2023 Rewind: ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

2023 నేటితో ముగియనుంది. ఈ ఏడాది కొత్తగా రిలీజైన సినిమాలకంటే.. రీరిలీజులనే జనాలు ఎక్కువగా ఎంజాయ్ చేశారు. చాలా చిన్న సినిమాల కంటే.. ఆ రీరిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లే బెటర్ గా ఉన్నాయి. అయితే.. ఈ ఏడాది కలెక్షన్స్, రివ్యూలతో సంబంధం లేకుండా.. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న కొన్ని సినిమాలేమిటో చూద్దాం..!!

1. బలగం

అసలు ఇదొక సినిమా ఉందని విడుదలయ్యేవరకూ ఎవరికీ తెలియదు. దిల్ రాజు బ్యానర్ లో ఆయన కుమార్తె నిర్మించిన ఈ చిత్రం ద్వారా జబర్దస్త్ వేణు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియదర్శి-కావ్య జంటగా రూపొందిన ఈ చిత్రం కాన్సెప్ట్ & మ్యూజిక్ జనాల్లోకి ఏ స్థాయిలో చొచ్చుకుపోయాయంటే.. ఈ సినిమా చూసి కలిసిపోయిన కుటుంబాలు, మనుషులు కూడా ఉన్నారు. కాసుల పంట మాత్రమే కాదు.. అవార్డుల వెల్లువ కూడా ఈ సినిమా సొంతం చేసుకొంది. బంధాలు, బంధుత్వాల విలువ తెలియజెప్పే ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం మెయిన్ ఎస్సెట్.

OTT: Amazon Prime

2. సలార్

బాహుబలి” తర్వాత ప్రభాస్ మంచి హిట్ కొట్టి దాదాపు ఆరేళ్ళవుతోంది. ఆ లోటు తీర్చిన చిత్రం “సలార్”. ప్రభాస్ కటౌట్ ను కరెక్ట్ గా వాడుకొని, ఆయన అభిమానులను పూర్తిస్థాయిలో సంతుష్టులను చేసిన చిత్రమిది. కలెక్షన్స్ ఆల్రెడీ 500 కోట్లు దాటేసి.. ప్రభాస్ కెరీర్ లో కలికితురాయిలా నిలిచే దిశగా పయనిస్తోంది. ప్రశాంత్ నీల్ మొదటి చిత్రమైన “ఉగ్రమ్”కు రీమేక్ లాంటి ఈ సినిమా స్టాండర్డ్స్ విషయంలో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసిందనే చెప్పాలి. పార్ట్ 2 ఎప్పుడొస్తుందా అని యావత్ సినిమా ప్రేక్షకులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

OTT: Netflix

3. వాల్తేరు వీరయ్య

చిరంజీవి స్టామినాను తెలుగు ప్రేక్షకుల్ని, బాక్సాఫీస్ కి మరోసారి పరిచయం చేసిన చిత్రమిది. రొటీన్ మాస్ సినిమా అయినప్పటికీ.. చిరంజీవి ఎంట్రీ సీన్ & ఇంటర్వెల్ బ్లాక్ కి భీభత్సమైన రిపీట్ వేల్యూ ఉన్న సినిమా ఇది. ముఖ్యంగా చిరంజీవి-రవితేజ కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ & కామెడీ సీన్స్ బాగా వర్కవుటయ్యాయి.

OTT: Netflix

4. సార్

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై చిన్నపాటి సంచలనం సృష్టించిన సినిమా ఇది. ధనుష్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విద్య విలువ తెలియజెప్పిన సన్నివేశాలు, ధనుష్ కి సెకండాఫ్ లో ఇచ్చే ఎలివేషన్స్ అద్భుతంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మారాజయ్యా పాట & విజువల్స్ గూస్ బంప్స్ ఇస్తాయి.

OTT: Netflix

5. దసరా

అప్పటివరకూ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ లో ఆకట్టుకుంటూ వచ్చిన నానీని ఊరమాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా ఎలివేట్ చేసిన చిత్రం “దసరా”. స్నేహం, కామం, పగ అనే మూడు ఎమోషన్స్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ను విశేషంగా అలరించి.. నానిలోని సరికొత్త కోణంతోపాటు.. శ్రీకాంత్ ఓదెల అనే టాలెంటెడ్ డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

OTT: Netflix

6. భగవంత్ కేసరి

సెకండ్ ఇన్నింగ్స్ లో తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ వస్తున్న బాలయ్య నటించిన తాజా చిత్రం “భగవంత్ కేసరి”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య శ్రీలీలకు తండ్రి సమానుడైన పాత్ర పోషించడమే కాక.. చాలా విషయంలో ఆడవాళ్ళను ఎలివేట్ చేస్తూ చెప్పే డైలాగులు బాగుంటాయి. స్కూల్లో చిన్నపిల్లలకు వారి తల్లులకు “గుడ్ టచ్, బ్యాడ్ టచ్” గురించి వివరించే సన్నివేశాన్ని కంపోజ్ చేసిన విధానం సినిమాకు హైలైట్ గా నిలిచింది.

OTT: Amazon Prime

7. విరూపాక్ష

ఈ ఏడాది తెలుగులో వచ్చిన బెస్ట్ హారర్ సినిమా “విరూపాక్ష”. కార్తీక్ వర్మ దర్శకత్వం, సుకుమార్ స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్స్. శాసనాల గ్రంధం అయితే.. మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చింది. ఇక బాక్సాఫీస్ పరంగా సాయిధరమ్ తేజ్ కు భారీ విజయాన్ని కట్టబెట్టి.. అతడికి మంచి కమ్ బ్యాక్ సినిమాగా నిలిచింది. అనీష్ లోక్నాధ్ సంగీతం సినిమాకి పెద్ద ఎసెట్.

OTT: Netflix

8. బేబీ

ఒక ఆల్బమ్ తో సినిమాకి క్రేజ్ ఏర్పడి హిట్ అవ్వడం అనేది తెలుగులో చాలాకాలం తర్వాత “బేబీ” విషయంలోనే జరిగింది. ఈ సినిమా కాన్సెప్ట్ & కంక్లూజన్ విషయంలో కొన్ని చర్చలు జరిగినా.. సాయిరాజేష్ ఒక దర్శకుడిగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని సుత్తిలేకుండా, సూటిగా, సెన్సిబిల్ గా చెప్పాడు. కొందరు హీరోయిన్ క్యారెక్టర్ ను థియేటర్లో బూతులు తిట్టడం ఒక్కటే ఈ సినిమా విషయంలో జరిగిన తప్పు తప్పితే.. కంటెంట్ పరంగా యూత్ ను విశేషంగా అలరించి, కమర్షియల్ గానూ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా “బేబీ”.

OTT: Aha

9. రంగమార్తాండ

దాదాపుగా నాలుగైదేళ్లు మేకింగ్ లో ఉండడమే కాక.. రెండేళ్ల పాటు ఎడిటింగ్ టేబుల్ & ల్యాబులో ఇరుక్కుపోయిన ఈ చిత్రం ఎట్టకేలకు మైత్రీ మూవీ మేకర్స్ పుణ్యమా అని రిలీజ్ అయ్యింది. టేకింగ్ పరంగా చాలా సమస్యలున్నప్పటికీ.. మూల కథ & ప్రకాష్ రాజ్-బ్రహ్మానందంల అద్భుతమైన నటన చూసి చెమర్చని కళ్ళు లేవు అంటే అతిశయోక్తి కాదు.

OTT: Amazon Prime

10. పరేషాన్

ఈ ఏడాది తెలంగాణ సినిమా అని చెప్పుకొని చాలా చిత్రాలు విడుదలైనప్పటికీ.. ఆడియన్స్ ను కాస్త గట్టిగా అలరించిన సినిమా మాత్రం “పరేషాన్”. తెలంగాణ అంటే తాగుడు, తిట్టుకొనుడు మాత్రమేనా అనే వాదాలు ఈ సినిమా విషయంలో తలెత్తినప్పటికీ.. సినిమాలోని కామెడీని మాత్రం అందరూ బాగా ఎంజాయ్ చేశారు.

OTT: సోనీ లైవ్

11. సామజవరగమన

అసలు ఈ సినిమా ట్రైలర్ చూసి జనాలు థియేటర్ కి వెళ్తారా అనిపించిన సినిమాల్లో “సామజవరగమన” ఒకటి. కనీస స్థాయి ప్రమోషన్స్ లేకుండా కేవలం కంటెంట్ తో హిట్ కొట్టిన సినిమా ఇది. శ్రీవిష్ణునరేష్ ల కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ & “పి.వి.ఆర్” డైలాగ్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యకరమైన హాస్యంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.

OTT: Aha

12. బెదురులంక 2012

టీజర్ విడుదలైనప్పట్నుంచి ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. పాటలు మైనస్ అవ్వడం వల్ల జనాల్లోకి ఈ చిత్రం ఎక్కువగా వెళ్లలేకపోయింది కానీ.. సినిమాను థియేటర్లో చూసినవాళ్ళు మాత్రం భీభత్సంగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా సెకండాఫ్ & క్లైమాక్స్ సీక్వెన్స్ ఈవీవీ సినిమాల స్థాయిలో నవ్వించింది.

OTT: Amazon Prime

13. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చిన క్లీన్ సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. వీర్యదాన నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టిఅనుష్క శెట్టిల కాంబినేషన్ లో కెమిస్ట్రీ బాగా వర్కవుటయ్యాయి. నవీన్ పోలిశెట్టి టైమింగ్ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ గా నిలిచింది.

OTT: Netflix

14. మ్యాడ్

సినిమా విడుదలయ్యేవరకూ ప్రొడ్యూసర్ వంశీకి తప్ప ఎవరికీ ఈ సినిమా మీద కనీస స్థాయి అంచనాలు లేవు. అయితే.. ప్రీమియర్ షోలు పడ్డాక సీన్ మొత్తం మారిపోయింది. సినిమాలో కామెడీ & కంటెంట్ ను యూత్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. దాంతో సెన్సేషనల్ సినిమాగా నిలిచిపోయింది “మ్యాడ్”. దాదాపు సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాం. మంచి రిపీట్ వేల్యూ ఉన్న సినిమా ఇది.

OTT: Netflix

15. మా ఊరి పొలిమేర 2

హాట్ స్టార్ లో సైలెంట్ గా విడుదలైన పార్ట్ 1 ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకోవడంతో సీక్వెల్ పై మంచి అంచనాలు నమోదయ్యాయి. ఆ అంచనాలను పూర్తిస్థాయిలో కాకపోయినా కాస్త బెటర్ గానే హ్యాండిల్ చేసింది సీక్వెల్. ఫస్టాఫ్ కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ.. సెకండాఫ్ లో వచ్చే వరుస ట్విస్టులు మాత్రం అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

OTT: Aha

16. మంగళవారం

అజయ్ భూపతిపాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో “ఆర్ ఎక్స్ 100” తర్వాత తెరకెక్కిన చిత్రం “మంగళవారం”. “ది డెయిరీ ఆఫ్ ఏ నింఫోమేనియాక్” అనే హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ తో తెరకెక్కిన ఈ చిత్రం కూడా సెకండాఫ్ & క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులతో ఎక్కువగా ఆకట్టుకుంది. అజ్నీష్ లోక్నాధ్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్.

OTT: Disney+Hotstar

17. పిండం

ఈ ఏడాది చివర్లో సైలెంట్ గా వచ్చి డీసెంట్ హిట్ గా నిలిచిన చిత్రం (Pindam) “పిండం”. హాలీవుడ్ హారర్ సినిమాలకు పెద్ద ముత్తైదువు లాంటి “కాంజూరింగ్” సిరీస్ ఇన్స్పిరేషన్ గా రూపొందిన ఈ చిత్రం మూల కథ & క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి.

OTT: Netflix

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus