు. డబ్బింగ్ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. సిరీస్ మొత్తానికి హైలైట్ క్యారెక్టర్ చరణ్ పేరీ పోషించిన రవి పాత్ర. స్నేహితులతో గోవా వెళ్లాలని ప్లాన్ చేసిన, చేస్తున్న వాళ్లందరికీ ఈ క్యారెక్టర్ విపరీతంగా కనెక్ట్ అవుతుంది.
“ఆయ్”తో హీరోయిన్ గా ఆకట్టుకున్న నయన్ సారిక ఈ సినిమాలో ఒక మధ్యతరగతి యువ గృహిణిగా భలే నటించింది. ఆమె పాత్రలోని అమాయకత్వాన్ని తన కళ్లతో, హావభావాలాతో పండించిన విధానం అభినందనీయం. ఆకాంక్ష సింగ్ కూడా పర్వాలేదనిపించుకుంది కానీ.. ఎందుకో ఆమె పాత్రలో ఎమోషన్ సరిగా వర్కవుటవ్వలేదు. ఇక సీనియర్లు రాజేంద్రప్రసాద్, తనికెళ్లభరణిలు తమ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకురాలు మానస శర్మ యువతరం ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు బాగా కనెక్ట్ అయ్యేలా “బెంచ్ లైఫ్” కథ-కథనాన్ని రాసుకున్న విధానం బాగుంది. ప్రతి పాత్రకు ఒక ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్ రాసుకునే ప్రయత్నం ప్రశంసనీయం. ముఖ్యంగా.. చరణ్ పెరి-నయన్ సారిక జంటకు ఇచ్చిన ముగింపు బాగుంది. కాకపోతే.. రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ పాత్రలకు ఇచ్చిన ముగింపు మరీ సినిమాటిక్ గా ఉండి, సహజత్వం లోపించడం చిన్నపాటి మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఒక పాత్రకు మంచి క్లోజర్ ఇచ్చి మరో పాత్రకు ఇవ్వకపోవడం, అది కూడా అన్నీ ఒకే స్థాయి పాత్రలైనప్పుడు ఒకరకమైన అసంతృప్తినిస్తుంది.
ఇకపోతే.. సన్నివేశాల రూపకల్పన మరియు కథనం విషయంలో మాత్రం మంచి పరిపక్వత చూపించింది. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్-వైభవ్ రెడ్డి కామెడీ ట్రాక్ బాగా వర్కవుటయ్యింది. మరీ ముఖ్యంగా.. ఈమధ్య వెబ్ సిరీస్ లు అనగానే పచ్చి బూతులు అనవసరంగా ఇరికించేస్తున్నారు. కానీ.. ఈ సిరీస్ లో బూతులు ఉన్నప్పటికీ సందర్భానుసారంగా వచ్చేవే, అవి కూడా మరీ అభ్యంతరకరంగా ఉండవు. అలాగే.. రాజేంద్రప్రసాద్ & నయన్ సారిక పాత్రలతో పండించిన సెంటిమెంట్ సీన్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా దర్శకురాలిగా, కథకురాలిగా మానస శర్మ మంచి మార్కులు సంపాదించుకుంది. సినిమాటోగ్రఫీ వర్క్, నేపథ్య సంగీతం, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ సిరీస్ కు అవసరమైన రీతిలో ఉన్నాయి.
విశ్లేషణ: స్నేహితులతో కలిసి వీకెండ్ లో చూడదగ్గ మంచి వెబ్ సిరీస్ ఈ “బెంచ్ లైఫ్”. సిరీస్ లోని చాలా అంశాలు, సన్నివేశాలు మనకి రియల్ లైఫ్ లోనూ కనెక్ట్ అవుతాయి. హిలేరియస్ హ్యూమర్ & ఎమోషన్ సీన్స్ పుష్కలంగా ఉన్న ఈ సిరీస్ తెలుగులో వచ్చిన ఒన్నాఫ్ ది డీసెంట్ వెబ్ సిరీస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫోకస్ పాయింట్: వీకెండ్ బింగ్ వాచ్ కి పర్ఫెక్ట్ ఈ “బెంచ్ లైఫ్”!
రేటింగ్: 2.5/5