సినిమాల్లో అడుగుపెట్టిన వారికి ఇప్పుడు అప్పుడో కెప్టెన్ కుర్చీ ఎక్కాలన్న ఆశ కలుగుతుంది. దర్శకుడికి కుడి భుజం, ఎడమ భుజంలా ఉండే రచయిత, కెమెరామెన్ లకి ఈ ఆశ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. రచయితలు ఎటూ మెగాఫోన్ పడుతున్నారు. కెమెరా పట్టిన వాళ్లలోను కొందరు “యాక్షన్.. కట్” చెప్పినప్పటికీ రచయితలతో పోలిస్తే వీరి సక్సెస్ రేటు చాలా తక్కువ.భారతదేశంలోని టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్స్ లో సంతోష్ శివన్ ఒకరు. సినిమాటోగ్రాఫర్ గా బిజీ గా ఉండే ఈయన జయాపజయాలకు అతీతంగా కొన్ని సినిమాలు తెరకెక్కించారు. అయితే వాటికి అవార్డులు వచ్చినంతగా విజయాలు రాలేదు.
కేవీ ఆనంద్ కూడా ‘కో’ లాంటి విజయం మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లో ఎస్.గోపాల్ రెడ్డి, రసూల్ ఎల్లూర్ పరిస్థితి అదే. ఇక దర్శకుడు తేజ కూడా ఈ కోవలోనే వాడే. అయితే వీరిలో ఓసారి అదృష్టం పరీక్షించుకుందాం అనుకునేవారు కొందరైతే మరికొందరు కెప్టెన్ కుర్చీలోనే స్థిరపడాలని కలలు కంటున్నారు.అసలే అంతంతమాత్రంగా ఉన్న ఈ బాటలోకి మరో కెమెరామన్ రావాలని ఉబలాటపడుతున్నాడు. అతడే రాజమౌళి సినిమాలకి ఆస్థాన కెమెరామెన్ కెకె సెంథిల్ కుమార్. ప్రస్తుతం కెమెరాతో బిజీగా ఉన్న ఇతగాడు మెగాఫోన్ పట్టాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడు. దానికి తగ్గ కథ కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పిన సెంథిల్ సొంత కథ సిద్ధం చేస్తున్నట్టు తెలిపాడు. అయితే సెంథిల్ దర్శకుడిగా కొనసాగుతాడా.. లేక ఒకట్రెండు సినిమాలతో తన ముచ్చట తీర్చుకుంటాడా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నే. వీటితోపాటు ఈ సినిమాటోగ్రాఫర్ టర్నడ్ డైరెక్టర్ సక్సెస్ రేటు ఎలా ఉంటుందన్నది కూడా…?!