దర్శకరత్న కిరీటంలో ఆణిముత్యాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి నారాయణరావుకి ప్రత్యేక స్థానం ఉంది. స్టార్స్ తోనే కాకుండా నూతన నటీనటులతోను సూపర్ హిట్ చిత్రాలు తీసి.. సినిమాకి అసలైన హీరో డైరక్టర్ అని నిరూపించారు. వినూత్న కథలతో ఎన్నో అపురూప సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. వాటిలో అందరూ మెచ్చిన 15 చిత్రాలపై ఫోకస్…

తాత – మనవడు దర్శకుడిగా దాసరి తొలి చిత్రం తాత – మనవడు. తొలి చిత్రంతోనే మధ్యతరగతి జీవితాల్ని బాగా తెరకెక్కించారు. హాస్యనటుడు రాజబాబును హీరోగా చేసిన ఈ మూవీ 25 వారాలు ఆడింది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా తాత – మనవడు ‘నంది’ అవార్డు సొంతం చేసుకుంది.

బలిపీఠంప్రముఖ నవల రచయిత్రి రంగ నాయకమ్మ రాసిన ‘బలిపీఠం’ నవల ఆధారంగా అదే పేరుతో సినిమా తీశారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది.

స్వర్గం – నరకం మోహన్‌బాబు, అన్నపూర్ణలను వెండి తెరకు స్వర్గం – నరకం సినిమా ద్వారా దాసరి పరిచయం చేశారు. మనస్పర్థలు, అపోహలు భార్యాభర్తల జీవితాన్ని నరకకూపంలో ఎలా పడేస్తాయో వివరించిన చిత్రమిది. 1975లో తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డుని సొంతం చేసుకొంది.

తూర్పు – పడమర తమిళంలో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రానికి రీమేక్‌ తూర్పు – పడమర. చాలా క్లిష్టమైన ఈ కథని, సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా దాసరి ఆవిష్కరించారు. మాధవికి ఇదే తొలి తెలుగు చిత్రం.

కటకటాల రుద్రయ్య కృష్ణంరాజుకి రెబల్‌స్టార్‌ ఇమేజ్‌ తీసుకొచ్చిన సినిమా కటకటాల రుద్రయ్య. ఇందులో కృష్ణంరాజును దాసరి కొత్తగా చూపించారు. 25 లక్షలతో తెరకెక్కించిన ఈ చిత్రం.. 75 లక్షలు వసూలు చేసింది. దీనిని తమిళంలో శివాజీ గణేశన్ రీమేక్ చేశారు.

శివరంజని సినిమా రంగంపై దాసరి తీసిన సినిమా శివరంజని. ఈ చిత్రంతో జయసుధ పెద్ద స్టార్ అయిపోయారు. దాసరి తన సొంత సంస్థ తారక ప్రభు ఫిలింస్‌ పతాకం మీద నిర్మించిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. శివరంజని బెంగుళూరులో ఏకంగా 52 వారాల పాటు ఆడింది. ఈ రికార్డ్ ని ఏ తెలుగు చిత్రం బీట్ చేయలేదు.

గోరింటాకు దాసరి తొలిసారి ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న సినిమా ‘గోరింటాకు’. శోభన్‌బాబు, సుజాత, సావిత్రి నటించిన ఈ చిత్రంలో ‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా’ అనే కృష్ణశాస్త్రి గీతం, ‘కొమ్మకొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి’ అనే వేటూరి గీతం ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.

సర్దార్‌ పాపారాయుడు ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశానికి పునాది వేసిన చిత్రం ‘సర్దార్‌ పాపారాయుడు’. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు. కేవలం 28 రోజుల్లో చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి ఎక్కువమంది అభిమానులు ఏర్పడ్డారు.

శ్రీవారి ముచ్చట్లు ఈ సినిమాతో దాసరి ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసారు. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద కలిసి నటించిన ఈ చిత్రంలో ట్విస్ట్ లు భలే ఉంటాయి.

ప్రేమాభిషేకం దాసరి రచించిన ప్రేమకావ్యం… ప్రేమాభిషేకం. ఏఎన్నార్, శ్రీదేవి, జయసుధల నటన అమోఘం. చక్రవర్తి ఇచ్చిన పాటలన్నీ సూపర్ హిట్. ఈ మూవీ 30 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.

మేఘసందేశం అక్కినేని నాగేశ్వరరావు 200వ చిత్రమిది. సహజీవనం అనే కాన్సెప్టుతో సాగిన ఈ కథ… అప్పట్లో ఓ సంచలనం. అక్కినేని, జయసుధ, జయప్రదల మధ్య సాగే సన్నివేశాలు మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. తొమ్మిది విభాగాల్లో నందుల్ని సొంతం చేసుకుంది.

స్వయం వరం దాసరి మెగా ఫోన్ నుంచి వచ్చిన మరో ప్రేమ కథా చిత్రం స్వయం వరం. శోభన్ బాబు, జయప్రదలు అద్భుతంగా నటించి వెండి తెర ప్రేమ జంటగా కీర్తి పొందారు.

తాండ్ర పాపారాయుడు దాసరి తెరకెక్కించిన తొలి చారిత్రక చిత్రమిది. 1775 సంవత్సరం ప్రాంతంలో జరిగిన కథ ఇది. అప్పట్లోనే దాదాపుగా 1.5 కోట్లతో తెరకెక్కించారు. కృష్ణంరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది.

ఒసేయ్‌ రాములమ్మా దాసరి తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ‘ఒసేయ్‌ రాములమ్మా’ ఒకటి. . ఉత్తరప్రదేశ్‌లో ఓ గిరిజన మహిళపై జరిగిన అన్యాయాన్ని కథగా మలిచి కమర్షియల్ హిట్ కొట్టారు. రాములమ్మగా విజయశాంతి తొలిసారి డబ్బింగ్‌ చెప్పుకొన్నారు. కృష్ణ, దాసరి కీలక పాత్రల్లో మెరిశారు.

బొబ్బిలిపులి ఎన్టీఆర్‌ – దాసరి కాంబినేషన్‌లో సంచలన విజయం సాధించిన చిత్రమిది. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికుడు, తన దేశం కోసమే సరిహద్దు లోపల కూడా పోరాడితే ఎలా ఉంటుందన్న అద్భుతమైన ఆలోచనకు తెర రూపం ఈ చిత్రం. పతాక సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ పలికే డైలాగులు హైలైట్‌.

ఇలా చెప్పుకుంటూ పోతే దాసరి ఆణిముత్యాలు మందను దాటేస్తాయి. అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాం.. అంతేకానీ మిగతా సినిమాలు తక్కువని కాదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus