బిగ్‌బాస్ కన్నడ 10 సీజన్ ఆసక్తికరంగా సాగుతున్నది. హోస్ట్ కిచ్చ సుదీప్ షోను తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ మరో లెవెల్‌కు తీసుకెళ్లున్నారు .అయితే ఇటీవల మొదలైన సీజన్ 10లో కంటెస్టెంట్ వార్తూర్ సంతోష్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అటవీశాఖ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఆయనకు అధికారులు షాకిచ్చారు. వార్తూర్ సంతోష్ అరెస్ట్ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ అరెస్ట్ వెనుక కారణాల్లోకి వెళితే..
ప్రస్తుతం వార్తూర్ సంతోష్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. అయితే ఆయన పులి గోరు మెడలో ధరించడాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. వెంటనే చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఆ హారాన్ని ధరించారని నిర్ధారించుకొన్నారు. అనంతరం వెంటనే సెట్స్‌లోకి వెళ్లి అయనను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో బిగ్‌బాస్ షోపై అందరి దృష్టిపడింది.
వార్తూర్ సంతోష్‌ను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. వెంటనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనను రామోహల్లీ ఫారెస్ట్ ఆఫీసర్స్ అదుపులోకి తీసుకొని వెంటనే కస్టడీకి తరలించారు అని మీడియా కథనాలు వచ్చాయి.వార్తూర్ సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అధికారులు, ఎండెమాల్ షైన్ నిర్వాహకులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయితే వార్తూర్ సంతోష్ మళ్లీ కేసు నుంచి బయటపడి బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే.
వార్తూర్ సంతోష్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన ఓ వ్యవసాయదారుడు. పశువుల సంరక్షణ సంబంధిత కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా జంతువుల సంరక్షణ విషయంలో తనదైన సేవలు చేస్తున్నాడు. ముఖ్యంగా కర్ణాటక హల్లికర్ ఆవుల సంరక్షణకు పాటుపడుతున్నారు. ఆయన హల్లికర్ జాతి ఆవుల సంరక్షణ కమిటీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
పశువులు, జంతువుల సంరక్షణకు పాటుపడుతున్న ఆయన పనితీరును గమనించిన బిగ్‌బాస్ నిర్వాహకులు అవకాశం కల్పించారు. బిగ్‌బాస్ కన్నడ 10 సీజన్‌లో కీలక కంటెస్టెంట్‌గా మారారు. పులిగోరు మెడలో ధరించి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. జంతువుల పరిరక్షణకు పాటుపడుతున్న ఆయనకు పులిగోరు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై అటవీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.