తమిళనాడు నైవేలీ ప్రదేశంలో జరుగుతున్న తలపతి విజయ్ చిత్ర షూటింగ్ బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలాగే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనితో అక్కడ ఉన్న విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. మా హీరో షూటింగ్ ని అడ్డుకుంటారా అంటూ వారితో వాగ్వాదానికి దిగారు. దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక పరిస్థితి అదుపుదప్పేలా ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విజయ్ ఫ్యాన్స్ పై పోలీస్ లు లాఠీ ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది. విజయ్ బయటికి వచ్చి ఫ్యాన్స్ కి సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందట.
ఇక దర్శకుడు లోకేష్ కానగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మాస్టర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడు రోల్ చేస్తున్నాడు. అనిరుధ్ మాస్టర్ సినిమాకి సంగీతం అందిస్తుండగా, విజయ్ ఈ చిత్రంలో కాలేజీ ప్రొఫెసర్ మరియు మాఫియా డాన్ ఇలా రెండు గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం. ఇక రెండు రోజుల క్రితం విజయ్ ఇల్లు మరియు కార్యాలయం పై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.