బాలీవుడ్ హీరోలపై నేరాల మచ్చ

వెండి తెరపై మంచి మాటలు, పనులతో ఆకట్టుకునే హీరోలను అభిమానులు ఆరాదిస్తుంటారు. తమ హీరోలూ నిజ జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటారు. కాని కొంతమంది నటులు నేరాల మరక పూసుకుంటున్నారు. అభియోగాలను ఎదుర్కొంటున్న కొంతమంది బాలీవుడ్ నటుల గురించి..

ప్రేమ గొడవలు..వాంటెడ్, కిక్, బాడీ గార్డ్, దబాంగ్, బజిరింగ్ బాయ్ జాన్ వంటి హిట్ చిత్రాల హీరో సల్మాన్ ఖాన్ వెంట విజయాలతో పాటు, వివాదాలు వస్తుంటాయి. గతంలో ప్రేమలో గొడవల కారణంగా ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ లను దూషించి చేయి చేసుకున్నాడన్న వార్తలు బలంగా వినిపించాయి. ఐష్ తో క్లోజ్ గా ఉంటున్నందుకు తనను చంపుతానని సల్మాన్ బెదిరించాడని నటుడు వివేక్ ఒబెరాయ్ చెప్పాడు. జోద్పూర్ అడవుల్లో కృష్ణ జింకలను వేటాడిన కేసులోనూ సల్మాన్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.

ఆయుధాలు కలిగి ఉన్నందుకు..కల్ నాయక్, మున్నాబాయి ఎంబీబీఎస్, లగారహో మున్నాబాయి సినిమాల ద్వారా విజయాలు అందుకున్న సంజయ్ దత్ పై అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో నేరం రుజువైంది. దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేంకు చెందిన ఆయుధాలను సంజయ్ తన వద్ద రహస్యంగా దాచినట్లు సుప్రీం కోర్టు నిర్దారించింది. అందుకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం సంజయ్ దత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

జింకలను వేటాడినందుకు..కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ తో పాటు సైఫ్ ఆలీఖాన్ పై కేసు నమోదైంది. “హమ్ సాత్ సాత్ హై” చిత్రంలో సల్మాన్ తో కలిసి నటించిన సైఫ్ తో పాటు కథానాయికాలు టబు, నీలం కూడా ఆ కేసులో నిందుతులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది.

తాగిన మత్తులో గొడవకు దిగాడని..కొన్ని సార్లు ఆవేశంలో మాట్లాడిన మాటలు కూడా మెడకు చుట్టుకుంటాయి. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ విషయం లోనూ ఇదే జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మహా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులతో షారూఖ్ ఖాన్ స్టేడియంలోనే గొడవపడ్డాడు. స్టేడియం సిబ్బంది అమర్యాద పూర్వకంగా ప్రవర్తించారని షారూక్ మండిపడ్డాడు. తాగిన మత్తులో షారూఖ్ గొడవకు దిగాడని స్టేడియం ఎదురుదాడికి దిగారు. ఐదేళ్ల పాటు షారూఖ్ స్టేడియం లోకి అడుగు పెట్టకుండా నిషేధించారు.

చిన్న కేసుల్లో..

ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే గోవిందా పై కూడా ఓ కేసు ఉంది. సినిమా చిత్రీకరణ చూసేందుకు వెళ్లిన తనపై గోవిందా చేయి చేసుకున్నాడని సంతోష్ రాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అయితే సదరు వ్యక్తి సెట్లో అసభ్యంగా ప్రవర్తించాడని గోవిందా చెప్పాడు.
పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండే జాన్ అబ్రహం పై కూడా ఒక కేసు నమోదైంది. అతి వేగంగా వాహనం నడిపాడన్న అభియోగంతో జాన్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను బెయిల్ పై విడుదల అయ్యాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus