బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అమ్మాయిల్లో అతడి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కెరీర్ లో ఒక దశ వరకు చిన్న స్థాయి సినిమాలే చేసిన ఆయన.. కొంతకాలంగా పెద్ద సినిమాలు చేస్తున్నారు. గతేడాది ఆయన నటించిన ‘భూల్ భులాయియా2’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.200 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
బాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలు బోల్తా కొడుతున్న సమయంలో ఈ సినిమా రెండొందల కోట్లు రాబట్టడం కార్తిక్ ఆర్యన్ డిమాండ్ ని పెంచేసింది. దీంతో అతడి నెక్స్ట్ సినిమా ‘షెహజాదా’పై అంచనాలు పెరిగిపోయాయి. టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. మొదటి నుంచి ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి కనిపించలేదు. రిలీజ్ కు ముందు సినిమాపై ఎలాంటి బజ్ లేదు.
బాలీవుడ్ లో సౌత్ రీమేక్ లు వర్కవుట్ అవ్వడం లేదనేది నిజమే అయినప్పటికీ.. ‘దృశ్యం’ లాంటి సినిమాలు మ్యాజిక్ చేసినట్లు ఈ సినిమా కూడా మ్యాజిక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోలేదు. ‘భూల్ భులాయియా2’కి తొలి రోజు రూ.15 కోట్లు కలెక్షన్స్ వస్తే..
‘షెహజాదా’కి వీకెండ్ అయ్యేసరికి రూ.20 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. సోమవారం నుంచి ఈ సినిమాను అసలు పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. ఇక రాబోయే వసూళ్లు నామమాత్రమని అర్ధమవుతోంది. రూ.200 కోట్ల హీరో.. ఇలా రూ.20 కోట్లకు పడిపోవడం ట్రేడ్ పండితులకు షాకిస్తుంది.