Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ధృవ్ విక్రమ్ (Hero)
  • అనుపమ పరమేశ్వరన్ (Heroine)
  • పశుపతి, రజిషా విజయన్, అమీర్ సుల్తాన్, లాల్, మదన్ కుమార్ దక్షిణామూర్తి తదితరులు (Cast)
  • మారి సెల్వరాజ్ (Director)
  • సమీర్ నాయర్ - దీపక్ సైగల్ - పా.రంజిత్ - అదితి ఆనంద్ (Producer)
  • నివాస కె.ప్రసన్న (Music)
  • ఎళిల్ అరసు (Cinematography)
  • శక్తి తిరు (Editor)
  • Release Date : అక్టోబర్ 24, 2025
  • అప్లాస్ ఎంటర్టైన్మెంట్ - నీలం స్టూడియోస్ (Banner)

చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన చిత్రం “బైసన్”. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతవారం తమిళనాట విడుదలై మంచి టాక్ దక్కించుకుంది. వారం లేటుగా తెలుగులో విడుదల చేసారు. ఈవారం థియేటర్లలో సోలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగింది అనేది చూద్దాం..!!

Bison Movie Review

కథ: వనతి కిట్టయ్య (ధృవ్ విక్రమ్)కు చిన్నప్పటి నుండి కబడ్డీ అంటే ప్రాణం. అయితే.. అతడి తండ్రి మీద కోపంతో సొంత ఊరిలో కబడ్డీ టీమ్ లోకి రానివ్వరు. పోనీ బయట ఆడదాం అంటే ఎవరూ ఎంకరేజ్ చేయరు. అలాంటి సమయంలో కిట్టయ్యకి కబడ్డీ మీద ఉన్న ఆసక్తిని గమనించి, అతడ్ని స్కూల్ టీమ్ లోకి తీసుకుంటాడు కోచ్ (మదన్ కుమార్ దక్షిణామూర్తి).

అలా స్కూల్ లెవల్లో మొదలైన కిట్టయ్య ఆట.. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంది. 1993లో జపాన్ లో నిర్వహిస్తున్న ఇండియా-పాకిస్థాన్ కబడ్డీ పోటీకి సెలక్ట్ అవుతాడు కూడా.

తమిళనాడుకు చెందిన ఓ సామాన్యుడు.. జపాన్ దాకా వెళ్లి భారతదేశం గౌరవాన్ని ఎలా నిలబెట్టాడు? అందుకోసం అతడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఎన్ని అడ్డంకులను దాటి రావాల్సి వచ్చింది? అనేది “బైసన్” కథాంశం.

నటీనటుల పనితీరు: సాధారణంగా నటీనటులు ఒక పాత్రను అర్థం చేసుకోవడానికి కొన్ని వారాలు లేదా నెలల పాటు ట్రైనింగ్ తీసుకోవడం చూసి ఉంటాం. కానీ.. “బైసన్” సినిమా కోసం ధృవ్ విక్రమ్ ఏకంగా రెండున్నరేళ్లపాటు ఒక ఊర్లో ఉండిపోయి అక్కడి వ్యవహారశైలిని ఓన్ చేసుకుని, పాత్రధారిగా కాకుండా, ఒక వ్యక్తిలా కనిపించాడు. అందువల్ల కిట్టయ్య పాత్ర చాలా సహజంగా కనిపిస్తుంది. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ.. ఎమోషనల్ ట్రాన్సిషన్ కానీ చాలా స్పష్టంగా కనిపించాయి. నటుడిగా తండ్రికి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకున్నాడు ధృవ్.

సౌత్ ఇండియాలో మోస్ట్ అండర్ యుటిలైజ్డ్ ఆర్టిస్టుల్లో ఒకరు పశుపతి. ఆయన్ని అనవసరంగా టైప్ క్యాస్ట్ చేసేసి.. ఆయన్ని సరిగా వినియోగించుకోవడం లేదు. బైసన్ సినిమాలో కొడుకుని కాపాడుకోవడం కోసం తాపత్రయపడే తండ్రి పాత్రలో పశుపతి నటన, ముఖ్యంగా ఆయన హావభావాలు చూశాక నిర్లిప్తతకు సరికొత్త కోణం కనిపిస్తుంది.

కోచ్ పాత్రలో మదన్ కుమార్ చాలా చక్కగా ఒదిగిపోయాడు. కథ ముందుకు సాగడానికి అతడి పాత్ర చాలా కీలకం. పెద్దరికంతో కూడిన తెగింపును చాలా బాగా పండించాడు.

లాల్, అమీర్ ల పాత్రల్లో సమాజం, వ్యవస్థలోని భిన్న కోణాలను చూపించాలనుకున్నాడు దర్శకుడు. ఆ బరువును బలంగా మోశారు ఇద్దరూ.

రజిషా విజయన్ కళ్ళల్లో మొండితనం, బేలతనం ఒకేసారి పండించే విధానం నటిగా ఆమె స్థాయికి నిలువుటద్దం లాంటిది.

అనుపమ పరమేశ్వరన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది.

సాంకేతికవర్గం పనితీరు: మారి సెల్వరాజ్ సినిమాలన్నిట్లో విజువల్ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలోనూ ఎళిల్ అరసు తనదైన ఫ్రేమింగ్స్ తో కథ-కథనంలోకి ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు. ముఖ్యంగా పొలాల షాట్స్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది. అలాగే.. బ్లాక్ & వైట్ నుండి కలర్ ట్రాన్సిషన్ డి.ఐ విషయంలో తీసుకున్న జాగ్రత్తను కూడా మెచ్చుకోవాలి.

నివాస కె.ప్రసన్న సంగీతం సినిమా మూడ్ ని మైంటైన్ చేసింది. ఆర్ట్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ అన్నీ సినిమాకి తమ బెస్ట్ ఇచ్చారు.

దర్శకుడు మారి సెల్వరాజ్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ తన జీవితంలో చూసిన, ఎదురైన సందర్భాలు, సంఘటనల ఆధారంగానే తెరకెక్కించాడు. “బైసన్” కూడా అలాంటి సినిమానే. తాను హీరోగా భావించే కాలమాడన్ అనే కబడ్డీ ఆటగాడి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తన ప్రతి సినిమాలో ఉన్నట్లుగానే ఈ చిత్రంలో కుల వివక్ష, జాతి విద్వేషం వంటి అంశాలను గట్టిగా స్పృశించాడు. అయితే.. “బైసన్” స్క్రీన్ ప్లే విషయంలో నవ్యత చూపించాడు. ప్యారలల్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. అలాగే.. సినిమాలో ఒక్క హీరో పాత్ర మాత్రమే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా బలంగా చూపించాడు. లాల్, అమీర్ పాత్రల ద్వారా సమాజంలో వివక్ష అనేది ఏ విధంగా కారణం లేకుండా మొదలవుతుంది, దాని మూలాలను ఎందుకని చుట్టుపక్కల వాళ్లు ప్రశ్నించరు? అనేది చూపించాడు.

అలాగే.. ఒక్కోసారి మనోడు కాదు అనుకునే మనిషి కంటే.. మనవాడు అనుకున్నవాడే ప్రమాదకరం అని చెప్పే సందర్భం దర్శకుడిగా మారి సెల్వరాజ్ మార్క్ ను బాగా ఎస్టాబ్లిష్ చేస్తాయి. మారి సెల్వరాజ్ ఎంత క్యాస్టిజం, రిజర్వేషన్ సిస్టమ్ గురించి మాట్లాడినా.. అదేదో క్లాస్ పీకినట్లుగా లేకుండా జాగ్రత్తపడతాడు. “బైసన్” విషయంలోనే అదే ఫాలో అయ్యాడు. చాలా అంశాలు చర్చిస్తాడు, చాలా విషయాల్ని, పరిస్థితుల్ని, ఆలోచనా విధానాల్ని ప్రశ్నిస్తాడు, ప్రేక్షకులు కూడా ఆ విషయాల్ని అర్థం చేసుకునేలా చేస్తాడు. కాకపోతే.. సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ లో.. ఏదైనా ఒక విషయాన్ని సహజత్వంతోపాటుగా కాస్తంత అతిశయోక్తి కూడా అవసరం. లేదంటే.. ఎంత రియలిస్టిక్ గా ఉన్నా.. సినిమాటిక్ హై ఇవ్వడంలో విఫలమవుతాయి. అలాగని ఏదో లేనిదాన్ని చూపించమనడం లేదు.. ఉన్నదాన్ని.. ఇంకాస్త సినిమాటిక్ గా, కొద్దిగా గ్లోరిఫై చేసి చెప్పొచ్చు. మారి సెల్వరాజ్ మునుపటి సినిమాల్లో అది కనిపిస్తుంది. అది “బైసన్”లో లోపించింది. అందువల్ల.. మారి మునుపటి సినిమాల స్థాయిలో “బైసన్” ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.

విశ్లేషణ: అతిపెద్ద రాజ్యాంగ దేశం మనది. ఆ రాజ్యాంగం అనేది అందరినీ సమానంగా చూడాలన్న, అందరూ సమానంగా బ్రతకాలన్న ధ్యేయంతో లిఖించబడింది. కొందరు దాన్ని దుర్వినియోగపరిచారు, ఇంకొందరు రాజ్యాంగం కారణంగానే నిలదొక్కుకోగలిగారు. అయితే.. ఎందుకో వివక్షను మాత్రం రాజ్యాంగం రూపుమాపలేకపోయింది. అది కులం, మతం, జాతి వంటి ముసుగుల్లో మానవత్వపు ఉనికికి మాయని మచ్చలా నిలుస్తూనే ఉంది. అయితే.. ఆ వివక్షకు కారణమైన విద్వేషానికి మూలం ఏంటి? ఇక్కడి నుండి పుట్టింది? దాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? ఆ ఛట్రంలో ఇరుక్కుని మనుషులందరూ ఎందుకు కొట్టుకు ఛస్తున్నారు? ఒక్కసారి ఆ కంచె దాటితే ప్రపంచం ఎంత బాగుంటుంది? అనే ఆలోచనకు సరికొత్త ప్రతిరూపమే “బైసన్”.

1990 కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న వర్గ రణాల్ని, వాటి కారణంగా అసువులు బాసిన మనుషుల వ్యథల్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. అయితే.. ఈ కథకు తెలుగు ప్రేక్షకులు ఎంతవరకూ రిలేట్ అవ్వగలరు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే.. పూర్తిగా తమిళ నెటివిటీ, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండడంతో.. ఈ చిత్రం సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుందా అంటే.. పూర్తిస్థాయిలో నచ్చకపోవచ్చు అనే చెప్పాలి.

అయితే.. ధృవ్ విక్రమ్, పశుపతిల మాస్టర్ క్లాస్ యాక్టింగ్ & మారి సెల్వరాజ్ టేకింగ్ ను ఆస్వాదించడం కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే!

ఫోకస్ పాయింట్: విద్వేషపు వర్గీకరణకు ఎదురు నిలిచిన ఓ ఆటగాడి విజయగాథ!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus