తెలుగమ్మాయిలు తెలుగు సినిమా పరిశ్రమకు రారు అని కొందరు అంటుంటే.. వచ్చిన తెలుగు అమ్మాయిలను సినిమాల్లోకి తీసుకోరు అని మరికొందరు అంటుంటారు. రెండు వైపులా కొన్ని కొన్ని ఉదాహరణలు ఉంటూ ఉంటాయి. ఎవరి వాదన వారిదే, ఎవరి కంక్లూజన్ వారిదే. ఇలాంటి సమయంలో ఓ తెలుగమ్మాయి సినిమాల్లోకి వచ్చింది. పేరు, ఇంటి పేరు చూసి తెలుగమ్మాయే అని అందరూ పొంగిపోయారు. అయితే ఆమెకు తెలుగుతో ఎంత సంబంధం ఉందో తెలిసేసరికి కామ్ అవ్వాల్సిన పరిస్థి వచ్చింది.
‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో నటించి, మెప్పించిన సాత్విక వీరవల్లి గురించే ఇదంతా. పవన్ సాధినేని తెరకెక్కించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన నటించింది సాత్విక. ఆ సినిమా ప్రచారంలో తొలుత అంత యాక్టివ్‌గానే లేని సాత్విక.. సినిమా రిలీజ్ తర్వాత మెయిన్‌గా మారింది. ఇప్పుడు సినిమా ప్రచారం అంతా ఆమె పేరు మీదే నడిపిస్తున్నాయి సినిమా నిర్మాణ సంస్థలు. ఈ క్రమంలో ఆమె మాటలు విన్నాక.. ఈమె తెలుగమ్మాయినా? అనే ప్రశ్న వినిపిస్తోంది.
దానికి కారణం తెలుగులో పదాలు పలకకపోవడం, ఇంగ్లిష్ చూస్తే అమెరికన్ యాక్సెంట్‌లో ఉండటమే. ఏమైందా అని చూస్తే.. సాత్విక తండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు దగ్గరగా ఉండే వీరవల్లి గ్రామానికి చెందినవారు. అయితే వారి కుటుంబం తమిళనాడులోని కంచిలో స్థిరపడింది. ఆయన పెరిగింది అక్కడే. సాత్విక తండ్రి ఒక తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అందువల్ల కుటుంబమంతా ఇంట్లో తమిళమే మాట్లాడుతుంది.
తెలుగు మూలాలు, కొన్నేళ్ల పాటు హైదరాబాదులో పని చేయడం వల్ల సాత్విక తండ్రికి తెలుగు వచ్చు. తెలుగు రాస్తారు, చదువుతారు కూడా. ఆయన ద్వారానే సాత్విక కొద్దికొద్దిగా తెలుగు నేర్చుకుంది. పుట్టి, పెరిగింది అంతా అమెరికాలో కావడంతో అక్కడి యాసలోనే మాట్లాడుతుంది. అయితే, తమిళం మీద పట్టు బాగానే ఉంది. ఇదన్నమాట తెలుగమ్మాయి కానీ తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి కథ. ఇదేంటి ఊరు పేరు, ఇంటి పేరు ఒక్కటే అనుకుంటున్నారా? అవును ఒక్కటే.