Bromance Review in Telugu: బ్రోమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మాథ్యూ థామస్ (Hero)
  • మహిమా నంబియార్ (Heroine)
  • అర్జున్ అశోకన్, సంగీత్ ప్రతాప్ తదితరులు.. (Cast)
  • అరుణ్ డి.జోస్ (Director)
  • ఆషిక్ ఉస్మాన్ (Producer)
  • గోవింద్ వసంత (Music)
  • అఖిల్ జార్జ్ (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 14, 2025

“రోమాంచం” ఫేమ్ అర్జున్ అశోకన్, “ప్రేమలు” ఫేమ్ సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ మరియు “జాబిలమ్మ నీకు అంత కోపమా” చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న మాథ్యు థామస్, మహిమ నంబియార్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన మలయాళ సినిమా “బ్రోమాన్స్” (Bromance). ఫిబ్రవరి 14న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం నేటి నుండి (మే 1) సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం..!!

Bromance Review

కథ: ఒక మంచి పార్టీలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు బింటో (మాథ్యూ వర్గేసి), సడన్ గా తన అన్నయ్య కనిపించడం లేదంటూ షబ్బీర్ (అర్జున్ అశోకన్) ఫోన్ చేయడంతో.. హుటాహుటిన అక్కడకి చేరుకున్న బింటోకి అన్నయ్య షింటో (శ్యామ్ మోహన్) ఏమయ్యాడో అర్థం కాక, షింటో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఐషు (మహిమా నంబియార్), కొరియర్ బాబు (కళాభవన్ షాజోన్), హరిహరసుధన్ (సంగీత్ ప్రతాప్)లతో కలిసి అన్నయ్య షింటోను వెతకడం మొదలెడతాడు.

ఈ క్రమంలో బింటో ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వాటిని షబ్బీర్, కొరియర్ బాబు, ఐషు, హరిహర సుధన్ ల సహాయంతో ఎలా అధిగమించాడు? అనేది “బ్రోమాన్స్” (Bromance) కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ.. మాథ్యూ థామస్ బాగా ఎలివేట్ అయ్యాడు. యాంగర్ ఇష్యూస్ ఉన్న నవతరం యువకుడిగా అతని కామెడీ టైమింగ్ హిలేరియస్ గా వర్కవుట్ అయ్యింది. అర్జున్ అశోకన్ మెప్పించే ప్రయత్నం చేశాడు కానీ.. అతని టైమింగ్ కంటే, క్యారెక్టరైజేషన్ ఎక్కువగా అలరించింది.

సంగీత్ ప్రతాప్ కామెడీ పంచులు, సీక్వెన్సులు బాగా పేలాయి. మహిమ నంబియార్ చిన్నపాటి గ్లామర్ యాడ్ చేసి, అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసింది. కొచ్చి డాంగ్ లీగా కళాభవన్ షాజోన్ కొంచం మాస్ ను యాడ్ చేశాడు.

ఇక షింటోగా శ్యామ్ మోహన్ చుట్టూ కథ నడుస్తుంది, అయితే.. అతడి పాత్ర సరిగా పండలేదు. అతని పాత్ర స్వభావాన్ని ఇంకాస్త వివరించి ఉంటే బాగుండేది.

సాంకేతికవర్గం పనితీరు: ఇప్పటివరకు గోవింద్ వసంత క్లాసిక్ & లవ్ బీట్స్ మాత్రమే విన్న మనకి, ఈ చిత్రంలో వెస్ట్రన్ ఫ్యూజన్ బీట్స్ వింటే.. గోవింద్ వసంతను ఈ యాంగిల్ లోనూ వాడొచ్చు అనిపిస్తుంది. “ఫారెన్సిక్, కాల, 2018, ఐడెంటిటీ” వంటి చిత్రాల ఫేమ్ అఖిల్ జార్జ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ వర్క్ అందించడం విశేషం. అతని స్థాయి కెమెరా ఫ్రేమ్స్ గట్రా కనిపించనప్పటికీ.. ట్రెండీగా, వైబ్రెంట్ కలర్స్ తో సినిమాని తెరకెక్కించాడు. క్లైమాక్స్ గోడౌన్ ఫైట్ ను పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది.

కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ గా కేరళలో మంచి పేరు సంపాదించుకున్న అరుణ్ డి.జోస్ తన స్ట్రెంగ్త్ జోన్ లోనే “బ్రోమాన్స్”ను నడిపాడు. కొంచం టెక్నాలజీ, కొత్తతరం మనస్తత్వాలు, బ్రేకప్ లు గట్రా కవర్ చేసిన విధానం బాగుంది. అలాగే.. పాత్రల ద్వారా హాస్యాన్ని క్రియేట్ చేసిన తీరు, చిన్నపాటి సందర్భాలతో సినిమాను ఆసక్తికరంగా మార్చిన విధానం బాగున్నాయి. అయితే.. కథతో సంబంధం లేకుండా ఇరికించిన కామెడీ ట్రాక్ & ఫైట్ బ్లాక్ కాస్త చిరాకుపెడతాయి. అయితే.. ఓవరాల్ గా మాత్రం ఆడియన్స్ ను ఎంగేజ్ చేసాడనే చెప్పాలి.

విశ్లేషణ: కామెడీ సినిమాలో లాజిక్స్ ఎంత వద్దు అనుకున్నా.. అసలు సదరు సన్నివేశాలు, పాత్రలు ఎందుకు వస్తున్నాయో క్లారిటీ లేకపోతే మాత్రం కచ్చితంగా ఇబ్బందిపడతాం. ఆ మైనస్ పాయింట్స్ ను పక్కన పెట్టగలిగితే, ఓటీటీలో కాబట్టి “బ్రోమాన్స్”ను హ్యాపీగా టైంపాస్ కోసం చూసేయొచ్చు.

ఫోకస్ పాయింట్: మంచి వీకెండ్ టైంపాస్ కామెడీ ఎంటర్టైనర్!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus