గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు.. ఒకటి ‘రంగ మార్తాండ’, రెండోది బ్రహ్మానందం. ‘రంగమార్తాండ’ సినిమా ప్రీమియర్లు మొదలవ్వడం ఆలస్యం.. సినిమా గురించి, బ్రహ్మానందం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు సినీ జనాలు. అంతలా ఆ సినిమాలో అలరించారు బ్రహ్మానందం. ఈ క్రమంలో ఆయన చాలా వేదికల మీద మాట్లాడుతూ తను ఆ పాత్ర చేయడానికి గల కారణాలు, ఈ సినిమా తర్వాత ఎలాంటి పాత్రలు చేస్తాను లాంటి విషయాలు చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ఎఫ్‌ఎన్‌సీసీ సన్మానంలో కూడా ఇదే విషయం గురించి మాట్లాడారు బ్రహ్మానందం.
‘‘ఇదంతా చూస్తుంటే నా హృదయం సంతోషంతో నిండిపోయింది. నోరు మూగబోతోంది’’ అంటూ ఓ సామెతను ఉదహరిస్తూ చెప్పారు బ్రహ్మానందం(Brahmanandam) . ఓ కళాకారుడు రంగస్థలంపై ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. అలా చెబితే అంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఇన్ని కోట్ల మందిని నవ్వించడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అందరూ మోక్షం కోరుకుంటారు. అంటే మరో జన్మ ఉండకూడదు అని అనుకుంటారు. కానీ, నేను నాకు మోక్షం వద్దు మళ్లీ మళ్లీ జన్మించాలని ఆ దేవుణ్ని కోరుకుంటాను’’ అని బ్రహ్మానందం అన్నారు.
‘‘వచ్చే జన్మల్లో నేను ఏ జీవిగా పుట్టినా సరే నా తోటి జీవులను నవ్వించే వరం ప్రసాదించమని ఆ దేవుణ్ని అడుగుతా’’ అని తన మనసులో మాటను చెప్పుకొచ్చారు బ్రహ్మానందం. ఉగాదిని పురస్కరించుకొని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ (FNCC) సభ్యులు బ్రహ్మానందాన్ని సత్కరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
FNCC ఏర్పాటు చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అందులోనే బ్రహ్మానందం తన గురించి ఈ కామెంట్స్ చేశారు. ‘రంగ మార్తాండ’ సినిమా నేపథ్యంలో ఈ సన్మానం చేయకపోయినా.. అందులో ఆయన నటన చూశాక ఆయనకు ఎన్ని సన్మానాలు చేసినా తక్కువే అనిపిస్తుంటుంది అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.