Bramayugam Review in Telugu: భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 16, 2024 / 05:39 PM IST

Cast & Crew

  • మమ్ముట్టి (Hero)
  • ఆమ్లదా లీజ్ (Heroine)
  • అర్జున్ అశోకన్, సిద్ధార్ధ్ భరతన్ తదితరులు.. (Cast)
  • రాహుల్ సదాశివన్ (Director)
  • చక్రవర్తి రామచంద్ర - ఎస్.శశికాంత్ (Producer)
  • క్రిస్టో జేవియర్ (Music)
  • షెహనాద్ జలాల్ (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 15, 2024

లాక్ డౌన్ టైంలో అన్నీ ఇండస్ట్రీలు సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటే.. మలయాళం ఇండస్ట్రీ మాత్రం తమ సత్తాను చూపింది. ముఖ్యంగా.. మమ్ముట్టి చేస్తున్న ప్రయోగాలు మరే ఇండస్ట్రీలోనూ ఎవ్వరూ కనీసం ప్రయత్నించే ఆలోచన కూడా చేయరు. మొన్నామధ్య వచ్చిన “కాథల్” అనే సినిమాలో ఆయన స్వలింగ సంపర్కుడి పాత్రలో నటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు ఆయన తాజా చిత్రం “భ్రమయుగం” కూడా మేకింగ్ & కంటెంట్ తో చర్చనీయాంశం అయ్యింది. సౌత్ లో చాన్నాళ్ల తర్వాత పూర్తిస్థాయి బ్లాక్ & వైట్ లో తెరకెక్కిన చిత్రమిది.

రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మలయాళంతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేయాలనుకున్నప్పటికీ.. మలయాళం వెర్షన్ మాత్రమే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: కేరళ ప్రాంతాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. తెల్లవాడి బానిసత్వ సంకెళ్లు తెంచుకొనే ప్రయత్నంలో పాణన్ వర్గానికి చెందిన తేవన్ (అర్జున్ అశోకన్) అనుకోని విధంగా ఓ పెద్ద భవంతికి చేరుకుంటాడు. ఆ భవంతిలో కొడుమోన్ పొట్టి (మమ్ముట్టి) మరియు అతడి వంటవాడు (సిద్ధార్ధ్ భరతన్) మాత్రమే ఉంటారు. స్వతహా మంచి జానపద గాయకుడు అయిన తేవన్ తన పాటలతో కొడుమోన్ పొట్టిని మెప్పించి.. భవంతిలో నివసించే అవకాశం దక్కించుకుంటాడు.

కట్ చేస్తే.. తాను నివసించే భవంతిలో కంటికి కనిపించని మాయ ఏదో ఉందని గ్రహించి, అక్కడ్నుంచి పారిపోవాలనుకుంటాడు తేవన్. కానీ.. ఎన్నిసార్లు ప్రయత్నించినా మళ్ళీ భవంతిలోకే వచ్చేస్తుంటాడు. అసలు ఆ భవంతిలో ఉన్న కనిపించని మాయ ఏమిటి? ఎందుకని తేవన్ ను బయటకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది? అసలు కొడుమోన్ పొట్టి ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. “భ్రమయుగం” చిత్రాన్ని చూడాల్సిందే!

నటీనటుల పనితీరు: ఒక మనిషి నవ్వులో నానార్ధాలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. కానీ.. ఆ నవ్వులో అమాయకత్వాన్ని, క్రూరత్వాన్ని, కుంచిత స్వభావాన్ని ఒకేసారి చూపించి నటుడిగా తన స్థాయి ఏమిటో మరోసారి చాటుకున్నాడు మమ్ముట్టి. ముందు వరుస పళ్ళు అన్నీ బయటకి కనిపిస్తూ మధ్యలో వాటిని నాలుకతో తుడుచుకుంటూ మమ్ముట్టి అత్యంత భయంకరంగా నవ్వే విధానం సినిమాకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మమ్ముట్టి స్థాయిలోనే నటించి.. ఆయనకి మంచి పోటీ ఇచ్చాడు అర్జున్ అశోకన్. అతడు పోషించిన తేవన్ పాత్రకి మనకి తెలియకుండానే మనం కనెక్ట్ అయిపోతాం.

తేవన్ క్యారెక్టర్ మన దైనందిన జీవితంలో మనదే. తేవన్ ఒక భవంతిలో ఇరుక్కుంటాడు. కానీ.. మనం ఉద్యోగం, కుటుంబం, ఈ.ఎం.ఐ అనే చట్రంలో మనకి తెలియకుండానే ఎలా చిక్కికుపోయామో గుర్తుకు చేస్తుంది. అందుకే తేవన్ పాత్ర సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఒకానొక సందర్భంలో అతడి పాత్ర “అసమర్ధుని జీవయాత్ర” నవలలోకి ప్రధాన పాత్రను గుర్తుకు తెస్తుంది. ఇక సిద్ధార్ధ్ భరతన్ చాలా తక్కువ డైలాగులతో, ఎక్కువ హావభావాలతో ఆకట్టుకున్న విధానం ప్రశంసార్హం.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్ ను మెచ్చుకొని తీరాలి. ఒక బ్లాక్ & వైట్ సినిమాలో ఇన్ని రకాల వేరియేషన్స్ చూపించొచ్చు అనేది చేసి చూపించాడు. ముఖ్యంగా కలర్ గ్రేడింగ్ టెక్నిక్ తో ఉదయం, మధ్యాహ్న, సాయంత్రం, రాత్రి సమయాల్లో చూపించిన తేడా ప్రశంసనీయం. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ షెహనాద్. క్రిస్టో జేవియర్ పాటల కంటే నేపధ్య సంగీతం & సౌండ్ డిజైనింగ్ వర్క్ కి ఎక్కువ మార్కులు పడతాయి. ముఖ్యంగా సౌండ్డి జైనింగ్.. అసలు ఏ సందర్భానికి ఎంత కావాలో అంతే శబ్ధాన్ని ప్రేక్షకులు వినేలా డిజైన్ చేసిన తీరు అబ్బురపరుస్తుంది. ఒక్కోసారి జనాలు అమితాసక్తితో చెవులు రెక్కించేలా చేశాడు.

దర్శకుడు రాహుల్ సదాశివన్ ఎంచుకున్న కథ పాయింట్ గా చెప్పాలంటే ఒక పేజీ కూడా నిండదు. కానీ.. ఆ కథలో అతడు అంటరానితనం, కుల వివక్ష వంటి ఆలోచింపజేసే అంశాలను కుదించిన విధానం బాగుంది. మమ్ముట్టి పోషించిన కొడుమోన్ పాత్ర విధి, అర్జున్ అశోకన్ పోషించిన తేవన్ పాత్ర మనిషి, సిద్ధార్ధ్ భరతన్ పోషించిన వంటవాడి పాత్ర కర్మలను తలపించేలా క్యారెక్టర్ ఆర్క్స్ ను డిజైన్ చేసిన తీరు అద్భుతం.

అన్నిటికంటే ముఖ్యంగా.. మమ్ముట్టి నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ ప్లే చేసిన “విధేయన్” లుక్ ను “భ్రమయుగం”లో కంటిన్యూ చేసి మలయాళ ఆడియన్స్ మనసులు గెలిచాడు దర్శకుడు. ఇంచుమించుగా ఆ సినిమాలో పాత్రకు కంటిన్యుటీలా ఉంటుందీ కొడుమోన్ పొట్టి క్యారెక్టర్. కథకుడిగా, దర్శకుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు రాహుల్ సదాశివన్. ఇక అందరికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నిర్మాతల గురించి. ఒక కథ, కాన్సెప్ట్ ను నమ్మి డబ్బు విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిబద్ధతతో నిర్మించిన తీరు ప్రశంసనీయం.

విశ్లేషణ: ఇదేదో హారర్ సినిమా అనుకొని థియేటర్లకు వెళ్ళి, హారర్ కు మించిన ఆశ్చర్యానుభూతితో ఇళ్లకు వెళ్ళేలా చేసే సినిమా “భ్రమయుగం”. మమ్ముట్టి నటవిశ్వరూపం, షెహనాద్ సినిమాటోగ్రఫీ, కిస్టో జేవియర్ సౌండ్ డిజైన్, వైనాట్ స్టూడియోస్ సంస్థ ప్రొడక్షన్ డిజైన్ కోసం ఈ చిత్రాన్ని (Bramayugam) కచ్చితంగా ఒకసారి చూడాల్సిందే. బిగ్ స్క్రీన్ పై ఈ సినిమా ఇచ్చే ఇంపాక్ట్ మరో స్థాయిలో ఉంటుంది.

రేటింగ్: 3.5/5

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus