Black, White & Gray – Love Kills Review in Telugu: బ్లాక్ వైట్ & గ్రే వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మయూర్ మోరే (Hero)
  • పలక్ జైస్వాల్ (Heroine)
  • దేవెన్ భోజాని, తిగ్మాన్షు ధులియా తదితరులు.. (Cast)
  • పుష్కర్ సునీల్ మహాబల్ (Director)
  • హేమల్ ఏ టక్కర్ - స్వరూప్ సంపత్ (Producer)
  • మేఘదీప్ బోసే (Music)
  • సాయి భోపే (Cinematography)
  • Release Date : మే 02, 2025

ఈ ఓటీటీల పుణ్యమా అని వారానికి ఒక సిరీస్ రిలీజ్ అవుతుంది. అయితే.. ప్రతి సిరీస్ ఆకట్టుకోలేదు, కొన్ని మాత్రమే అలరిస్తాయి. అయితే.. డాక్యుమెంటరీ డ్రామాకి ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్ ను జోడించి పుష్కర్ సునీల్ మహాబల్ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ “బ్లాక్ వైట్ & గ్రే” ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పింది. సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ 6 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!

Black, White & Gray – Love Kills Review

కథ: నాగ్ పూర్ లో చోటు చేసుకున్న ఓ సంఘటన. గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొని హైవేలో ఉన్న ఓ హోటల్ కి వెళ్లిన కుర్రాడు, అక్కడ అమ్మాయిని చంపేసి, ఆమె మృతదేహాన్ని ఊరు దాటించే క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ ను, ఓ క్యాబ్ డ్రైవర్ ను, ఓ కుర్రాడ్ని చంపేశాడని, ఆఖరికి అతను కూడా చనిపోయాడని కేస్ క్లోజ్ చేస్తారు.

కట్ చేస్తే.. ఆ కుర్రాడు చనిపోలేదు, పైగా అతడు ఎవర్నీ మర్డర్ కూడా చేయలేదు. ఇవన్నీ ఓ ఫారిన్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తెలుసుకుంటాడు.

అసలు ఎవరా కుర్రాడు? అతన్ని నిజంగానే హత్య కేసుల్లో ఇరికించాలని చూసారా? ఆ కుర్రాడు నిజంగా అమాయకుడా? లేక ఏమైనా దాస్తున్నాడా? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే “బ్లాక్ వైట్ & గ్రే” వెబ్ సిరీస్.

నటీనటుల పనితీరు: “కోటా ఫ్యాక్టరీ” అనే వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మయూర్ మోరే ఈ సిరీస్ లో విభిన్నమైన పాత్రలో ఆకట్టుకున్నాడు. అతడి పాత్రకి మంచి వెయిటేజ్ ఉంటుంది. చాలా దృష్టికోణాలు ఉంటాయి. అందువల్ల డిఫరెంట్ వేరియేషన్స్ పండించాల్సి వచ్చినా చక్కగా ఒదిగిపోయాడు.

పలాక్ జైస్వాల్ ఓ జెన్ జీ అమ్మాయిగా సరిగ్గా సరిపోయింది. ఆ పాత్ర తాలూకు మైండ్ సెట్ ను తెరపై ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. అందంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకుంది పలక్.

మరో కీలకపాత్రలో దేవెన్ భోజాని చాలా తక్కువ డైలాగ్స్ తో కేవలం స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించాడు. అతడి వ్యవహారశైలి భయపెట్టే విధంగా లేకపోయినా, అతడి పాత్రను అల్లిన విధానం కొంత భయాన్ని క్రియేట్ చేస్తుంది.

ఇక కథలోని మరో కోణాన్ని పరిచయం చేసే మిగతా నటీనటులు కొత్తవారా లేక నిజంగానే సదరు కేసులో ఇన్వాల్వ్ అయినవారా అనేది తెలియదు కానీ.. వారి నటన చాలా సహజంగా ఉంది.

సాంకేతికవర్గం పనితీరు: పుష్కర్ సునీల్ మహాబల్ ఈ సిరీస్ ను తెరకెక్కించే విధానంలోనే సగం విజయం సాధించాడు. ఎందుకంటే.. ఇప్పటికే ఈ తరహా సంఘటనలతో చాలా సినిమాలు, సిరీస్ లు వచ్చాయి. అయితే.. “దృష్టికోణం” అనే ఫార్మాట్ తో చాలా తక్కువ సిరీస్ లు వచ్చాయి. దానికి కూడా “ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్”ను జోడించి కథనాన్ని అత్యంత ఆసక్తికరంగా నడిపించిన విధానం ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ ఎస్సెట్. నిజమైన వ్యక్తులుగా చూపించబడుతున్నవారు నిజంగానే కేసుకు సంబంధించినవారేమో అనే డౌట్ వచ్చేలా వాళ్ళ ఫుటేజ్ లు బ్లాక్ & వైట్ లో, రీక్రియేషన్ ను కలర్ లో చూపించడం అనేది ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేయకుండా అలరించగా..

మధ్యమధ్యలో సీసీటీవీ ఫుటేజ్ ఫీడ్ ను యాడ్ చేసి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా.. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ఏదైతే ఉందో, సిరీస్ కి ఒక సంపూర్ణత తీసుకురావడమే కాక, ఇంకెన్ని దృష్టికోణాల్లో సదరు సంఘటనను అర్థం చేసుకోవాలో అనే అనుమానాల్ని సైతం లేవనెత్తుతుంది. సీరియల్ దర్శకుడైన పుష్కర్ సునీల్ మహాబల్ ఓటీటీ డెబ్యూతోనే తన సత్తాను ఘనంగా చాటుకున్నాడనే చెప్పాలి. ఈ సిరీస్ కి అతనే ఎడిటర్ అవ్వడం అనేది మరో ప్లస్ పాయింట్. ఎక్కడ ఇంటర్ కట్స్ ఇవ్వాలి, ఎక్కడ పాసింగ్ షాట్స్ ఉండాలి వంటివి చాలా ప్రొపర్ & ప్లాన్డ్ గా సెట్ చేసుకున్నాడు. ఆ రకంగా డైరెక్టర్ గా, ఎడిటర్ గా ఈ సిరీస్ కి 100% న్యాయం చేశాడు పుష్కర్.

ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా సన్నివేశాలను, సందర్భాలను రీక్రియేట్ చేసిన విధానం బాగుంది. ఎక్కడా సహజత్వం మిస్ అవ్వకుండా జాగ్రత్తపడ్డారు. చాలా లిమిటెడ్ సీజీ వర్క్ తో చాలా షాట్స్ ను మ్యానేజ్ చేసిన విధానం కూడా బాగుంది. సాయి భోపే సినిమాటోగ్రఫీ వర్క్ & మేఘదీప్ భోసే సంగీతం ఈ సిరీస్ కు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. సౌండ్ డిజైన్ & ఫ్రేమింగ్స్ విషయంలో తీసుకున్న కేర్ ఆడియన్స్ ను ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో దోహదపడింది.

విశ్లేషణ: ఒక రియల్ ఇన్సిడెంట్ లేదా ఏదైనా సెన్సేషనల్ కేస్ ను బేస్ చేసుకుని చాలా సినిమాలు, సిరీస్ లు వస్తుంటాయి. కొన్ని విక్టిమ్ పాయింటాఫ్ వ్యూలో ఉంటే, ఇంకొన్ని కల్ప్రిట్ ఎల్డా అక్యూజ్డ్ పాయింటాఫ్ వ్యూలో ఉంటాయి. కానీ.. ఈ రెండు కోణాలు కాకుండా ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూని కూడా కవర్ చేస్తూ చాలా తక్కువ సిరీస్ లు వచ్చాయి. అందులో “బ్లాక్ వైట్ & గ్రే” ముందు వరుసలో నిలుస్తుంది. స్క్రీన్ ప్లే, పెర్ఫార్మెన్సులు, సినిమాటోగ్రఫీ వర్క్ & మేకింగ్ ఇలా ప్రతీదీ అద్భుతంగా కుదిరాయి. అన్నిటికీ మించి మితిమీరిన హింస లేదు, ఇబ్బందిపెట్టే శృంగార సన్నివేశాలు లేవు. మొదటి ఎపిసోడ్ నుంచి 6వ ఎపిసోడ్ వరకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. అన్నిటికీమించి ఓపెన్ ఎండింగ్ తో ముగిసినా, సెకండ్ సీజన్ కోసం ప్రశ్నలు ఏమీ మిగల్చకుండా చక్కగా ముగించడం సంతృప్తినిస్తుంది.

ఫోకస్ పాయింట్: విభిన్న దృష్టికోణాల్లో సాగే ఆసక్తికరమైన డాక్యుమెంటరీ డ్రామా!

రేటింగ్: 3.5/5

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus