మాస్ హీరో గోపీచంద్ (Gopichand) కన్నడ డైరెక్టర్ (Harsha) హర్ష దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం (Bhimaa) “భీమా”. “గౌతమ్ నంద” (Goutham Nanda) అనంతరం గోపీచంద్ ద్విపాత్రాభినయం పోషించిన చిత్రమిది. విడుదలైన ట్రైలర్ లో మాస్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. చాన్నాళ్లుగా సరైన కమర్షియల్ హిట్ లేని గోపీచంద్ కు “భీమా” ఏమేరకు ప్లస్ అయ్యిందో చూద్దాం..!!
కథ: ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ను ఓ స్మగ్లింగ్ గ్యాంగ్ దారుణంగా హతమార్చగా.. ఆ కేస్ ను డీల్ చేసేందుకు వచ్చిన రౌడీపోలీస్ ఆఫీసర్ భీమా (గోపీచంద్). భవానీ (ముఖేష్ తివారీ) & గ్యాంగ్ ను ఎదుర్కొని నిలబడి వారి అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడుతుంటాడు. ఈ క్రమంలో భవానీ చేస్తున్న ఓ ఘోరమైన విషయం భీమాకి తెలుస్తుంది. అసలు ఏమిటా ఘోరమైన విషయం? భీమా దాన్ని ఎలా తుదముట్టించాడు? ఈ క్రమంలో భీమా ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “భీమా” చిత్రం.
నటీనటుల పనితీరు: రెండు వైవిధ్యమైన పాత్రల్లో గోపీచంద్ మరోమారు తన సత్తా చాటుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్ తోపాటు ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన శైలి నటనతో అలరించాడు. (Malvika Sharma) మాళవిక శర్మ అందాల ఆరబోతతో సర్దుకుపోగా.. ప్రియభవానీ శంకర్ (Priya Bhavani Shankar) కాస్త పర్వాలేదనిపించుకుంది. (Vennela Kishore) వెన్నెలకిషోర్, (Raghu Babu) రఘుబాబు, (Naresh) నరేష్, (Sapthagiri) సప్తగిరీలు నవ్వించడానికి ప్రయత్నించారు. చాన్నాళ్ల తర్వాత (Nassar) నాజర్ కి మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ లభించింది. ఆయన మేకప్ సరిగా లేకపోయినా, నటుడిగా మాత్రం అదరగొట్టాడు.
సాంకేతికవర్గం పనితీరు: రవి భస్రూర్ (Ravi Basrur) పాటల కంటే నేపధ్య సంగీతం బాగుంది. స్వామి జె.గౌడ సినిమాటోగ్రఫీ & లైటింగ్ సినిమాకి మంచి మాస్ ఎలివేషన్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ను చిత్రీకరించిన తీరు బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. కన్నడ దర్శకుడు హర్ష మాస్ ఎలిమెంట్స్ వరకూ విశేషంగా ఆకట్టుకున్నాడు.
అయితే.. లవ్ ట్రాక్ & కామెడీ విషయంలో మాత్రం అలరించలేకపోయాడు. ముఖ్యంగా హీరోయిన్ తో టీచర్ కమ్ స్టూడెంట్ పాత్ర పోషింపజేసి, సరస్వతీదేవిలా చూపించాల్సిన పాత్రను రతీదేవిలా చిత్రించడం అనేది మింగుడుపడని విషయం. కేవలం మాస్ ఫైట్స్ మీదనే కాక కథనం మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది.
విశ్లేషణ: లాజిక్స్ తో సంబంధం లేని మాస్ ఎలివేషన్స్ & ఫైట్స్ ను ఎంజాయ్ చేసే కమర్షియల్ ఆడియన్స్ ను ఆకట్టుకొనే సినిమా “భీమా”. గోపీచంద్ ద్విపాత్రాభినయం, యాక్షన్ బ్లాక్స్ & క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.
ఫోకస్ పాయింట్: మాస్ ఆడియన్స్ మెచ్చే కమర్షియల్ “భీమా”
రేటింగ్: 2.25/5