కార్తికేయ-లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రం “చావు కబురు చల్లగా”. శవాల బండి డ్రైవర్ గా కార్తికేయ, విడో నర్స్ గా లావణ్య త్రిపాఠి నటించిన ఈ చిత్రం ద్వారా కౌశిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పాటలు, ట్రైలర్ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేశాయి. మరి సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం..!!
కథ: బస్తి బాలరాజు (కార్తికేయ) ఊరమాస్ కుర్రాడు. వైజాగ్ లో ఎవరు చనిపొయినా మోసుకెళ్ళే శవాల బండి నడుపుకుంటూ బ్రతికేస్తుంటాడు. అలా ఒక శవాన్ని స్మశానానికి తీసుకెళ్ళడానికి వెళ్ళిన బాలరాజు అక్కడ భర్త చనిపోయి విలపిస్తున్న మల్లిక (లావణ్య త్రిపాఠి)ని చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు.
శవాల బండి డ్రైవర్ అయిన బాలరాజు-ప్రసూతి వార్డులో నర్స్ గా వర్క్ చేసే మల్లికల మధ్య ప్రేమ చిగురించిందా? అది పెళ్ళి దాకా వెళ్లిందా? అందుకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? అనేది “చావు కబురు చల్లగా” కథాంశం.
నటీనటుల పనితీరు: బాలరాజు పాత్రలో కార్తికేయ జీవించాడనే చెప్పాలి. మాస్ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ బాగా చూపించాడు. అయితే.. క్యారెక్టరైజేషన్ లొ ఉన్న డెప్త్, క్యారెక్టర్ కి లేదు. అందువల్ల బాలరాజు ప్రవర్తన సరిగా అర్ధం కాదు. మల్లిక పాత్రలో లావణ్య పర్లేదు అనిపించుకుంది. అయితే.. ఈ పాత్రను ఆమె డీగ్లామర్ అని ఎందుకు చెప్పుకొచ్చిందో అర్ధం కాలేదు. చాన్నాళ్ళ తర్వాత ఆమనిని వెండితెరపై చూడడం ఆనందంగా ఉన్నప్పటికీ.. ఆమె పాత్రను దిగమింగుకోవడం కాస్త కష్టమే. మురళీ శర్మ, రజిత, భద్రమ్, శ్రీకాంత్ అయ్యంగర్, రంగస్థలం మహేష్ లు పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఒక సాధారణ కథను నవతరానికి నచ్చే విధంగా తెరకెక్కించాలనుకున్నాడు. కొన్ని ప్రయోగాలు చేశాడు, పాత్రల తీరుతెన్నుల పరంగా కొన్ని రిస్క్ లు కూడా చేశాడు, కానీ ఎందులోనూ పరిణితి చూపలేకపోయాడు. ఆడియన్స్ ను ఆలోజింపజేసే పాత్రలు, ఆశ్చర్యపరిచే పాత్రలు ఇప్పటికే చాలా వచ్చాయి. డబ్బైల కాలంలోనే బాలచందర్ బోల్డ్ క్యారెక్టరైజేషన్స్ తో ప్రేక్షకులకు చిన్నపాటి షాక్ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడొస్తున్న దర్శకులు తాము రాసుకొనే పాత్రలు బోల్డ్ అని అనుకోవడం హాస్యాస్పదం.
భర్త చనిపోయిన రోజే పెళ్ళి చేసుకోమని అడిగేటంతటి ఫాస్ట్ మైండ్ సెట్ ఉన్న హీరో.. పాతికేళ్లుగా మొగుడు మంచానపడి ఉండగా తల్లి ఇంకో వ్యక్తి స్నేహాన్ని కోరుకోవడాన్ని తప్పుబట్టడం అనేది అర్ధం కాని క్యారెక్టరైజేషన్. ఆఖరికి తల్లి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుండగా.. తనను చూడడానికి వచ్చిన ప్రేయసితో ఏమీ జరగనట్లుగా “ఏదో మాట్లాడాలన్నావ్” అంటూ క్యాజువల్ గా మాట్లాడడం డైరెక్టర్ కి క్యారెక్టర్స్ మీద పట్టులేదు అనేందుకు నిదర్శనం. సరే.. చిన్నప్పటినుంచి శవాల మధ్య పెరిగాడు, చావు అనేది పెద్ద విషయం కాదు హీరోకి అని ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకున్నా కూడా, ఆ చావుకి తానే కారణం అని తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం చలనం లేకపోవడం, అసలు తన తప్పే లేదు అన్నట్లుగా ప్రవర్తించడం లాంటివి మరీ హేయంగా ఉన్నాయి.
జేక్స్ బిజోయ్ ఒక్కడే తనవంతు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. ఆయన సమకూర్చిన పాటలు, నేపధ్య సంగీతం బాగున్నాయి. కానీ.. ప్రతి ఫస్టాఫ్లో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక పాట, సెకండాఫ్ లో నీరసించిపోతున్నప్పుడు వచ్చే పాటలు ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ సోసోగా ఉన్నాయి.
విశ్లేషణ: ఒక సినిమాలో కథ, కథనం, పాత్రలు.. ఇలా ఎదో ఒకదానితో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వాలి అంటే క్యారెక్టర్స్ లో డెప్త్, కథనంలో అలరించే అంశం, అన్నిటికీ మించి పాత్రల మధ్య ఒక స్ట్రగుల్ అనేది ఉండాలి. రెండు విభిన్నమైన పాత్రల నడుమ ఎంతటి పోటీ ఉంటే కథనం అంత అర్ధవంతంగా, ఆసక్తికరంగా ఉంటుంది. “చావు కబురు చల్లగా” చిత్రంలో ఇవేమీ మచ్చుకైనా కనిపించలేదు. అన్నిటికీ మించి క్యారెక్టరైజేషన్స్ విషయంలో కనీస స్థాయి హోంవర్క్ చేయకపోవడం అనేది ఇంకా పెద్ద మైనస్. కార్తికేయ కష్టం మరోసారి వృధా అయ్యింది.
రేటింగ్: 2/5