భాగమతి

  • January 26, 2018 / 08:06 AM IST

“అరుంధతి, రుద్రమదేవి” చిత్రాలతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనుష్క నటించిన తాజా చిత్రం “భాగమతి”. “పిల్ల జమీందార్” ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇప్పటివరకూ విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ అన్నీ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా ఈవారం సోలో రిలీజ్ ఛాన్స్ కూడా దక్కించుకొన్న “భాగమతి” ఆడియన్స్ ను ఏమేరకు అలరించింది అనే విషయం సమీక్షలోకి వెళ్ళి తెలుసుకొందాం..!!

కథ : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఈశ్వర్ రెడ్డి (జయరాం) సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి సన్నద్ధమవుతున్నాడని తెలుసుకొన్న కేంద్ర ప్రభుత్వం అతడి మీద పైరవీ చేసి అతడ్ని లంచగొండిగా ప్రపంచానికి పరిచయం చేసి అతడి రాజకీయ భవిష్యత్ ను దెబ్బతీయాలనుకుంటుంది. అయితే.. జనాల్లో జాతిపిత స్థాయి ఇమేజ్ ఉన్న ఈశ్వర్ రెడ్డిని రాజకీయ పునాదులు కదపాలంటే అతడి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే నిశ్చయంతో అతడి దగ్గర పదేళ్లపాటు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేసిన ఐ.ఏ.ఎస్ అధికారిణి చంచల (అనుష్క)ను కార్నర్ చేయడం బెటరని భావిస్తుంది సి.బి.ఐ ఆఫీసర్ పద్మావతి నటరాజన్ (ఆశా శరత్). అయితే.. అప్పటికే ఒక హత్య కేసు కారణంగా జైల్లో ఉన్న చంచలను అక్కడే ఇంటరాగేట్ చేయడం కుదరదని భావించి ఊరవతల ఉన్న భాగమతి బంగ్లాకు షిఫ్ట్ చేస్తారు.

కట్ చేస్తే.. ఆ బంగ్లాలోకి మార్చబడిన తర్వాత చంచల ఉదయం సి.బి.ఐ వారు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూనే.. రాత్రి మాత్రం ఎవరో తనని కొడుతున్నారంటూ గోల చేయడం తానే “భాగమతి” అంటూ అరవడం లాంటివి చేస్తుంటుంది. ఆమె ఎందుకలా చేస్తుందో అర్ధం కానీ సి.బి.ఐ కన్ఫ్యూజన్ లో ఆమెను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తుంది. అయితే.. చంచల కావాలనే భాగమతిలా నటించిందనే విషయం అర్ధం చేసుకొన్న పద్మావతి మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయగా కొన్ని నమ్మలేని నిజాలు బయటపడతాయి. ఏమిటా నిజాలు? ఇంతకీ “భాగమతి” కథ ఏమిటి? మంత్రి ఈశ్వర్ రెడ్డి నిజంగా అవినీతిపరుడేనా? వంటి ప్రశ్నలకు సమాధానమే “భాగమతి”.

నటీనటుల పనితీరు : “భాగమతి”గా అనుష్క నటనను మరీ విశ్వరూపమని పేర్కొనలేమ్ గానీ ఆకట్టుకోగలిగింది. అయితే.. షూటింగ్ లో కంటిన్యూటీ లేకపోవడం వల్లనో ఏమో కానీ ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కోలా కనిపిస్తుంది అనుష్క. పర్సనాలిటీ మాత్రమే కాక ముఖారవిందంలో కూడా భారీ మార్పులు కనిపిస్తుంటాయి. అయితే.. “భాగమతి”గా మాత్రం ఇంటర్వెల్ బ్లాక్ లో అదరగొట్టింది అనుష్క. ఉన్ని ముకుందన్ కేవలం నాలుగైదు సీన్లు, ఒక పాటకు మాత్రమే పరిమితమయ్యాడు. స్క్రీన్ ప్రెజన్స్ పరంగానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. మలయాళ నటుడు జయరాం రెండు డిఫరెంట్ షేడ్స్ ను అత్యద్భుతంగా పోషించాడు. సినిమాలో అనుష్క తర్వాత నటనతో మెప్పించింది జయరాం. మరో ముఖ్యమైన పాత్రల్లో మురళీ శర్మ, ఆశా శరత్, కానిస్టేబుల్స్ గా ధనరాజ్, ప్రభాస్ శ్రీను కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు.

సాంకేతికవర్గం పనితీరు : తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఉన్న ఒక్కపాట వినడానికి పెద్దగా లేకపోయినప్పటికీ.. నేపధ్య సంగీతంతో మాత్రం విశేషంగా ఆకట్టుకొన్నాడు. కాకపోతే సినిమా మొత్తం ఒకటే థీమ్ మ్యూజిక్ వాడడంతో రిపీటెడ్ గా అనిపిస్తుంది. మధి సినిమాటోగ్రఫీతో సినిమాలో ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో లీనం చేశాడు. సినిమాలో అధికభాగం ఒకే బిల్డింగ్ లో షూట్ చేసినప్పటికీ ప్రేక్షకుడికి ఆ ఫీల్ కలగకుండా డిఫరెంట్ కెమెరా యాంగిల్స్, ఫ్రేమ్స్ తో తన పనితనాన్ని ప్రూవ్ చేసుకొన్నాడు.

ఆ తర్వాత ఆడియన్స్ ను అమితంగా అలరించింది ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి. సెట్ వర్క్, ఆర్ట్ వర్క్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆడియన్స్ కు ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాడు. యువీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ ను మెచ్చుకోవాలి. కథకి అవసరమైన స్థాయిలో ఎక్కడా తగ్గకుండా భారీ స్థాయిలో ఖర్చు చేశారు. కోటగిరి వెంకటేశ్వర్రావు ఎడిటింగ్ వర్క్ కూడా సినిమాలో కీలకపాత్ర పోషించింది. దర్శకుడు చెప్పాలనుకొన్న విషయాన్ని ఆడియన్స్ ను ఆసక్తికరంగా ఆకట్టుకొనే విధంగా అర్ధవంతంగా చెప్పడంలో ఆయన కృషి కీలకం.

“పిల్ల జమిందార్” మినహా “సుకుమారుడు, చిత్రాంగధ” చిత్రాలతో దర్శకుడిగా కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేని అశోక్ “భాగమతి” చిత్రానికి దర్శకుడు అంటే ఎవ్వరూ నమ్మలేరు. ముఖ్యంగా ఒక సాధారణ రివెంజ్ డ్రామాకి ఆయన రాసుకొన్న స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కథనం తమిళ చిత్రం “పిజ్జా”, టేకింగ్ “చంద్రముఖి” చిత్రాలను గుర్తుకు తెచ్చినప్పటికీ ఆడియన్స్ కు మాత్రం ఒక టెర్రిఫిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను కలిగిస్తుంది. అయితే.. సినిమా మొత్తం దర్శకుడి ప్రతిభ కంటే కెమెరామెన్ మధి సినిమాటోగ్రఫీ వర్క్, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ సెట్ వర్క్, తమన్ బీజీయమ్ ఎక్కువగా ఆకట్టుకొంటాయి. అందువల్ల సినిమా సక్సెస్ క్రెడిట్ ను అశోక్ కు మాత్రమే ఇవ్వలేమ్. ఇది టీం వర్క్. అయితే.. స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా రాసుకొన్న అశోక్ చాలా లూప్ హోల్స్ ను వదిలేశాడు. అయితే.. సినిమా చూశాక మాగ్జిమమ్ ఆడియన్స్ వాటిని పట్టించుకోరు కాబట్టి “భాగమతి”తో డైరెక్టర్ గా అశోక్ డిస్టింక్షన్ లో పాసయ్యాడు.

విశ్లేషణ : అత్యద్భుతంగా ఉందని చెప్పలేం కానీ.. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ నిరాశపరచడం ఆతర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు కూడా ఎంటర్ టైన్ చేయలేకపోవడంతో కొత్త ఏడాది మంచి సినిమా చూడలేకపోయామని బాధపడిన ప్రేక్షకులందరికీ సాంత్వన చేకూర్చే చిత్రం “భాగమతి”. ఆసక్తికరమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అశోక్ రాసుకొన్న స్క్రీన్ ప్లే, అనుష్క నటన, జయరాం క్యారెక్టరైజేషన్, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, మధి సినిమాటోగ్రఫీ, రవీందర్ రెడ్డి ఆర్ట్ వర్క్ కలగలిసి “భాగమతి” చిత్రాన్ని బాక్సాఫీస్ హిట్ గా నిలిపాయి. వచ్చేవారం సినిమాల రిజల్ట్ బట్టి సినిమా భారీ హిట్టా లేక కమర్షియల్ సక్సెస్సా అనే విషయం తెలుస్తుంది. మొత్తానికి జనవరి విన్నర్ మాత్రం “భాగమతి” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus