చాలామంది కమెడియన్లు హీరోలుగా మారి సినిమాలు తీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ సక్సెస్ అయిన వాళ్లు చాలా తక్కువ. హీరోలుగా మారిన తర్వాత కమెడియన్లు తమ ప్లస్ పాయింట్స్ ని పక్కన పెట్టేయడమే పెద్ద మైనస్ అవుతుంది అని అంతా అభిప్రాయపడుతుంటారు. అది పక్కన పెడితే..టాలీవుడ్లో ఇప్పుడున్న బిజీ కమెడియన్ అలాగే స్టార్ కమెడియన్ ఎవరంటే టక్కున చెప్పే పేరు వెన్నెల కిషోర్. అతను కూడా హీరోగా మారుతూ ‘చారి 111 ‘ అనే సినిమా చేశాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం రండి :
కథ: రా ఏజెంట్ల కాన్సెప్ట్ తో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సాధారణంగా రా ఏజెంట్లు ఐడెంటిటీ లేకుండా ప్రభుత్వాలకి లోబడి పని చేస్తూ ఉంటారు.రూల్స్ బ్రేక్ చేయడం అనే వరకు వాళ్ళు వెళ్ళరు. అయితే ఉగ్రవాదుల ఆట కట్టించడానికి… వారికి రూల్స్ అనేవి అడ్డుపడకుండా చేస్తాడు మాజీ ఆర్మీ అధికారి ప్రసాద్ రావు (మురళీ శర్మ). అందులో భాగంగా ‘రుద్రనేత్ర’ ఏజెన్సీ ఏర్పాటు చేస్తాడు ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్). ఆయన అతను కాలం చేశాక అతని కొడుకు (రాహుల్ రవీంద్రన్) ముఖ్యమంత్రి అవుతాడు. మరోపక్క హైదరాబాద్ లో జరిగిన మానవ బాంబు దాడితో ముఖ్యమంత్రి, రుద్రనేత్ర ఏజెన్సీ లో భయం మొదలవుతుంది.
ఈ క్రమంలో ఏజెంట్ చారి (వెన్నెల కిశోర్) ఆ కేసును టేకప్ చేస్తాడు. మనిషి 6 అడుగులు ఉన్నా పిరికివాడు ఇతను. కామెడీగా పనైపోవాలని అనుకుంటాడు.కానీ తికమకకి గురయ్యి ఏదేదో చేసేస్తాడు. అలాంటి టైంలో ఇతని లైఫ్ లోకి ఏజెంట్ ఇషా (సంయుక్తా విశ్వనాథన్), ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి) ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: ‘వెన్నెల’ కిశోర్ చారిగా తన మార్కు నటనతో అలరించాడు. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండించాడు. అయితే సెకండ్ హాఫ్ లో సీరియస్ మోడ్ కి వెళ్ళాడు. హీరోగా చేసినా కూడా బిల్డప్ షాట్స్ కోరుకోకపోవడం అతని పాత్ర బాగా పండటానికి బాగా ప్లస్ అయ్యింది అనుకోవచ్చు. హీరోయిన్ సంయుక్తా విశ్వనాథన్ రెగ్యులర్ హీరోయిన్ లా అనిపించదు. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా బాగా నటించింది. హీరో కంటే కూడా ఈమెనే ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ లో కనిపించింది అని చెప్పాలి.
గ్లామర్ పరంగా కూడా ఈమె మంచి మార్కులు వేయించుకుంది. మురళీ శర్మ,సత్య, ‘తాగుబోతు’ రమేష్ కొన్ని చోట్ల తమ మార్క్ కామెడీతో ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ, రాహుల్ రవీంద్రన్, శుభలేఖ సుధాకర్, పావని రెడ్డి వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ అనే కొత్త థీమ్ చుట్టూ అల్లిన కథ ఇది. కథ పరంగా బాగానే ఉంది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కూడా హిలేరియస్ గా అనిపిస్తుంది. ల్యాగ్ అనే ఫీలింగ్ లేకుండా త్వరగానే ముగిసిందా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ కథ మొత్తం ఒకేసారి సీరియస్ గా మారిన ఫీలింగ్ కలుగుతుంది. అదే ఫీల్ లో ఉండగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది. సో వెన్నెల కిషోర్ కి కూడా కామెడీ చేసే ఛాన్స్ లేకుండా పోయింది. టీజీ కీర్తి కుమార్ ఫస్ట్ హాఫ్ ను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
హీరో వెన్నెల కిషోర్ తో ఇలాంటి సబ్జెక్ట్ ను కామెడీతో అలాగే స్టైలిష్ గా డీల్ చేయడం అంటే మాటలు కాదు.అదితి సోని కథకు తగ్గట్టు బాగానే ఖర్చు చేశారు. సైమన్ కె కింగ్ మ్యూజిక్ బాగుంది. కాశీష్ గ్రోవర్ తన సినిమాటోగ్రఫీతో సినిమాకి రిచ్ నెస్ ను తీసుకొచ్చాడు.
విశ్లేషణ: వెన్నెల కిషోర్ మార్క్ కామెడీ కోసం (Chaari 111) ‘చారి 111’ ని ఒకసారి హ్యాపీగా ఈ వీకెండ్ కి థియేటర్లలో చూడొచ్చు. ఫస్టాఫ్ అయితే హిలేరియస్ గా ఉంటుంది.
రేటింగ్ : 2.5/5