బ్రాందీ డైరీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 13, 2021 / 09:24 PM IST

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత థియేటర్లు తెరుచుకోవడం.. వరుసగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతుండడం జరుగుతుంది. వాటిని కూడా ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఈరోజు కూడా 6 కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘బ్రాందీ డైరీస్’ అనే మూవీ కూడా ఉంది.ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో.. రిలీజ్ కు ముందు ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. మరి వాటిని ఈ చిత్రం మ్యాచ్ చేసిందో లేదో తెలుసుకుందాం రండి.

కథ: శ్రీను అనే కుర్రాడు సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు.అందుకోసం హైదరాబాద్ లో కోచింగ్ కూడా తీసుకుంటాడు. కానీ అతను మద్యానికి అలవాటు పడడంతో… అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు అతని సొంత ఊరికి తీసుకెళ్ళి పోతారు. అక్కడ కూడా అతను బార్ కు వెళ్తూ ఉంటాడు.అయితే రోజు అతనికి మరో నలుగురు విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళ వల్ల ఇతని జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. చివరికి అతను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాడా లేదా? అతనికి పరిచయం అయిన ఆ నలుగురు వ్యక్తులు ఎవరు? అనేది ‘బ్రాందీ డైరీస్’ అసలు కథ.

నటీనటుల పనితీరు: హీరో నవీన్ వర్మ చాలా ఇంటెన్సిటీ తో తన పాత్రని పోషించాడు. ‘అర్జున్ రెడ్డి’ లో విజయ్ దేవరకొండ రేంజ్ లో ట్రై చేశాడు కానీ ఆ స్థాయిలో కాకపోయినా పర్వాలేదు ఓకే అనిపించాడు. ‘ఓ పక్క లక్ష్యం మరోపక్క వ్యసనం’.. ఇతని పాత్ర ఇప్పటి యూత్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక హీరోయిన్ సునీత సద్గురు లుక్స్ పెద్దగా ఆకర్షించేలా లేవు కానీ సహజమైన నటన తో పర్వాలేదు అనిపించింది. ప్రేమించిన అబ్బాయి జీవితం నాసనమైపోతుంది అంటూ ఆందోళన చెందే అమ్మాయిగా ఈమె కనిపిస్తుంది. ఇక కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె వంటి వారు కూడా తమ పరిధి మేరకు పర్వాలేదు అనిపించారు. కానీ తెలిసిన మొహాలు కాకపోవడంతో ప్రేక్షకులకు ఈ పాత్రలు పెద్దగా రిజిస్టర్ కాకపోవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు: మద్యానికి బానిస అయిపోయి జీవితం పట్ల అశ్రద్ద వహిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ప్రేమ, పెళ్లి, స్నేహం, కెరీర్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎలా మెలగాలి? అనే అంశాలను 5 పాత్రల ద్వారా వివరించాలి అనే దర్శకుడు శివుడు ఆలోచన బాగుంది.మద్యం అనేది ఓ స్నేహితుడు లాంటిది.అది కోరుకునే వాళ్ళకి రిలీఫ్ ఇచ్చే ఔషదంలా ఫీలవ్వాలి తప్ప.. మన జీవితాలను శాసించే విధంగా దానికి అవకాశం ఇవ్వకూడదు… అనే పాయింట్ ను అతను ఎంచుకున్న విధానం ఓకే అనిపిస్తుంది.వర్మ పాత్ర ద్వారా చాలా ఫిలాసఫీ చెప్పించాడు.ఆ పాత్ర పలికిన మాటలు మెప్పిస్తాయి. శ్రీను, భవ్య పాత్రల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ సో సోగా అనిపిస్తుంది. కానీ వీరి మధ్య వచ్చే సంభాషణలు యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

ఇళ్లు, పిల్లలు, కుటంబాన్ని పట్టించుకుకోని జాన్సన్ లాంటి పాత్రలను మనం నిజ జీవితంలో చూసే ఉంటాం. తన ఉద్యోగ ధర్మంగా పేదలకు సాయం చేయాలని చూసే డిప్యూటీ ఎమ్మార్వో శేఖర్ పాత్ర కూడా హృదయాన్ని తట్టిలేపేలా ఉంటుంది. అయితే దర్శకుడు తెరకెక్కించిన కథనంలో వేగం మిస్ అయ్యింది. వాస్తవికంగా సినిమాను రూపొందించాలని భావించే క్రమంలో అతను కొన్ని అనవసరపు సన్నివేశాలను జోడించాడు. అవి కాస్త ఇరికించిన ఫీలింగ్ తెప్పిస్తుంది.దీంతో ఒక సెక్టార్ ఆడియన్స్ కు మాత్రమే ఈ ‘బ్రాందీ డైరీస్’ కనెక్ట్ అవుతుంది అని చెప్పాలి. ప్రకాష్ అందించిన సంగీతం బాగానే ఉంది. నేపథ్య సంగీతానికి కూడా మంచి మార్కులే పడతాయి. సినిమాటోగ్రఫీ కూడా ఓకె. నిర్మాణ విలువలు కథకు తగినట్లు ఉన్నాయి.

ఓవర్ ఆల్ గా మంచి కాన్సెప్ట్, రియాలిటీకి దగ్గరగా ఉండే సంభాషణలు, ఎమోషన్స్ వంటివి ఈ ‘బ్రాందీ డైరీస్’ లో ఉన్నాయి. కానీ స్లో నెరేషన్, స్టార్ క్యాస్ట్ లేకపోవడం వంటి అంశాల కారణంగా థియేటర్లలో ఈ చిత్రాన్ని ఎంతమంది చూస్తారో చెప్పలేము. కానీ..ఇదే మూవీ ఓటిటిలో రిలీజ్ అయితే కచ్చితంగా ఓ సారి చూడదగినదే.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus