Bimbisara Review: బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

“పటాస్” తర్వాత కళ్యాణ్ రామ్ కి హిట్ పడి దాదాపు 7 ఏళ్ళవుతోంది. మధ్యలో చిన్నపాటి విజయాలు వచ్చినప్పటికీ.. అవి సంతృప్తికరమైనవి కావు. అయితే.. ఎన్నడూ లేని విధంగా కళ్యాణ్ రామ్ సినిమా “బింబిసార”కి విశేషమైన ప్రీరిలీజ్ బజ్ ఏర్పడడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అసలే సరైన హిట్ లేక ఇబ్బందుల్లో తెలుగు పరిశ్రమకు “బింబిసార” ప్రీరిలీజ్ బజ్ కొత్త ఊపిరినిచ్చిందనే చెప్పాలి. సైన్స్ ఫిక్షనల్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించింది? కళ్యాణ్ రామ్ కి హిట్ తెచ్చిపెట్టిందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం..!!

కథ: తిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు (కళ్యాణ్ రామ్), ప్రపంచాన్ని కబళించాలనే కపట బుద్ధితో.. అన్నీ రాజ్యాలపై దండెత్తుతూ.. అక్కడి యువరాణులను వశం చేసుకుంటూ పరాయి రాజ్యాల గుండెల్లో దడ పుట్టిస్తుంటాడు. అయితే..

అనుకోని విధంగా 500 బి.సి కాలం నాటి బింబిసారుడు ప్రస్తుత ప్రపంచంలోకి టైమ్ ట్రావెల్ ద్వారా అడుగిడతాడు. అసలు బింబిసారుడు ఎలా ట్రైమ్ ట్రావెల్ చేశాడు? అందుకు దోహదపడిన అంశాలేమిటి? అనేది “బింబిసార” కథాంశం.

నటీనటుల పనితీరు: డైలాగ్ డెలివరీ, అది కూడా పౌరాణికం అనేది కళ్యాణ్ రామ్ కి బిగ్గెస్ట్ ఎస్సెట్. అందువల్ల.. ఈ సినిమాలో బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ పండించిన హావభావాలు, విలనిజం, డైలాగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. నిజానికి కళ్యాణ్ రామ్ నటుడిగా ఈ సినిమాతో ఎదగడం మాత్రమే కాదు, కథానాయకుడిగా తన పరిధిని కూడా పెంచుకున్నాడు. ఎమోషనల్ & ఫైట్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ నటనకి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు కళ్యాణ్ రామ్.

ఈ సినిమాకి అతనే నిర్మాత కూడా కావడం వల్ల.. మరింతగా ఇన్వాల్వ్ అయ్యి మంచి క్వాలిటీ సినిమా ఇచ్చాడు. యువరాణిగా కేతరీన్ అందాలు, పోలీస్ ఆఫీసర్ గా సంయుక్త మీనన్ స్క్రీన్ ప్రెజన్స్ ఆకట్టుకోగా.. వెన్నెల కిషోర్ & శ్రీనివాసరెడ్డిల కామెడీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ ప్రస్తుతానికి వచ్చిన తర్వాత రాసుకున్న ఎపిసోడ్స్ బాగా పేలాయి.

సాంకేతికవర్గం పనితీరు: ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. తక్కువ బడ్జెట్ లో భారీ అవుట్ పుట్ ఇచ్చి తన సీనియారిటీ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే.. ఈమధ్యకాలంలో వచ్చిన చాలా పెద్ద సినిమాలకంటే బెటర్ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉన్న సినిమా బింబిసార. నిర్మాత కళ్యాణ్ రామ్ కథను ఎలివేట్ చేయడంలో ఎక్కడా రాజీపడలేదని మొదటి ఫ్రేమ్ నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకూ స్పష్టపరుస్తుంది.

కీరవాణి నేపధ్య సంగీతం, చిరంతన్ భట్-వరికుప్పల యాదగిరిల పాటలు కథకి న్యాయం చేశాయి. అయితే.. సదరు పాటల ప్లేస్ మెంట్ మాత్రం సినిమాకి మైనస్ గా మారింది. ఒక టైమింగ్ అనేది లేకుండా.. సడన్ గా పాటలు వచ్చేయడం, అలాగే.. ఆ పాటల్లో అనవసరంగా శ్రుతిమించిన గ్లామర్ ను దట్టించడం కూడా మైనస్ అనే చెప్పాలి. నిజానికి బింబిసార కథనానికి ఈ పాటలు, ఆ పాటల్లోని ఓవర్ గ్లామర్ సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ లా నిలిచాయనే చెప్పాలి.

ఇక దర్శకుడు మల్లిడి వశిష్ట అలియాస్ వేణు గురించి మాట్లాడుకోవాలి. దర్శకుడిగా దాదాపు 6 ఏళ్ళ నుంచి సినిమా మొదలెట్టడానికి కృషి చేస్తూ.. అల్లు శిరీష్ హీరోగా ఒక సినిమా ప్రారంభోత్సవం జరుపుకొని కూడా ఆగిపోయినప్పటికీ.. తన టాలెంట్ తో కళ్యాణ్ రామ్ తో సినిమా ఒకే చేయించుకోవడమే సగం విజయం సాధించినంత విషయం. ఈ వశిష్ట అలియాస్ వేణు ఎవరో కాదు.. “ఢీ, బన్నీ, భగీరధ” లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించిన ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు.

ఇక మనోడి పనితనం గురించి చెప్పుకోవాలంటే.. దర్శకుడిగా పరిచయ చిత్రంతోనే ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ ను డీల్ చేసి తన సత్తాను చాటుకున్నాడు. టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ ను లాజికల్ గా కన్విన్స్ చేసి.. దాని చుట్టూ ఎమోషన్ తో అలరించడం అనేది మామూలు విషయం కాదు. అలాగే.. కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ ను రాసుకున్న విధానం కూడా బాగుంది. ఫస్టాఫ్ ను సాలిడ్ గా రాసుకున్న వశిష్ట.. సెకండాఫ్ లో కాస్త గాడి తప్పాడు. ముఖ్యంగా పాటల్ని ఇరికించిన విధానం, చిన్న పిల్లాడి క్యారెక్టర్ ను డీల్ చేసిన తీరు మైనస్ గా మారాయి. ఓవరాల్ గా దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న వశిష్ట.. కథకుడిగా మాత్రం బొటాబొటి మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

విశ్లేషణ: కళ్యాణ్ రామ్ ఏడున్నరేళ్ళ తర్వాత హిట్ కొట్టాడు. జూలై నుండి వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ఊపిరొచ్చింది “బింబిసార”. ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే పాటలు, ఫైట్లు మాత్రమే కాదు.. కంటెంట్ కూడా ఉండాలని “బింబిసార” ప్రూవ్ చేసింది. ఈ సక్సెస్ స్ట్రీక్ ను “సీతారామం, మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2” కంటిన్యూ చేస్తాయని ఆశిద్దాం.

రేటింగ్: 3/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus