ఇండస్ట్రీకి వచ్చి ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలతో నటిస్తేనో లేకపోతే వరుసబెట్టి అయిదారు హిట్స్ అందుకోంటేనో వచ్చే క్రేజ్ & స్టార్ డమ్ ను కేవలం షార్ట్ ఫిలిమ్స్ తో దక్కించుకొన్న ఘనత చాందిని చౌదరి సొంతం. ఇన్స్టాగ్రామ్, డబ్ స్మాష్ లు వంటివి లేని కాలంలో.. ఆమె సినిమాల్లోకి రావడానికి ముందే ఫ్యాన్ పేజస్, వాటికి లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించిన ఘనత కూడా చాందిని చౌదరిదే. కానీ.. ఈ క్రేజ్, షార్ట్ ఫిలిమ్ స్టార్ డమ్ అనేది సినిమాల్లో మాత్రం ఆమెకు ఉపయోగపడలేదు. కెరీర్ మొదలెట్టి నాలుగేళ్లవుతున్నా సోలో హీరోయిన్ గా మాత్రం సరైన హిట్ కొట్టకపోవడమే కాదు.. కనీసం నటిగానూ గుర్తింపు సాధించలేకపోయింది. అప్పటివరకూ ఆమె షార్ట్ ఫిలిమ్స్ చూసిన జనాలందరి ప్రశ్న ఒక్కటే.. “”మధురం” లాంటి షార్ట్ ఫిలిమ్ లో అంత అద్భుతంగా, సహజంగా నటించిన అమ్మాయి సినిమాల్లో ఎందుకు రాణించలేకపోతుంది?” అని ఆలోచిస్తూ బుర్రలు వేడెక్కిపోయాయి.
అయితే.. కీర్తిసురేష్ లాంటి అమ్మాయి కూడా “మహానటి”లో నటించేంతవరకూ ఆమెలో అంత అద్భుతమైన నటి ఉందని ఎంతమందికి తెలుసు చెప్పండి. అదే విధంగా.. చాందిని చౌదరిలోనూ నటిని ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో పరిచయం చేసే చిత్రం “మను”. క్రౌడ్ ఫండెడ్ ఫిలిమ్ గా రూపొందిన ఈ థ్రిల్లర్ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ వైవిధ్యమైన సినిమాలను ఆదరించే ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంది. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న “మను” సినిమా గురించి, ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చిత్ర కథానాయకి చాందిని చౌదరి చాలా డేరింగ్ గా చెప్పిన విషయాలు-విశేషాలు మీకోసం..!!
కథ కూడా వినకుండా ఒకే చేసిన సినిమా “మను”
ఫణీంద్రతో ఇదివరకూ “మధురం” అనే షార్ట్ ఫిలిమ్ చేశాను, అతను అద్భుతమైన ఫిలిమ్ మేకర్. అందుకే తను వచ్చి “మను” అనే సినిమా చేద్దామనుకొంటున్నాను కానీ రెమ్యూనరేషన్ ఇవ్వలేను అని చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా సినిమా అంగీకరించాను. ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యేవరకూ కనీసం కథ కూడా వినలేదు.
టైమ్ ఎక్కువ తీసుకున్నా.. మంచి సినిమా చేయడం బెటర్ అనిపించింది..
“హీరోయిన్స్ కి కెరీర్ స్పాన్ తక్కువ కదా.. నువ్వు ఒక సినిమా కోసం మూడేళ్లు టైమ్ స్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్” అని నన్ను చాలామంది అడిగారు. కానీ.. నా నాలుగేళ్ల కెరీర్ లో నేను కంగారుపడిపోయి లేదా తొందరపాటు నిర్ణయాలతో చేసిన సినిమాలేవీ నాకు హిట్ కాదు కదా కనీసం గుర్తింపు కూడా తెచ్చిపెట్టలేదు. అందుకే.. టైమ్ ఎక్కువ తీసుకొన్నా పర్వాలేదు అని ఫిక్స్ అయ్యే “మను” సినిమాకి సైన్ చేసి.. ఆ సినిమా కోసమే డెడికేటెడ్ గా వర్క్ చేశాను.
చెప్పినంత బాగా తీసేవారు కాదు..
“మను”కు ముందు చేసినవి మంచి సినిమాలు కాదు అనడం లేదు కానీ.. చెప్పినంత బాగా మాత్రం తీసేవారు కాదు. చెప్పినప్పుడు “అబ్బ ఎంత బాగుంది” అనిపించేది. కానీ.. అదే కథను తెరపై చూసుకున్నప్పుడు మాత్రం “ఇదేంటి ఇలా ఉంది” అనిపించింది. నిర్మాణ సమయంలో అనవసరమైన మార్పులు, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్న ఉత్సుకతతో జొప్పించిన సన్నివేశాలు సినిమా అవుట్ పుట్ ను పాడుచేసేవి.
ఈ నాలుగేళ్లలో చాలా మార్పులు చూశాను..
నేను హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ ఫిలిమ్ మేకింగ్ లోనే కాదు ప్రేక్షకులు సినిమాని ఆదరించే ధోరణిలోనూ భారీ మార్పులు వచ్చాయి. ఇండస్ట్రీ కూడా కమర్షియల్ సినిమాలతోపాటు కంటెంట్ ఉన్న సినిమాలవైపు మొగ్గు చూపుతోంది. సినిమాను అర్ధం చేసుకొని, చదువుకున్నవారు ఇండస్ట్రీకి వస్తున్నారు. భవిష్యత్ సినిమా సేఫ్ హ్యాండ్స్ లో ఉందనిపిస్తుంది.
ఆ విషయాల్లో చాలా మోసపోయాను..
కెరీర్ కొత్తలో మరీ చిన్నపిల్లని కావడం వల్లనో లేక ఇండస్ట్రీ నుంచి సరైన బ్యాకింగ్ లేకపోవడం వల్లనో తెలియదు కానీ.. చాలా మోసపోయాను. అందరిని ఈజీగా నమ్మేసేదాన్ని, వాళ్ళు చెప్పింది నిజమా, అబద్ధమా? అని కూడా చెక్ చేసేదాన్ని కాదు. అందువల్ల చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. నేను చేసింది తప్పు అని తెలుసుకొనేలోపే ఆ తప్పు కారణంగా చాలా కోల్పోవాల్సి వచ్చేది.
ఆ స్టార్ డమ్ ను నేను సరిగా వినియోగించుకోలేదు..
నాకు షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు వచ్చిన స్టార్ డమ్ & క్రేజ్ ను నేను గనుక సరిగ్గా వినియోగించుకొని ఉంటే ఈపాటికి నటిగా సెటిల్ అయిపోయేదాన్నేమోననిపిస్తుంది. కెరీర్ మొదట్లోనే అనవసరమైన ఎగ్రిమెంట్లు సైన్ చేయడం, స్క్రిప్ట్స్ ను సరిగా జడ్జ్ చేయలేకపోవడం వలన వచ్చి నాలుగేళ్లవుతున్నా ఇంకా ఇక్కడే ఉండిపోయాను (నవ్వుతూ..).
నాకు నచ్చని పని చేయమనేవారు..
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏమిట్రా అంటే.. “రోమాంటిక్ సీన్స్”. రొమాన్స్ అనేది తప్పు కాదు, కానీ వాటిని తెరకెక్కించే విధానం బాగుండాలి. కమర్షియల్ గా బాగుంటుంది కదా అని చెత్త ఎక్స్ పోజింగ్, అనవసరమైన రోమాంటిక్ సీన్స్ చేయడం నాకు నచ్చదు. కానీ కొన్ని సినిమాల కోసం తప్పేది కాదు. నా మనసుకి నచ్చకపోయినా సినిమా ఒప్పుకొన్నాను అనే ఒకే ఒక్క కారణంతో ఇష్టం లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో నటించాను.
నన్ను బ్యాడ్ చేయాలని ప్రయత్నించారు..
కొన్నిసార్లూ తప్పక తలోగ్గానని ప్రతిసారి అదే విధంగా చేస్తానని భావించిన కొందరు నాతో ప్రతి సినిమాలోనూ రోమాంటిక్ సీన్స్ చేయమని అడిగారు. నేను నిర్మొహమాటంగా చేయనని చెప్పేసేదాన్ని. అప్పుడు నా గురించి నెగిటివ్ న్యూస్ లు స్టార్ట్ అయ్యాయి. “ఈ అమ్మాయి డైరెక్టర్ చెప్పినమాట వినదట, టీం ని చాలా ఇబ్బంది పెడుతుందట” అని వార్తలు వ్యాపించాయి. అయితే.. అలాంటి వార్తలవల్ల నాకు చెడు ఎంత జరిగిందో ఎప్పుడూ లెక్కేసుకోలేదు కానీ.. మంచి మాత్రం చాలా జరిగింది. ఎవర్ని నమ్మాలి, ఎవర్ని ఎలా జడ్జ్ చేయాలి వంటి విషయాలు నేర్చుకొన్నాను. నిజానికి ఈ చేదు అనుభవాలన్నీ నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పించాయి.
మొహమాటంతో చేసిన సినిమా “బ్రహ్మోత్సవం”..
నిజానికి “బ్రహ్మోత్సవం” సినిమా కేవలం శ్రీకాంత్ అడ్డాల గారి కోసం చేశాను. మొదట్లో మహేష్ కి సిస్టర్ రోల్ అని చెప్పగానే చేయనని చెప్పేశాను. కానీ.. తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారు చాలా సెన్సిబుల్ గా “నీది తనికెళ్లభరణిగారు కూతురు క్యారెక్టర్, సినిమా నీ పెళ్లితోనే ఓపెన్ అవుతుంది” అని చెప్పడం, ఆయన మంచితనానికి నా మొహమాటం సింక్ అవ్వడంతో :బ్రహ్మోత్సవం” ఒప్పుకొన్నాను. ఆ సినిమాతో నాకు మహేష్ బాబుతో ఫోటో తప్ప ఏమీ మిగలలేదు.
తెలుగమ్మాయి అంటే సిస్టర్ క్యారెక్టర్స్ కి ఫిక్స్ అయిపోతారు..
తెలుగమ్మాయిలు, ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిన అమ్మాయిలు అంటే వాళ్ళు సిస్టర్ లేదా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కి మాత్రమే పనికొస్తారు అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది మన ఇండస్ట్రీలో. అది ఇప్పుడిప్పుడే కాస్త మారుతుంది అనుకోండి. కానీ.. ముంబై నుంచి హీరోయిన్స్ ను దిగుమతి చేసుకొనే కంటే కూడా ఇక్కడున్న అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయడం చాలా బెటర్ అనేది నా భావన.
పెద్ద సినిమాలకు తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా పనికిరారా ??
నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి వింటున్న మాట ఏమిటంటే పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలంటే స్టార్ డమ్ ఉండాలి అని. అసలు స్టార్ డమ్ పక్కన పెట్టండి, కనీసం గుర్తింపు రావాలన్నా కూడా ముందు అవకాశం రావాలి కదా. తెలుగమ్మాయిలు పెద్ద సినిమాల్లో హీరోయిన్స్ గా ఎందుకు పనికిరారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు.
మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే తట్టుకోలేను..
నా కెరీర్ ఇలా అవ్వడానికి మా అమ్మే కారణం అని కొన్ని వార్తలు నేను విన్నాను. అసలు నా స్టోరీ సెలక్షన్ విషయంలో మా అమ్మ డెసిషన్ ఏమీ ఉండదు. మొదట్లో నా పర్సనల్ నెంబర్ ఇచ్చేయడం వల్ల చాలా రాంగ్ కాల్స్ వచ్చేవి. ఆ దెబ్బకి భయపడి నేను నా నెంబర్ మార్చేసి, ఎవ్వరైనా సినిమా గురించి ఎంక్వైరీ చేయాలంటే మా అమ్మకి ఫోన్ చేయమని చెప్పాను. నాకు ఫోన్ చేసి వెధవ వేషాలు వేసినట్లుగా మా అమ్మకి ఫోన్ చేసి చేయడం కుదరదు కదా. అందుకే కావాలని అలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఈ ప్రపంచంలో నాకు ఎవరైనా మా అమ్మ తర్వాతే. నేను ఆమెకు ఏకైక కుమార్తెను. అలాంటప్పుడు మా అమ్మ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎందుకు ఉరుకుంటాను చెప్పండి.
పొరపాటున కూడా కాంప్రమైజ్ అవ్వను..
“ఈ యాటిట్యూడ్ ఇండస్ట్రీలో పనికిరాదు” అని చాలామంది చెప్పారు. కానీ.. నేను నేనులా ఉంటేనే నాకు నచ్చుతాను. అలా కాదని సినిమా అవకాశాల కోసం నిజ జీవితంలోనూ నటించడం నాకు ఇష్టం ఉండదు. నేను పక్కా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ని. టైమ్ కి సెట్ లో ఉంటాను, ఒకటి లేదా రెండు టేక్స్ లోనే నా సీన్స్ ను కంప్లీట్ చేస్తాను. ఒక ఆర్టిస్ట్ కి ఇంతకుమించిన క్వాలిఫికేషన్ ఏం కావాలి. అందుకే నా యాటిట్యూడ్ నాతోనే, ఇలానే ఉంటుంది.
నీల పాత్ర నుంచి నేను చాలా నేర్చుకున్నాను..
“మను” సినిమా కథను మొదటి చెప్పినప్పుడే “నీల” అనే పాత్రను నేను ఓన్ చేసేసుకొన్నాను. షూటింగ్ జరిగినన్నాళ్లు ఆ పాత్ర నుంచి, పాత్ర స్వభావం నుంచి చాలా నేర్చుకొన్నాను. నటిగా నా కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ నీల. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ పాత్రకి కనెక్ట్ అవుతారు.
మను ఎందుకు హిట్ అవ్వదు చెప్పండి..
“మను సినిమా కోసం చాలా ఏళ్ళు స్పెండ్ చేశావు, ఆ సినిమా హిట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి” అని కొందరు ప్రశ్నిస్తుంటారు. వాళ్లందర్నీ నేను ప్రశ్నిస్తున్నాను.. “మను సినిమా ఎందుకు హిట్ అవ్వదు చెప్పండి?”. రూపాయి ఆశించకుండా, కేవలం కథను, దర్శకుడ్ని నమ్మి ఇంతమంది మనసా-వాచా-కర్మణా పనిచేస్తూ మా సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఏమాత్రం వేస్ట్ అవ్వదు అని మాత్రం గట్టిగా నమ్మగలను. ఆ నమ్మకంతోనే చెబుతున్నాను. “మను” కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనే విషయం గురించి నేను కామెంట్ చేయను కానీ.. మంచి సినిమాగా మాత్రం నిలిచిపోతుంది.
రెమ్యూనరేషన్ అనేది నాకెప్పుడూ ఇంపార్టెంట్ కాదు..
నా గురించి మార్కెట్ లో చిన్న బ్యాడ్ రూమర్ ఉంది. అదేంటంటే నేను రెమ్యూనరేషన్ కోసం సినిమాలు చేస్తానని. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ.. ఇప్పటివరకూ నేను రెమ్యూనరేషన్ కోసం సినిమా ఎప్పుడూ ఒప్పుకోలేదు. చేసిన కొన్ని సినిమాలకి 50% రెమ్యూనరేషన్ కూడా అందకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ.. నేను మాత్రం అందిన రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను.. “కథ నచ్చితే.. రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా నటించడానికి నేను రెడీ”.
నేను కెమెరా కోసం కాదు, నాకోసం నటిస్తాను..
“చాందిని చౌదరి మంచి హీరోయిన్ అనిపించుకోవడం కంటే.. చాందిని చౌదరి మంచి ఆర్టిస్ట్, ఎలాంటి పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతుంది” అనిపించుకోవడం నాకు ఇష్టం. నాకు నటనలో షార్ట్ ఫిలిమ్స్ మినహా పెద్దగా అనుభవం లేకపోయినా.. నేను కెమెరా కోసం కాదు నాకోసం, నాలోని నటిని సంతృప్తిపరచడం కోసం నటిస్తాను.
ప్లాన్ చేసుకోను.. చేసుకుంటే జరగడం లేదు..
నా నెక్స్ట్ సినిమా ఇలా ఉండాలి, ఈ స్టార్ హీరోతో నటించాలి అని నేను ఎప్పుడూ ప్లాన్ చేసుకొను. కేవలం ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచిస్తాను. ముఖ్యంగా “మను”విడుదల తర్వాత దర్శకులు నన్ను చూసే దృష్టికోణం పూర్తిగా మారిపోతుందని భావిస్తున్నాను. అందుకే.. “మను” మేకింగ్ లో ఉన్నప్పుడు ఎన్ని ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. “మను” రిలీజ్ తర్వాత నాకు లభించే స్పందన బట్టి నా తదుపరి చిత్రాల ఎంపిక ఉంటుంది.
ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరూ లేరు..
ఈ నాలుగేళ్లలో ఇండస్ట్రీలో స్నేహితులను పెద్దగా సంపాదించుకోలేదు. నేను పార్టీ గర్ల్ ను కాదు. ఆ పబ్ లలో, పెద్ద సౌండ్ లో అరుచుకుంటూ డ్యాన్స్ చేయడం నాకు నచ్చదు. సరదాగా స్నేహితులతో టైమ్ స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. లేదంటే హ్యాపీగా ఇంట్లో కూర్చుని బుక్స్ చదువుకుంటాను.
నా వర్క్ బట్టి నన్ను ప్రోత్సాహించాలి..
ఇండస్ట్రీ మొత్తం నన్ను ఆదరించాలి, నాకు అవకాశాలు ఇవ్వాలి అని నేనెప్పుడూ కోరుకోలేదు. నాకున్న కోరిక ఏంటంటే.. ఒక నటిగా నా సామర్ధ్యం ఏంటో గ్రహించి దాన్ని బట్టి నన్ను ఎంకరేజ్ చేయాలి కానీ.. తెలుగమ్మాయిని కాబట్టి నాకు ఆఫర్లు ఇవ్వాలనో లేక నా మొహం చూసి నాకు ఆఫర్లు ఇవ్వాలని మాత్రం నేనెప్పుడూ అనుకోలేదు. నా ఆశలన్నీ “మను” మీదే ఉన్నాయి. ఇంకో రెండ్రోజుల్లో సినిమా మీ ముందుకు వస్తుంది కాబట్టి ఎలా రిసీవ్ చేసుకొంటారు అని వెయిట్ చేస్తున్నాను.
– Dheeraj Babu