ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) జీవితంలో ఏమంత నల్లేరుపై నడక కాదు. ఇండస్ట్రీలో ఆయన ఎన్నో ఏళ్ల క్రితం వచ్చారు. సంగీత దర్శకుడిగా ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్నా గతంలో గీత రచయితగా కూడా పని చేశారు. కొన్నేళ్లపాటు అవకాశాలు లేక ఇబ్బందిపడ్డారు. ఒకానొక సమయంలో తనువుచాలించాలని కూడా చూశారు. ఈ విషయాల్ని ఆయన ‘మాస్ జాతర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చెప్పుకొచ్చారు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఒకప్పుడు అవకాశాలు లేక కుటుంబంతో సహా చనిపోదాం అనుకున్నప్పుడు దేవుడిలా రవితేజ కాపాడారని చెప్పుకొచ్చారు భీమ్స్. ఆయన లేకపోతే తాను లేనని కూడా చెప్పారు. ఇంతకీ ఏమైందంటే? నేను ఏ విషయాన్నైనా పాట రూపంలోనే చెబుతుంటాను. అలా ఒకసారి నా పరిస్థితి చెబుతూ ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను. అందులో నా భార్య పిల్లలు కూడా కనిపించారు. ఇంటికి అద్దె ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, ఎలా బతకాలి అని ఆలోచిస్తూ ఆ వీడియో తీశాను అని భీమ్స్ చెప్పారు.
ఆ ఆలోచనల్లో ఉంటూ వీడియో తీస్తున్నప్పుడు ఆఖరి క్షణంలో నాకో ఫోన్ వచ్చింది. పీపుల్స్ మీడియా ఆఫీసుకు రండి అనేది ఆ కాల్ సారాంశం. ఆ కాల్ నా జీవితాన్నే మార్చేసింది. ఎందుకంటే ఆ ఫోన్ రావడానికి ఒక్క క్షణం ముందు ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి. నాకు జీవితం లేదు. అందరం కలిసి పైకి వెళ్లిపోదాం అని అనుకుంటున్నా. ఆ క్షణంలో దేవుడి రూపంలో రవితేజ (Ravi Teja) నిలిచారు.
నేనీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే, రోజూ అన్నం తింటున్నానంటే ఆయనే కారణం అని ఎమోషనల్ అయ్యారు భీమ్స్. ఇక 2012లో ‘నువ్వా నేనా’తో సినిమా పరిశ్రమకు వచ్చిన భీమ్స్ (Bheems Ceciroleo) ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఏకంగా ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సినిమా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారంటే ఏ స్థాయిలో ఎదిగారో అర్థం చేసుకోవచ్చు.