‘నారీ నారీ నడుమ మురారి’ తో ఈ ఏడాది సంక్రాంతికి కంబ్యాక్ ఇచ్చిన శర్వానంద్ ఈ సమ్మర్ కి బైకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లూజర్ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ తెరకెక్కించిన అభిలాష్ రెడ్డి దర్శకుడు కావడం, సీనియర్ హీరో రాజశేఖర్ కూడా కీలక పాత్ర పోషించడంతో బైకర్ పై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో తెలుసుకుందాం రండి :
కథ: బుల్లెట్ సునీల్ అలియాస్ సునీల్ నారాయణ్ కి (రాజశేఖర్) తన కొడుకు విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ ను ( శర్వానంద్) ని ప్రపంచం మొత్తం మెచ్చుకునే మోటో క్రాస్ రేసర్ ఛాంపియన్ ను చేయాలనేది కోరిక. అందుకోసం విక్కీని చిన్నప్పటి నుండీ చాలా డిసిప్లిన్ తో పెంచుతాడు. అతను ఎన్ని బైక్ రేసులు గెలిచినా .. సునీల్ అభినందించడు. పైగా వంకలు పెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి అనన్య( మాళవిక నాయర్) పరిచయం ఏర్పడుతుంది. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. ఆమె గర్భవతి అవ్వడంతో తండ్రికి తెలీకుండా అనన్యని పెళ్లి చేసుకుంటాడు విక్కీ. మరోవైపు విక్కీని వరల్డ్ ఛాంపియన్ గా చేయడానికి ఓ పెద్ద మోటో క్రాస్ కంపెనీ అధినేత అయినటువంటి ఇంద్రనీల్ తో ( అతుల్ కులకర్ణి) చేతులు కలుపుతాడు. అతనితో అగ్రిమెంట్ కూడా చేసుకుంటాడు. కానీ అనన్యకి బిడ్డ పుట్టడంతో .. ఫ్యామిలీ కోసం తండ్రిని , బైక్ రేసింగ్ ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సునీల్ జీవితం ఏమైంది? విక్కీ మళ్ళీ రేసింగ్ లో పాల్గొనడానికి దారి తీసిన కారణాలు ఏంటి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: శర్వానంద్ బైకర్ కోసం దాదాపు 20 కేజీలు తగ్గాడు. ఈ కథను అతను ఎంతగా నమ్మాడో చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ప్రాణం పెట్టి పనిచేశాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా చేశాడు. అయితే శర్వానంద్ కంటే కూడా రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ కి ఇంకా ఎక్కువ మార్కులు పడతాయి. ఈ సినిమాలో రాజశేఖర్ ఎక్కువగా కళ్ళతో హావభావాలు పలికించారు. అతని యాక్టింగ్ లో ఒక స్టైల్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం దాన్ని పక్కన పెట్టేసి బుల్లెట్ సునీల్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు అని చెప్పాలి. మాళవిక నాయర్ ఈ సినిమా కోసం మునుపటి సినిమాలతో పోలిస్తే ఎక్కువ గ్లామర్ షో చేసింది. అతుల్ కులకర్ణి , బ్రహ్మాజీ, మాస్టర్ శౌర్య వంటి వాళ్ళు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: లూజర్ తో టాలెంటెడ్ దర్శకుడిగా అభిలాష్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకే బైకర్ పై మొదటి నుండీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఈ సినిమా అందుకుందా అంటే .. కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. కథ , కథనాల పై కంటే టెక్నికల్ యాస్పెక్ట్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో శర్వానంద్, అతని కొడుకు పాత్రతో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలా వరకు జెర్సీ ఫ్లేవర్ లోనే ఉన్నప్పటికీ ఆ రేంజ్ లో ఎమోషన్ ఫీల్ అవ్వలేము. ఆ ఫీలింగ్ వచ్చిన వెంటనే బైక్ రేస్ సీన్స్ వస్తుండటం రెగ్యులర్ ఆడియన్స్ ను ఇబ్బంది పెడతాయి.
అవి ఎక్కువ నిడివి ఉండటం వల్ల కథ సైడ్ ట్రాక్ అయిపోతుంటుంది. సెకండాఫ్ లో రాజశేఖర్ , శర్వానంద్ ..ల మధ్య వచ్చే సన్నివేశాలు, మనవడితో రాజశేఖర్ ఎమోషనల్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. టెక్నికల్ టీమ్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంటాయి. నిర్మాత పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. శర్వానంద్ కెరీర్ లో మళ్ళీ ఇన్ని హై టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా రాదేమో అనే రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి. రన్ టైమ్ ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొంత ట్రిమ్ చేసే అవకాశం ఉన్నా డైరెక్టర్ ఆ ఛాన్స్ తీసుకోలేదు.
విశ్లేషణ: స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ లు టాలీవుడ్ లో చాలా వచ్చాయి. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండిన సినిమాలే నిలబడ్డాయి. జెర్సీ క్లాసిక్ గా నిలవడానికి కారణం అదే. కానీ బైకర్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ సరిగ్గా పండలేదు. బైక్ రేసింగ్ సన్నివేశాలు ఎక్కువ లెన్త్ ఉండటం వల్లే ఆ లోటు స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి లాజిక్స్ అన్నీ అవసరం లేదు అనుకుంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్, ఓటీటీ ఆడియన్స్ కి ఈ సినిమా పర్వాలేదు అనిపించొచ్చు.
ఫోకస్ పాయింట్: రేసులో వెనుకబడ్డ బైకర్
రేటింగ్ : 2.5/5