హీరో ఆది సాయి కుమార్ నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బ్లాక్’. పెద్దగా చప్పుడు చేయకుండా రిలీజ్ అయిన ఈ మూవీ రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అనడంలో అతిశయోక్తి లేదు. టీజర్, ట్రైలర్ లకు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వచ్చాయి. ఆది సాయి కుమార్ ఏమాత్రం ఫామ్లో లేడు.కానీ ‘బిగ్ బాస్ 2’ విన్నర్ కౌశల్ మంద ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడం ఒక్కటే స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవాలి.ఇక జి బి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ మూవీ మెప్పించిందా నొప్పించిందా? అనేది చూద్దాం రండి :
కథ : ఆదిత్య (ఆది సాయి కుమార్) తండ్రి ఓ కానిస్టేబుల్. ఆయన మరణించడంతో ఆ జాబ్ ఆదిత్య కి వస్తుంది. అతను డ్యూటీ లో చేరిన మొదటి రోజే ఓ కాలనీలో ఒక బిజినెస్మెన్ ఇంట్లో రూ. 50 లక్షలు దొంగతనం జరుగుతుంది. తర్వాతి రోజు ఓ గ్యాంగ్ స్టర్ తమ్ముడు హత్యకు గురవుతాడు. తన తమ్ముడిని హత్య చేసింది ఆదిత్యే అని రావత్ అనుకుంటాడు.అలాగే తన దగ్గర నుంచి రూ.50 లక్షలు కొట్టేసింది కూడా ఆదిత్య అంటూ ఎస్సై విహాన్ వర్మ (కౌశల్ మంద) అనుకుంటాడు.
వీళ్ళు అలా అనుకోవడానికి కారణం ఏంటి? ఈ సమస్య నుంచి ఆదిత్య ఎలా బయట పడతాడు. హీరోయిన్ హానిక (దర్శనా బానిక్) పాత్ర ఈ వ్యవహారంలోకి ఎందుకు వచ్చింది? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : హీరోగా ఆది సాయి కుమార్ ఎప్పటిలానే డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.ఈ మూవీలో ఇంకాస్త ఫిట్ గా కనిపించాడు ఆది. రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రల్ని ఎంతో ఈజ్ తో చేశాడు. హీరోయిన్ దర్శన బానిక్ లుక్స్ బాగున్నాయి.కథని మలుపు తిప్పే విధంగా ఈ పాత్ర ఉంటుంది. ఆమె వరకు బాగానే చేసింది. ఇక ‘బిగ్ బాస్’ విన్నర్ అయినప్పటి నుండీ కౌశల్ ను బిగ్ స్క్రీన్ పై చూడాలని తన కౌశల్ ఆర్మీ అనుకుంటుంది.
ఇంకా వాళ్లలో ఆ వేడి ఉందో లేదో తెలీదు కానీ కౌశల్ మాత్రం తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించి న్యాయం చేశారు. కానీ మిగిలిన పాత్రలు ఏమీ పెద్దగా గుర్తుండవు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు జీబీ కృష్ణ థ్రిల్లర్ తీయాలని మంచి పాయింట్ అనుకున్నాడు. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ వంటివి ఆకట్టుకుంటాయి. కానీ మధ్యలో వచ్చే లవ్ సీన్స్ , కామెడీ ట్రాక్ లు బాగా బోర్ కొట్టిస్తాయి. ప్రేక్షకులను ఇరిటేట్ చేసే విధంగా ఉంటాయి. ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ కు ముందు కొన్ని బలమైన సన్నివేశాలు రాసుకుని ఉంటే పాస్ మార్కులు పడుండేవి. ఇప్పుడైతే దగ్గర కొచ్చి ఫెయిల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం బాగుంది.ఈ సినిమాకి ఇలాంటి మంచి నేపధ్య సంగీతం ఉంటుందని ముందుగా ఎవ్వరూ ఊహించలేదు.ఇక సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ఎడిటర్ అమర్ రెడ్డి కి చాలా ఎక్కువ పనే పడింది. ఈ విషయంలో ఆయన చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉండొచ్చు అనే అనుమానం కలుగుతుంది. మహంకాళి దివాకర్ ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకె అనిపిస్తాయి.
విశ్లేషణ : సినిమా రన్ టైం 2 గంటల 18 నిమిషాలు మాత్రమే ఉండడం అనేది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఉంటుంది కానీ టేకింగ్ మైనస్ అని చెప్పాలి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకి కూడా ఈ మూవీ బోర్ కొట్టిస్తుంది. నటీనటులు, టెక్నికల్ టీం బాగానే న్యాయం చేశారు కానీ ఇది పూర్తిగా దర్శకత్వం లోపం ఉన్న మూవీ అనే చెప్పాలి.
రేటింగ్ : 1.5/5