‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 21, 2020 / 01:28 PM IST

“లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం” లాంటి డిజాస్టర్స్ అనంతరం నితిన్ నటించిన తాజా చిత్రం “భీష్మ”. “ఛలో” చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించింది. టీజర్, ట్రైలర్ & పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న “భీష్మ”.. సినిమాగా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: సేంద్రీయ ఎరువులు, సక్రమమైన విధానాలతో పంటలు పండించి.. ఆర్గానిక్ ఫార్మింగ్ లో నేటితరం రైతులకు మాత్రమే కాక భవిష్యత్ తరాల యువతకు కూడా పాలుపంచుకొనేలా చేయడమే ధ్యేయంగా బ్రతుకుతున్న భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ సీ.ఈ.ఓ (అనంత్ నాగ్). తన తదనంతరం కంపెనీని ఎవరు ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయనకు తారసపడతాడు భీష్మ ప్రసాద్ (నితిన్). తన తోటివాళ్లు అందరూ గర్ల్ ఫ్రెండ్స్ తో సంతోషంగా ఉంటే తనకు మాత్రం ఒక్కటంటే ఒక్క అమ్మాయి కూడా దొరకలేదని బాధపడుతూ ఫ్రస్ట్రేటడ్ సింగిల్ గా మిగిలిపోతాడు. ఈ క్రమంలో కనిపించిన చైత్ర (రష్మిక)తో లవ్ ట్రాక్ స్టార్ట్ చేద్దామనుకొనేలోపు.. కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా భీష్మ ప్రసాద్ “భీష్మ ఆర్గానిక్” కంపెనీకి సీ.ఈ.ఓగా మారడం, 30 రోజుల్లో అతడి పనితనాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అతనిపై పడడం జరిగిపోతాయి.

ఈ క్రమంలో భీష్మకు ఉన్న ముఖ్యమైన అడ్డంకి రాఘవన్ (జీషు సేన్ గుప్తా). అతడ్ని తన బుద్ధి బలంతో భీష్మ ఎలా ఎదుర్కొన్నాడు? తాను ప్రేమించిన చైత్రను ఎలా ఒప్పించి, ఆమెను సొంతం చేసుకున్నాడు? అనేది “భీష్మ” కథాంశం.

నటీనటుల పనితీరు: నితిన్ పోషించిన పాత్ర కొత్తగా లేకపోయినా.. ఆ పాత్రలో నితిన్ నటన కొత్తగా ఉంది. గర్ల్ ఫ్రెండ్ కోసం నితిన్ పడే బాధలు, ఒక్క అమ్మాయి మాట్లాడినా చాలు అనుకుని పడే తిప్పలు హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయి. ప్రెజంట్ జనరేషన్ యూత్ కి విపరీతంగా నచ్చే పాత్ర భీష్మ ప్రసాద్. నితిన్ చెప్పే ప్రాసలతో కూడిన పంచ్ లు కాస్త చిరాకు పెట్టించినా కూడా అలరిస్తాయి. అలాగే.. నితిన్ పేరు మీద ఉన్న ట్విస్ట్ బాగుంది.

రష్మిక ఈ చిత్రంలో గ్లామర్ తోపాటు యాక్టింగ్, డ్యాన్స్ తో అలరించింది. కన్నడ నటులు అనంత్ నాగ్ ను చాన్నాళ్ల తర్వాత ఒక స్ట్రయిట్ సినిమాలో చూశాం. కాకపోతే ఆయన క్యారెక్టరైజేషన్ కు స్టార్టింగ్ లో ఉన్న వెయిట్ సినిమా చివరికి వచ్చేసరికి పోతుంది. పోలీస్ ఆఫీసర్ గా సంపత్ రాజ్, టీవీ రిపోర్టర్ గా బ్రహ్మాజీ, ఫ్రెండ్ రోల్లో వెన్నెల కిషోర్.. ఇక సహాయ పాత్రల్లో రఘుబాబు, నరేష్, రాజీవ్ కనకాల, సత్యలు ఆకట్టుకుంటారు.

“అశ్వద్ధామ” చిత్రంలో సైకోగా ఆకట్టుకున్న బెంగాలీ నటుడు జీషు సేన్ గుప్తా.. ఈ చిత్రంలో రాఘవన్ అనే స్టైలిష్ విలన్ పాత్రలో ఆకట్టుకోవడానికి కాస్త గట్టిగానే ప్రయత్నించాడు కానీ.. ఎందుకో విలన్ రోల్ స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వదు.

సాంకేతికవర్గం పనితీరు: మణిశర్మ తనయుడు మహతీ స్వరసాగర్ పాటలు & బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. మెలోడీ, మాస్ నెంబర్, డ్యూయట్ ఇలా అన్నీ పాటలు రిపీట్ మోడ్ లో వినేలా, చూసేలా ఉన్నాయి. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి.

ఒక సాధారణ కథను.. ఎంటర్ టైనింగ్ గా చెప్పడమే దర్శకుడు వెంకీ కుడుముల ప్రత్యేకత. ఈ లక్షణం గురువు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర పుణికిపుచ్చుకున్నాడు. అయితే.. సింగిల్ లైన్ పంచ్ లు మాత్రం మరీ లేకిగా ఉన్నాయి. “అక్కకు లేక అటుకులు తింటుంటే.. చెల్లి వచ్చి చికెన్ బిర్యానీ కావాలి అందట” లాంటి బీలెవెల్ పంచ్ & డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి. ప్రేక్షకులకు ఫన్ పంచడం వేరు.. ఆ ఫన్ ను అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా జాగ్రత్తలు తీసుకోవడం వేరు. త్రివిక్రమ్ దగ్గర అన్నీ నేర్చుకున్న వెంకీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఒంటబట్టించుకోలేకపోయాడు. “ఛలో, భీష్మ” ఈ రెండు సినిమాల్లోని కామెడీ & పంచ్ డైలాగులు ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఎంజాయ్ చేయగలిగేలా ఉన్నాయి. ఇక “ఛలో” క్లైమాక్స్ ను జీర్ణించుకోవడానికే జనాలకు చాలా టైమ్ పట్టింది.. ఇప్పటికీ జనాలు “అదేం క్లైమాక్స్ రా?” అనుకుంటారు. “భీష్మ”లోని ఇంటర్వెల్ ట్విస్ట్ & క్లైమాక్స్ కూడా ఇంచుమించుగా అదేలా ఉంటాయి. వెంకీ తన మూడో సినిమా కోసమైనా.. సరైన ఎండింగ్ & ట్విస్ట్ రాసుకొంటే బెటర్.

అయితే.. ప్రేక్షకుల్ని ఒక గంటన్నర సేపు కడుపుబ్బ నవ్వించడంలో మాత్రం వెంకీ సక్సెస్ అయ్యాడు. ఒక సగటు ప్రేక్షకుడు థియేటర్ కి వచ్చాక కోరుకునేది ఎంటర్ టైన్మెంట్ కాబట్టి.. అది “భీష్మ” పుష్కలంగా అందించాడు కాబట్టి.. ఒక కథకుడిగా, రచయితగా కంటే.. ఒక దర్శకుడిగా వెంకీ మరోసారి మంచి విజయం అందుకున్నాడనే చెప్పాలి.

విశ్లేషణ: లాజిక్కులు, స్క్రీన్ ప్లే మ్యాజిక్కుల గురించి పట్టించుకోకుండా.. హ్యాపీగా ఒక గంటసేపు నవ్వుకోవడానికి హ్యాపీగా ఒకసారి థియేటర్లో చూడదగిన సినిమా “భీష్మ”. ఇంతకు మించి విశ్లేషణ ఇవ్వడానికి కంటెంట్ కూడా ఏమీ లేదు.

రేటింగ్: 3/5

Click Here To Read English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus