భూమి సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 16, 2021 / 10:59 AM IST

జయం రవి-నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం “భూమి”. రైతుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కుదరకపోవడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులోనూ అనువదించిన విడుదల చేశారు. మరి ఎలా ఉందొ చూడాలిగా!

కథ: భూమినాథం (జయం రవి) నాసా సైంటిస్ట్. మార్స్ గ్రహం మీదకు వెళ్లి అక్కడ జనాలు నివసించడానికి అనుగుణంగా పరిస్థితులను క్రియేట్ చేయడానికి మరో నెలలో మార్స్ కి పయనమవ్వాల్సి ఉండగా.. నెల రోజుల సెలవులను సొంత ఊర్లో గడపడానికి చెన్నై వస్తాడు. అక్కడ రైతులు పొలం పండించడానికి పడుతున్న కష్టాలు, ఆ పొలాలు పండకుండా ఒక వ్యక్తి చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించి ఎలా నిలబడ్డాడు అనేది “భూమి” కథాంశం.

నటీనటుల పనితీరు: జయంరవి ఇంటెన్సిటీ ఉన్న పాత్రకు సూట్ అయ్యాడు. నిధి అగర్వాల్ అందాలను కాకుండా నటనను ప్రదర్శించింది. తంబి రామయ్య రైతు కష్టాలను తెరపై అద్భుతంగా పండించారు. తల్లి పాత్రలో శరణ్య ఎప్పట్లానే ఒదిగిపోయింది. క్యారెక్టరైజేషన్ సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోయినా కూడా నటనతో పాత్రను రక్తి కట్టించిన నటుడు రోనిత్ రాయ్.

సాంకేతికవర్గం పనితీరు: సంగీతం, కెమెరా వర్క్, ఆర్ట్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్ ఇలా అందరూ తమ పరిధి మేరకు సినిమా కోసం మంచి హోమ్ వర్క్ చేశారు ఒక్క దర్శకుడు తప్ప. ఇండియాలో పంటలు పండకుండా ఉండడానికి కార్పొరేట్ సంస్థలు ఎలా కారణమవుతున్నాయి అనే విషయంలో చక్కగా గూగుల్ లో రీసెర్చ్ డైరెక్టర్.. ఒక కథకుడిగా ప్రేక్షకులకు అర్ధమయ్యేలా, కనెక్ట్ అయ్యేలా సినిమా ఎలా తీయాలి, సమస్యలకు సమాధానం ఏమిటి? అనే విషయన్ని గాలికొదిలేశాడు. అందువల్ల అతడు చెప్పే అంశంలో సీరియస్ నెస్ ఉన్నప్పటికీ.. దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అనేది మాత్రం అర్ధం కాదు. ఎప్పుడైనా సరే సినిమాలో ఒక సమస్య చూపించినప్పుడు, దానికి పరిష్కారం కూడా లాజికల్ గా చూపించాలి. అవేం లేకుండా జనాలు కూరగాయలు పండించేవాళ్ల దగ్గర కొనేస్తే చాలు రైతుల కష్టాలు తీరిపోతాయి అని చూపించడం అనేది హాస్యాస్పదం.

విశ్లేషణ: రైతు సమస్యను చూపించి, దానికి ఏదో ఒక పరిష్కారం చెప్పేసి ఆడియన్స్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేసి హిట్ కొట్టేద్దామనే అత్యాశతో తీసిన సినిమా “భూమి”. సమస్య సహజమైనది అయినప్పుడు, పరిష్కారం కూడా అంతే లాజికల్ గా ఉండాలి. అవేమీ లేకపోవడంతో “భూమి” ఒక ఫక్తు కమర్షియల్ సినిమాగా మిగిలిపోయింది.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus